Skip to main content

రాష్ట్ర గవర్నర్ నియామకం, అధికారాలు, విధులు

ప్రకరణ 153 ప్రకారం, రాష్ర్టంలో పరిపాలన, కార్యనిర్వాహక, ఇతర అన్ని అంశాలు గవర్నర్ పేరుతో కొనసాగుతాయి.
గవర్నర్
గవర్నర్ గురించి ప్రకరణలు 153 నుంచి 167 వరకు తెలుపుతాయి. రాష్ర్టంలో గవర్నర్ రాజ్యాంగాధినేత, ప్రధాన కార్యనిర్వహణాధికారి, ప్రథమ పౌరుడు. నిబంధన 154 ప్రకారం రాష్ర్ట పరిపాలన గవర్నర్ పేరుతో జరుగుతుంది. నిబంధన 163(1) ప్రకారం ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏర్పాటైన మంత్రి మండలి ఆయనకు సహాయపడుతుంది.
గవర్నర్ - నియామకం:
నిబంధన 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. 1956లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా ‘ఒకే గవర్నర్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగవచ్చు’ అని నిబంధన 153లో చేర్చారు. నిబంధన 155 ప్రకారం గవర్నర్‌ను రాష్ర్టపతి నియమిస్తారు.
గవర్నర్ నియామకానికి సంబంధించి సర్కారియా కమిటీ చేసిన సూచనలు..
1) ఏదో ఒక రంగంలో నిష్ణాతుడైన వ్యక్తిని గవర్నర్‌గా నియమించాలి.
2) సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.
3) గవర్నర్‌ను నియమించే సమయంలో సంబంధిత రాష్ర్ట ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
గవర్నర్ - అర్హతలు:

ప్రకరణ 157 ప్రకారం
1) భారతీయ పౌరుడై ఉండాలి.
2) 35 ఏళ్లు నిండాలి.
3) లాభదాయక పదవిలో ఉండకూడదు.
4) నేరారోపణ రుజువై ఉండకూడదు.
ప్రకరణ 158 ప్రకారం గవర్నర్‌గా నియమితుడయ్యే వ్యక్తి పార్లమెంట్ లేదా విధానసభలో సభ్యుడై ఉండకూడ‌దు. సభ్యుడై ఉంటే గవర్నర్‌గా నియమితులైన వెంటనే సభ్యత్వం కోల్పోతారు.
గవర్నర్ - పదవీ ప్రమాణం
నిబంధన 159 ప్రకారం గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన లేకుంటే సీనియర్ న్యాయమూర్తి చేయిస్తారు. గవర్నర్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తారు.
గవర్నర్ - జీతభత్యాలు
నిబంధన 158 ప్రకారం గవర్నర్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. దీన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. జీతభత్యాలను తగ్గించే అవకాశం లేదు. ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. గవర్నర్ జీతం రూ.1,10,000. ఉచిత నివాసం, సౌకర్యాలు కల్పిస్తారు. రాజ్‌భవన్ అధికార నివాసం.
గవర్నర్ - పదవీ కాలం
ప్రకరణ 156 ప్రకారం గవర్నర్ పదవీ కాలం ఐదేళ్లు. కానీ పదవీ కాలం పూర్తి కాకముందే ఎప్పుడైనా గవర్నర్‌ను రాష్ట్రపతి తొలగించవచ్చు. అంటే రాష్ర్టపతి విశ్వాసం మేరకే గవర్నర్ కొనసాగుతారు. ఒక వ్యక్తిని ఎన్నిసార్లు అయినా గవర్నర్‌గా నియమించవచ్చు.
గవర్నర్ - అధికారాలు, విధులు
గవర్నరు అధికార విధులను కింది విధంగా వర్గీకరించవచ్చు.
1) కార్యనిర్వాహక అధికారాలు
2) శాసన నిర్మాణ అధికారాలు
3) ఆర్థికాధికారాలు
4) న్యాయాధికారాలు
5) విచక్షణాధికారాలు
కార్యనిర్వాహక అధికారాలు
ప్రకరణ 154 ప్రకారం రాష్ర్ట కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్ పేరుతో జరుగుతాయి. ఈ అధికారాలను ఆయన స్వయంగా లేదా అధికారుల ద్వారా నిర్వహిస్తారు.
