Skip to main content

భారత పార్లమెంట్

కేంద్ర స్థాయిలో శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంట్ (సంసద్). రాజ్యాంగంలోని 79వ అధికరణం ప్రకారం పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. రాజ్యాంగంలో అయిదో భాగంలోని రెండో అధ్యాయంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు భారత పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పేర్కొంటున్నాయి.
  • భారతదేశంలో 1952 నుంచి 1962 వరకు ద్విసభ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేసేవారు.
  • బ్రిటిష్ పార్లమెంట్‌లా భారతదేశ పార్లమెంట్‌కు సార్వభౌమాధికారం లేదు.
  • 1954లో మొదటి లోక్‌సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్ (గణేష్ వాసుదేవ్ మౌలాంకర్) ప్రజా ప్రతినిధుల సభకు లోక్‌సభ అని, రాష్ట్రాల మండలికి రాజ్యసభ అని నామకరణం చేశాడు.
  • రాజ్యాంగంలో రాజ్యసభకు ‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్’, లోక్‌సభకు ‘హౌస్ ఆఫ్ ది పీపుల్’ అనే పదాలను ఉపయోగించారు. కానీ హిందీ భాషా పదాలైన రాజ్యసభ, లోక్‌సభ అనే పదాలే జన బాహుళ్యంలో వాడుకలోకి వచ్చాయి.
రాజ్యసభ
భారత రాజ్యాంగంలోని 80వ అధికరణను అనుసరించి రాజ్యసభను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పండితులు దీన్ని ‘ఎగువసభ’, ‘రాష్ట్రాల పరిషత్’, ‘పెద్దల సభ’గా వర్ణించారు.
  • రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పాటైంది.
  • రాజ్యసభ తొలి సమావేశాన్ని 1952 మే 13న నిర్వహించారు.
  • హిందీలో ‘రాజ్య’ అంటే రాష్ట్రం అని అర్థం. అందువల్ల రాజ్యసభ అంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభగా పేర్కొనవచ్చు.
  • రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250 మంది. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు.
  • ప్రస్తుతం 4వ షెడ్యూల్ ప్రకారం మొత్తం రాజ్యసభకు కేటాయించిన సభ్యుల సంఖ్య 233. సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సామాజిక సేవ మొదలైన రంగాల్లో విశేషానుభవం ఉన్న 12 మంది సభ్యులను 80(3)వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
  • రాజ్యాంగంలోని 80(2)వ అధికరణం ప్రకారం రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు.
  • 80(4)వ అధికరణం ప్రకారం పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం ఉంటుంది.
  • 80(5)వ అధికరణం ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల కేటాయింపు రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ ప్రకారం జరగాలి.
  • భారత రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తోంది. కాబట్టి పార్లమెంట్‌లో రాష్ట్రాల ప్రాతినిధ్యం అవసరమైంది. ఈ కారణంగా రాజ్యసభను ఏర్పాటు చేశారు.
  • ‘ప్రతి రాష్ట్రం నుంచి ఎగువ సభలో సమాన ప్రాతినిధ్య పద్ధతి’ అనే అమెరికా సమాఖ్యకు చెందిన విధానం మన రాజ్యాంగంలో లేదు.
  • 4వ షెడ్యూల్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ఆధారంగా రాజ్యసభలో ప్రతినిధుల సంఖ్యను నిర్ణయించారు.
  • ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేటాయించిన సభ్యుల సంఖ్య 31 మంది.
  • నాగాలాండ్, మణిపూర్ నుంచి ఒక్కో సభ్యుడిని మాత్రమే కేటాయించారు.
  • రాజ్యసభకు నిర్వహించే ఎన్నికల పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
రాజ్యసభకు పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు:
  1. భారతదేశ పౌరుడై ఉండాలి.
  2. వయసు కనీసం 30 ఏళ్లు ఉండాలి.
  3. ఆదాయాన్ని పొందే ప్రభుత్వ ఉద్యోగం చేయడదు.
  4. పార్లమెంట్ చట్టాలరీత్యా నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
శాశ్వత సభ: లోక్‌సభలా రాజ్యసభకు నిర్ణీత కాల పరిమితి ఉండదు. ఇది శాశ్వత సభ. ఇది రద్దు కాదు. మొత్తం సభ్యుల్లో మూడో వంతు సభ్యులు ప్రతి రెండేళ్లకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. వీరి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకుంటారు. పదవీ విరమణ చేసిన సభ్యులు తిరిగి పోటీ చేయవచ్చు. ఒక్కో సభ్యుడు ఆరేళ్లు కొనసాగుతాడు.
  • అధికరణ 83(1) ప్రకారం రాజ్యసభ కాలపరిమితి గురించి వివరించారు.
  • 89వ అధికరణం ప్రకారం రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా ఉప రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఈయనకు నిర్ణాయక ఓటు ఉంటుంది.
  • రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
  • మొదటి రాజ్యసభ చైర్మన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
  • మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ - ఎస్.వి. కృష్ణమూర్తి రావు.
  • రాజ్యసభ సమావేశానికి కావాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్యను ‘కోరమ్’ అంటారు. మొత్తం సభ్యుల్లో పదో వంతును కోరమ్‌గా పరిగణిస్తున్నారు.
రాజ్యసభ ప్రత్యేక అధికారాలు:
  1. 67వ అధికరణం ప్రకారం ఉప రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
  2. అధికరణ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశానికి జాతీయ ప్రాముఖ్యం ఉందని భావించి రాజ్యసభ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే ఏడాది కాలానికి చెల్లుబాటయ్యే విధంగా శాసనం చేయవచ్చు.
  3. అధికరణ-312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్లు ముందుగా రాజ్యసభ ఆమోదం పొందాలి.
  • రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు - ఢిల్లీ, పుదుచ్చేరి.
  • జాతీయ అత్యవసర పరిస్థితి విధింపునకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ ఒక నెల లోపు ఆమోదించాలి.
  • రాష్ట్రపతి పాలనకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ రెండు నెలల్లోపు ఆమోదించాలి.
  • లోక్‌సభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను రాజ్యసభ 14 రోజుల్లోపు ఆమోదించాలి.
రాజ్యసభలో అత్యధిక స్థానాలున్న రాష్ట్రాలు:

