Skip to main content

భారత రాజ్యాంగం -చారిత్రక నేపథ్యం

భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, ఉద్యమాలు, సంస్కరణలు దోహదం చేశాయి.
భారతదేశంలో 1773-1857 మధ్యకాలంలో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం, ఇతర వ్యవహారాలను నిర్వహించింది. వీటిని నియంత్రిచడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే ‘చార్టర్ చట్టాలు’ అంటారు. వీటి గురించి పరిశీలిద్దాం..
రెగ్యులేటింగ్ చట్టం-1773
రెగ్యులేటింగ్ చట్టానికి రాజ్యాంగ వికాసపరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన తొలి చట్టం ఇదే. అందువల్ల దీన్ని భారతదేశానికి సంబంధించి ‘మొట్టమొదటి లిఖిత చట్టం’(First Written Charter)గా పేర్కొంటారు. అంతకుముందు వరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్టిండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలన, అధికారాలు సంక్రమించాయి. దీంతో భారతదేశంలో ‘కేంద్రీకృత పాలన’కు బీజం పడిందని చెప్పవచ్చు.
ముఖ్యాంశాలు
  • ఈ చట్టాన్ని 1773 మే 18న నాటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించే ఉద్దేశంతో రూపొందించడం వల్ల దీన్ని ‘రెగ్యులేటింగ్ చట్టం’ అంటారు.
  • బెంగాల్ గవర్నర్ హోదాను ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’గా మార్చారు. ఇతడికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ‘వారన్ హేస్టింగ్స్’ను తొలి గవర్నర్ జనరల్‌గా నియమించారు.
  • బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్‌కు ఆధీనులుగా చేశారు.
  • కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ‘ఎలిజా ఇంఫే’.
  • ఈస్టిండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి తమ రెవెన్యూ, పౌర, సైనిక వ్యవహారాల్లో కంపెనీ కోర్‌‌ట ఆఫ్ డెరైక్టర్‌‌స నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు.
  • కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను నిషేధించారు. వారు ప్రజల నుంచి లంచాలు, బహుమతులను స్వీకరించకుండా కట్టడి చేశారు.
  • ఇరవై ఏళ్ల వరకు ఈస్టిండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు.
రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీని ఆశించినంతగా నియంత్రించలేకపోయారు. కేంద్రీకృత పాలనను నిరోధించడం, అధికార సమతౌల్యం లాంటి ప్రయోజనాలు నెరవేరలేదు. అదేవిధంగా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక పరిధిపై స్పష్టత ఏర్పడలేదు.
పిట్-ఇండియా చట్టం-1784
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. నాటి బ్రిటన్ ప్రధాని ‘విలియం పిట్’ ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. అందువల్ల దీన్ని ‘పిట్ ఇండియా చట్టం’గా వ్యవహరిస్తారు.
ముఖ్యాంశాలు
  • ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించారు.
  • ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్’ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ వ్యవహారాలను దీనికి అప్పగించారు. అప్పటికే ఉన్న కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు.
  • గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలోనూ కొన్ని మార్పులు చేశారు.
  • కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించారు.
ఈ చట్టం వల్ల కంపెనీ పాలనపై ఒక విధమైన అదుపు ఏర్పడింది. కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే రెండు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల పిట్ ఇండియా చట్టాన్ని ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టంగా చెప్పవచ్చు. ‘పార్లమెంటేతర నియంత్రణకు తొలి అడుగు’గా ఈ చట్టాన్ని ప్రస్తావిస్తారు. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా మార్క్స్, ఎంగిల్స్ అభివర్ణించారు.
చార్టర్ చట్టం-1793
  • ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు.
  • కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏళ్లకు పొడిగించారు.
  • బోర్డు కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించారు.
చార్టర్ చట్టం-1813
  • ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో ఇరవై ఏళ్లు పొడిగించారు.
  • భారతదేశ వర్తకంపై కంపెనీ గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పాలనాపరమైన సంస్థగా మార్చారు.
  • పన్నులు విధించడం, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
  • భారతీయులకు మత, విద్యాపరమైన అధ్యయనం కోసం లక్ష రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు.