రాష్ర్టంలో గవర్నర్ చేసే నియామకాలు:
  • ముఖ్యమంత్రి, మంత్రి మండలి నియామకం (ప్రకరణ 164(1))
  • రాష్ర్ట అడ్వకేట్ జనరల్ నియామకం (ప్రకరణ 165)
  • రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం (ప్రకరణ 316)
  • రాష్ర్ట ఎన్నికల సంఘం నియామకం (ప్రకరణ 243కె)
  • రాష్ర్ట ఆర్థిక సంఘం (ప్రకరణ 243)
  • రాష్ర్ట అధికార భాషా సంఘం, మైనారిటీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌ల చైర్మన్‌లు, సభ్యుల నియామకం.
  • రాష్ర్ట విశ్వవిద్యాలయాలకు చాన్‌‌సలర్‌గా వ్యవహరిస్తారు. ఈ హోదాలో వైస్ చాన్‌‌సలర్లను నియమిస్తారు.
  • రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ పేరుతోనే నియమితులవుతారు.
శాసనాధికారాలు
ప్రకరణ 168 ప్రకారం, రాష్ర్ట గవర్నర్ శాసనసభలో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు. శాసనసభలో అన్ని ప్రక్రియలు గవర్నర్‌తో ముడిపడి ఉంటాయి. అవి..
  • రాష్ర్ట శాసనసభను సమావేశపర్చడం, దీర్ఘకాలిక వాయిదా వేయడం(Prorogue), రద్దు చేయడం(Dissolve). (ప్రకరణ 174)
  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం, సభలకు సమాచారాన్ని పంపడం. (ప్రకరణ 175)
  • శాసనసభను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయొచ్చు. (ఏటా మొదటి సమావేశం, ప్రతి కొత్త విధానసభ మొదటి సమావేశం) (ప్రకరణ 176(1))
  • విధాన పరిషత్‌కు వ వంతు సభ్యులను నామినేట్ చేయడం. (ప్రకరణ 171)
  • శాసన సభ్యుల అనర్హతలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. (ప్రకరణ 192(1), 192(2)).
  • రాష్ర్ట శాసన సభ ఆమోదించిన బిల్లుకు తన ఆమోదాన్ని తెలపడం లేదా రాష్ర్టపతి పరిశీలనకు పంపడం. (ప్రకరణ 200)
  • బిల్లులను రాష్ర్టపతి పరిశీలనకు పంపడానికి వాటిని నిలిపి ఉంచడం. (ప్రకరణ 201)
  • రాష్ర్ట విధానసభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం. (ప్రకరణ 333)
  • శాసన సభ సమావే శంలో లేనప్పుడు ఆర్డినెన్‌‌సలను జారీచేయడం. (ప్రకరణ 213)
  • రాష్ర్ట శాసన సభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడం, పునఃపరిశీలనకు పంపడం లేదా తిరస్కరించడం (ప్రకరణ 200)
  • రాష్ర్ట ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలను శాసనసభ ముందుంచడం.
ఆర్డినెన్‌‌సలు జారీ చేసే అధికారం (ప్రకరణ 213(1))
  • రాష్ర్ట శాసనసభ సమావేశంలో లేనప్పుడు, ప్రత్యేక పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రభుత్వ అవసరాల కోసం ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్‌‌సను జారీ చేయవచ్చు. అయితే ఆర్డినెన్‌‌సను ఉభయ సభలు సమావేశమైన ఆరు వారాల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదించకపోతే ఆర్డినెన్‌‌స రద్దవుతుంది. ఈ లోగా ప్రభుత్వం ఆర్డినెన్‌‌స స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆర్డినెన్సులో పేర్కొన్న అంశాలపై శాసనసభ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ ఆర్డినెన్‌‌సకు చట్టానికున్న హోదా, అధికారం ఉంటుంది. ఆర్డినెన్‌‌సను గవర్నర్ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
ఆర్థికాధికారాలు
  • ప్రతి ఆర్థిక సంవత్సరం, వార్షిక బడ్జెట్‌ను సభలో సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. (ప్రకరణ 202)
  • ద్రవ్య బిల్లులను గవర్నర్ అనుమతితో విధానసభలో ప్రవేశపెట్టాలి. (ప్రకరణ 207)
  • గవర్నర్ అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించలేరు. మార్పులు కూడా చేయలేరు.