వ‌.సం.

రాష్ట్రం

సభ్యులు

1.

ఉత్తరప్రదేశ్

31

2.

మహారాష్ట్ర

19

3.

తమిళనాడు

18

4.

పశ్చిమ బెంగాల్

16

5.

బీహార్

16

6.

కర్ణాటక

12

7.

ఆంధ్రప్రదేశ్

11

8.

మధ్యప్రదేశ్

11

9.

గుజరాత్

11

  • రాజ్యసభలో ఒక సభ్యుడిని మాత్రమే కలిగి ఉన్న రాష్ట్రాలు: అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గోవా, మేఘాలయా, సిక్కిం, త్రిపుర.
  • కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం) నుంచి రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • తెలంగాణ, అసోం, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఏడుగురు సభ్యుల చొప్పున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజ్యసభ చైర్మన్: పార్లమెంట్‌లోని ఉభయసభలను నిర్వహించడానికి విడివిడిగా సభాధ్యక్షులు ఉంటారు. 89వ అధికరణం ప్రకారం భారత ఉప రాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • ఏ కారణంగానైనా రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ సభను నిర్వహిస్తారు.
  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా అందుబాటులో లేనప్పుడు సభా నియమావళి ప్రకారం ఎంపిక చేసిన ఒక సీనియర్ సభ్యుడు సమావేశాలను నిర్వహిస్తారు.
  • రాజ్యాంగంలో 89 నుంచి 92 వరకు ఉన్న అధికరణలు రాజ్యసభ సభాధ్యక్షుల ఎన్నిక, రాజీనామా, సమావేశాలకు సంబంధించిన వివరాలను తెలుపుతున్నాయి.
  • అధికరణ 97 ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రస్తుతం ఉప రాష్ట్రపతి నెలకు రూ.1,25,000 వేతనం పొందుతున్నారు. ఇతర సౌకర్యాలు, పెన్షన్ మొదలైన సదుపాయాలు కూడా ఉంటాయి.
Published date : 11 Sep 2015 04:42PM

Photo Stories