ఈ చట్టం ద్వారా భారత్‌లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు. భారత్‌లో మిషనరీలు ప్రవేశించి చర్చిలు, ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించడం వల్ల మతమార్పిడులకు వెసులుబాటు కలిగింది.
చార్టర్ చట్టం-1833
  • ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లకు పొడిగించారు.
  • బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఈ చట్టం ద్వారా ‘ఇండియన్ గవర్నర్ జనరల్’గా మార్చారు. ఈ హోదాలో మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్.
  • రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు రద్దయ్యాయి. కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలు లభించాయి.
  • కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
  • సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనిక పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
  • భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ ‘లా’ కమిషన్‌ను నియమించారు. దీనికి తొలి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
  • ఈ చట్టాన్ని భారతదేశంలో ‘కేంద్రీకృత పాలనకు తుదిమెట్టు’గా అభివర్ణిస్తారు.
చార్టర్ చట్టం-1853
చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఇదే. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి చార్టర్ చట్టాలను పొడిగించడం అనే ఆనవాయితీ ప్రకారం దీన్ని రూపొందించారు. కానీ దీని ద్వారా కంపెనీ పాలనను పొడిగించలేదు. దీంతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయింది.
ముఖ్యాంశాలు
  • గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ‘ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంటులా విధులు నిర్వర్తిస్తుంది. అందువల్ల దీన్ని ‘మినీ పార్లమెంట్’గా పేర్కొంటారు.
  • కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో.. మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరి చొప్పున నలుగురిని తీసుకున్నారు.
  • సివిల్ సర్వీసు నియామకాల్లో ‘సార్వజనిక పోటీ విధానం’ ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
  • వివిధ ‘లా కమిషన్’ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)ను రూపొందించారు.
కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధి పేర్కొనకపోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి చార్టర్ చట్టం మార్గం సుగమం చేసిందని భావిస్తారు. భారతీయులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల తర్వాత జరిగిన పరిణామాలు సిపాయిలు తిరుగుబాటుకు దారితీశాయి.
బ్రిటిష్ రాణి లేదా రాజు పాలన (1858 -1947)
1858 నుంచి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసిన చట్టాలను/సవరణలను ‘భారత ప్రభుత్వ చట్టాలు’ లేదా ‘కౌన్సిల్ చట్టాలు’ అంటారు.
భారత రాజ్యాంగ చట్టం-1858
1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పాలన అంతమై చక్రవర్తి (బ్రిటిష్ రాజు/రాణి) పరిపాలన వచ్చింది. ఇది భారత రాజ్యంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేసింది.
ముఖ్యాంశాలు
  • గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్.
  • దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్. ఇతడు బ్రిటిష్ రాణి పేరుపై దేశ పాలన నిర్వహిస్తాడు.
  • 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయింది.
  • భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్‌ని రాజ ప్రతినిధిగా 5 ఏళ్ల కాలానికి నియమించారు. ఇతడికి సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది.
  • ‘భారత రాజ్య కార్యదర్శి’ అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడు బ్రిటిష్ మంత్రివర్గానికి చెందిన వ్యక్తి. అన్ని విషయాల్లో ఇతడిదే తుది నిర్ణయం. ఇతడికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి చార్లెస్ వుడ్.
ప్రత్యేక వివరణ:
వైస్రాయ్, గవర్నర్ జనరల్ అనే రెండు హోదాలు ఒకరికే ఉంటాయి. బ్రిటిష్ రాజు/రాణి ప్రతినిధిగా ఉంటే వైస్రాయ్‌గా, భారతదేశ పాలనాపరంగా అధిపతిగా ఉంటే గవర్నర్ జనరల్‌గా వ్యవహరిస్తారు.
దేశంలో పాలనాపరమైన అంశాలను.. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి 1858 చట్టాన్ని చేశారని, వీటికి సంబంధించిన మార్పులను ఇంగ్లండులో చేశారేగానీ, భారత్‌లోని పాలనా వ్యవస్థలకు ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శకుల అభిప్రాయం.