  • రాష్ర్ట ఆగంతుక నిధిని గవర్నరు నిర్వహిస్తారు. (ప్రకరణ 267)
  • రాష్ర్ట ప్రజానిధిని నిర్వహిస్తారు. (ప్రకరణ 266)
న్యాయాధికారాలు
ప్రకరణ 161 ప్రకారం, గవర్నర్‌కు కొన్ని న్యాయాధికారాలు ఉన్నాయి. న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు. మార్పు చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు. శిక్ష అమలును వాయిదా వేయొచ్చు, క్షమాభిక్ష కూడా పెట్టవచ్చు. ఉరిశిక్షను రద్దు చేసే అధికారం లేదు. న్యాయాధికారాలు సంబంధిత రాష్ర్ట భూభాగానికి మాత్రమే పరిమితం అవుతాయి. సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో, శిక్షల్లో గవర్నరు జోక్యం చేసుకునే అధికారం లేదు. రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్‌ను రాష్ర్టపతి సంప్రదిస్తాడు.
గమనిక: ఆర్డినెన్స్ జారీ చేయడం గవర్నర్ విచక్షణాధికారం కాదు. మంత్రి మండలి సలహామేరకే జారీ చేస్తారు.
విచక్షణాధికారాలు
రాజ్యాంగంలో గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలు కల్పించారు. మంత్రి మండలి సలహా లేకుండానే ఆయన కొన్ని అధికారాలను, విధులను నిర్వహిస్తారు. కింద పేర్కొన్న విధులను గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరిస్తారు.
  • అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ర్ట గవర్నర్లకు ఆ రాష్ట్రాల గిరిజన ప్రాంతాల పరిపాలనపై విచక్షణాధికారాలున్నాయి.
  • నాగాలాండ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక అధికారాలున్నాయి.
  • మహారాష్ర్టలో వెనుకబడిన ప్రాంతాలైన విదర్భ, మరట్వాడా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
  • గుజరాత్‌లోని సౌరాష్ర్ట, కచ్ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ రాష్ర్ట గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.
  • రాష్ర్టంలో నెలకొని ఉన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం.
  • రాష్ర్టంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా రాష్ర్టంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించలేనపుడు రాష్ర్టపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం. (ప్రకరణ 356)
  • రాష్ర్ట శాసనసభ రూపొందించిన బిల్లులు తన ఆమోదానికి వచ్చినపుడు, ఆమోదం తెలపకుండా రాష్ర్టపతి పరిశీలనకు పంపవచ్చు. (ప్రకరణ 201)
గవర్నర్ పదవి - ప్రత్యేక రక్షణలు
  • 361(1) ప్రకారం రాష్ర్టపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ అధికార విధుల నిర్వహణలో వ్యవహరించిన తీరును ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.
  • 361(2) ప్రకారం రాష్ర్టపతి లేదా గవర్నర్ పదవిలో ఉన్న కాలంలో ఏ కోర్టులోనూ వారికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ కేసులను, ప్రొసీడింగ్‌లను ప్రారంభించొద్దు లేదా కొనసాగించొద్దు.
గవర్నర్ పాత్ర
గవర్నర్ పదవి కేంద్రంలోని రాష్ర్టపతి స్థానాన్ని పోలి ఉంటుంది. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా  రాష్ర్టంలో రాజ్యాంగపర అధిపతిగా రెండు సున్నిత, క్లిష్టమైన పాత్రలను నిర్వహిస్తారు. కేంద్ర ఆ దేశాలను రాష్ట్రాలు పాటించేలా చర్యలు తీసు కుంటారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహామేరకు వ్యవహరించినప్పటికీ సందర్భాన్ని బట్టి గవర్నర్ విచక్షణాధికారాలను వినియోగించి నిర్ణయాలు తీసుకుంటారు.
 అయితే గవర్నర్ల నియామకం, వారి పాత్ర, వ్యవహారశైలి, ఎన్నో విమర్శలకు గురికావడం లేదా వివాదం కావడం తరచు జరుగుతోంది. రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేయడం, రాజకీయ అవసరాల కోసం గవర్నర్ పదవి, దాని ఔన్నత్యం దుర్వినియోగమవుతోంది. గవర్నర్ పదవిని రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉత్తమ లక్షణాల ప్రాతిపదికపై నిర్వర్తించాలని 1994లో ఎస్.ఆర్. బొమ్మైకేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘గవర్నర్ పదవి బంగారు పంజరంలో చిలుక’గా పద్మజ నాయుడు అభివర్ణించారు.
Published date : 09 Sep 2015 03:35PM

Photo Stories