సి.ఆర్. ఫార్ములా (1944) (సి. రాజగోపాలాచారి సూత్రం)
ముస్లిం లీగ్ సహకారం కోసం, మతసమస్యల పరిష్కారం కోసం 1944 మార్చిలో గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్ తరఫున సి.రాజగోపాలాచారి ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్‌కు కావాల్సిన స్వతంత్ర సాధన, దాని కోసం ముస్లింల సహకారాన్ని పొందేందుకు ఎంత నష్టాన్నైనా భరించటానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ముస్లిం లీగ్ మాత్రం దేశ స్వాతంత్య్రం గురించి పట్టించుకోకుండా, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనకు అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరింది.
వేవెల్ ప్రణాళిక (1945)
భారత వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ముఖ్యాంశాలు
  • భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారికి సముచిత ప్రాతినిధ్యం కోసం వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని విస్తరించడం.
  • భారతదేశంలోని బ్రిటిష్ వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హైకమిషనర్‌ను నియమించడం.
  • వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారిగా భారతీయుడిని నియమించడం.
  • వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం. దీని కోసం వైస్రాయి 1945 జూలైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ కాంగ్రెస్ అవిభాజ్య భారతదేశం (యునెటైడ్ ఇండియా) కోసం పట్టుబట్టింది. ముస్లిం లీగ్ మాత్రం దేశ విభజనను సమర్థించింది.
కేబినెట్ మిషన్ (1946) (కేబినెట్ రాయబారం)
బ్రిటన్ ప్రధాని అట్ల్లీ.. 1946 మార్చిలో పార్లమెంటులో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించి ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. ‘అల్ప సంఖ్యాకుల హక్కులపై మాకు అవగాహన ఉంది. అల్పసంఖ్యాకులు నిర్భయంగా జీవించాలి. అయితే అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్ప సంఖ్యాక వర్గాన్ని కూడా మనం అనుమతించలేం’ అని పేర్కొన్నారు. అందులో భాగంగా బ్రిటన్‌లో కేబినెట్ మంత్రులైన సర్ స్టాఫర్‌‌డ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్, లార్‌‌డ పెథిక్ లారెన్స్ సభ్యులుగా మంత్రుల బృందం భారత పర్యటన ప్రారంభించింది. ఈ బృందానికి సర్ పెథిక్ లారెన్స్ నేతృత్వం వహించారు. 1946 మే 16న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు.
ముఖ్యాంశాలు
  • బ్రిటిష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలు, ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ యూనియన్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ లాంటి జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను నిర్వహిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
  • ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పడుతాయి. పరిపాలనా నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
  • పాకిస్తాన్ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు.
  • రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది.
తాత్కాలిక ప్రభుత్వం (1946)
బ్రిటిష్ ప్రభుత్వం 1946 ఆగస్టు 24న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. దీనికి అనుగుణంగా 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్, 1946 అక్టోబర్ 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్ తరఫున వల్లభాయ్‌పటేల్, రాజేంద్ర ప్రసాద్, అరుణా అసఫ్ అలీ, రాజగోపాలాచారి, జగ్జ్జీవన్‌రామ్ లాంటి ప్రముఖులు, ముస్లిం లీగ్ తరఫున లియాఖత్ అలీఖాన్, జె.ఎన్.మండల్, గజ్నేఫర్ అలీఖాన్ లాంటి నాయకులు మంత్రులుగా, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా వ్యవహరించారు.
అట్ల్లీ ప్రకటన (1947)
1947 ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి వైదొలుగుతుందని ప్రకటించారు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు.
ఈ ప్రకటనను బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా మహాత్మాగాంధీ వర్ణించారు.
మౌంట్‌బాటన్ ప్రణాళిక (1947)
భారతదేశ రాజ ప్రతినిధి, గవర్నర్ జనరల్ గా నియమితుడైన మౌంట్‌బాటన్ దేశంలోని రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు జరిపి, సమైక్య భారతదేశ ప్రాతిపదికన కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీల మధ్య అంగీకారం కుదర్చడం సాధ్యం కాదనీ, దేశ విభజన ఒక్కటే పరిష్కారంగా భావించి ప్రణాళిక తయారు చేశారు.
ముఖ్యాంశాలు
  • ఇండియన్ యూనియన్‌ను భారత్, పాకిస్తాన్ అనే రెండు రాజ్యాలుగా విభజిస్తారు.
  • 1948 జూన్‌కు బదులుగా 1947 ఆగస్టు 15 న రెండు దేశాలుగా విడిపోతాయి.
  • అసోం భారత్‌లో అంతర్భాగంగా ఉండగా బెంగాల్, పంజాబ్‌లను మత ప్రాతిపదికన విభజించారు. అయితే ముస్లింలు అధికంగా ఉండే సిల్హట్(బెంగాల్) జిల్లా విషయంలో మాత్రం అది తూర్పు బెంగాల్‌లో లేదా అసోంలో చేరడమా అనే విషయం ప్ర జాభిప్రాయ సేకరణ ద్వారా జరుగుతుంది.
  • బెలూచిస్థాన్ వాయవ్య ప్రాంతాలు భారత్ లేదా పాకిస్తాన్‌లో కానీ చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
  • పంజాబ్, బెంగాల్, అసోం లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను విభజించే విషయంలో రెండు సరిహద్దు సంఘాలను నియమించారు.
  • బ్రిటన్ ఆధ్వర్యంలోని కామన్‌వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్తాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
భారత స్వాతంత్య్ర చట్టం (1947)
భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం రూపొందించిన చివరి చట్టం ఇదే. బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ ఆధ్వర్యంలో భారత గవర్నర్ జనరల్ లార్‌‌డ లూయిస్ మౌంట్‌బాటన్ సలహా మేరకు 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంటులో భారత స్వాతంత్య్ర ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బ్రిటిష్ రాణి 1947 జూలై 18 న సంతకం చేసింది. ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
ముఖ్యాంశాలు
  • ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటికోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటవుతాయి.
  • స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారంతోపాటు భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దవుతుంది.
  • బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
  • వైస్రాయ్ పదవి రద్దు అవుతుంది.
  • రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది.
  • గవర్నర్ జనరల్, రాష్ర్ట గవర్నర్లు రాజ్యాంగ పరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు.
  • లార్‌‌డ మౌంట్‌బాటన్ మొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
ప్రముఖుల వ్యాఖ్యానాలు
 నడిరాత్రి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగి ఉన్నపుడు భారతదేశం మేల్కొని ఊపిరిని, స్వేచ్ఛను పొందుతుంది. భారతదేశ ప్రజలు విశాల మానవాళి సేవ కోసం ప్రయాణాన్ని చేయడం ఈ సమయంలో ఆవశ్యకం. భారతదేశ సేవ అంటే దేశంలోని కోట్లాది పీడితుల సేవ.
 - నెహ్రూ
 మన స్వల్పమైన బాధలు, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సంప్రదాయాలు కూడా కొద్దో, గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి.
 - డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్

గతంలో అడిగిన ప్రశ్నలు

1. భారతప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది?
ఎ) బ్రిటిష్‌రాణి/ రాజు
బి) ఇంగ్లండు పార్లమెంటు
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్‌లోని గవర్నర్ జనరల్

Published date : 30 Sep 2015 05:17PM

Photo Stories