Skip to main content

జల కాలుష్యం

నీటిలో ఘన / ద్రవ పదార్థం చేరడం వల్ల నీటి నాణ్యత తగ్గి తాగడానికి/ వాడుకోవడానికి వీల్లేకుండా పోవడాన్ని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు.
(లేదా)
జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ప్రస్తుతం/భవిష్యత్తులో మానవుడు తన అవసరాలన్నింటికీ ఉపయోగించుకోవడానికి పనికిరాని కనీస నాణ్యత లేని నీటిని ‘కలుషిత నీరు’ అంటారు.
(లేదా)
నీటి సహజ లక్షణాలకు భంగం వాటిల్లడాన్నే నీటి కాలుష్యంగా పేర్కొనొచ్చు.
(లేదా)
నీటిలో అనవసర పదార్థాలు కలవడం వల్ల నీటి సహజ గుణం మారిపోయి నిరుపయోగంగా; మానవుడికి, ఇతర జీవులకు హాని కలిగించేలా మారడాన్ని నీటి కాలుష్యం అంటారు.

స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి వాసన ఉండవు. కానీ మానవుడికి అందుబాటులో ఉన్న ఒక శాతం నీటిలో అనేక పదార్థాలు కలిసి నీటి కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. సాధారణంగా భూమి ఉపరితలం పైన, భూగర్భంలో అనేక కారణాల వల్ల నీటి కాలుష్యం జరిగి అది తాగడానికి, సాగు చేయడానికి ఉపయోగపడటం లేదు.
కలుషిత నీటి లక్షణాలు..
ఎ) తాగు నీరు రుచి చెడిపోవడం
బి) సరస్సులు, చెరువులు, నదులు, సాగర తీరాల వద్ద ఘాటైన దుర్వాసన రావడం
సి) నీటిలో కలుపు మొక్కలు అదుపు లేకుండా పెరగడం
డి) జల చరాలు తగ్గిపోవడం/నశించడం

నీటి కాలుష్యానికి కారణాలు
గృహ సంబంధ మురుగు, వ్యర్థాలు:
గ్రామాల నుంచి నగరాల వరకు ఇళ్లల్లోని వివిధ అవసరాలకు వాడిన నీటిలో వ్యర్థాలు, మానవ విసర్జితాలు, కాగితాలు, దుస్తులు, సబ్బులు, డిటర్జెంట్లు మొదలైనవి కలిసి ఏర్పడినదాన్ని మురుగు అంటారు. శుద్ధి చేసిన/శుద్ధి చేయని మురుగు.. చెరువులు, సరస్సులు, నదులు తదితర జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమవుతోంది.

వ్యవసాయ వ్యర్థ పదార్థాలు: వ్యవసాయంలో వాడే ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఇతర రసాయనాలు జలాశయాల్లో చేరి ఉపరితల, భూగర్భ జలాలు తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయి. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కారణాల వల్లే నీరు కలుషితమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు: ఔషధాలను తయారుచేసే పరిశ్రమలు, బట్టలు, కాగితపు మిల్లులు, రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు, ప్లాస్టిక్, అద్దకపు రంగులు మొదలైనవాటిని తయారుచేసే పరిశ్రమలు, బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, సిమెంట్‌ పరిశ్రమలు మొదలైన వాటి నుంచి వెలువడే పదార్థాల్లోని విష రసాయనాలు, జీవక్షయం పొందని కర్బన మూలక రసాయనాలు, తైల స్వభావం గల పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమై మానవులకు, ఇతర జీవరాశులకు పనికిరాకుండా పోతుంది. లవణ మలినాల వల్ల నీటి కాఠిన్యత వచ్చి అది తాగడానికే కాకుండా పారిశ్రామిక ప్రయోజనాలకూ ఉపయోగపడదు.

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు: థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఎక్కువగా బొగ్గును ఉపయోగిస్తున్నారు. ఈ శిలాజ ఇంధనం దహనం చెందినప్పుడు వెలువడిన బూడిద రేణువులు తొలుత వాతావరణంలోకి తర్వాత జలాశయాల్లోకి చేరి కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. మనదేశంలోని ఎన్నో నదులు, సరస్సులు, వాగులు, ఇతర జలాశయాలు ఇలాంటి కాలుష్యానికి నిరంతరం గురవుతున్నాయి.

అణు వ్యర్థ పదార్థాలు: ప్రపంచంలో అణు ఇంధనాలను ఉపయోగించే దేశాలు అణు వ్యర్థాలను సముద్ర గర్భంలో, భూగర్భంలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి. ఇది దీర్ఘకాలంగా ఉండటమే కాకుండా మానవుడికి, జలచరాలకు ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది.

ప్రకృతి విపత్తులు: భారీ వర్షాల వల్ల ఏర్పడే వరదల్లో కొట్టుకొచ్చిన వ్యర్థ పదార్థాలు జలాశయాల్లో కలవడం వల్ల నీరు తీవ్రంగా కాలుష్యానికి గురవుతోంది.

చమురు (నూనె): క్రూడ్‌ ఆయిల్‌ రవాణా నౌకలు సముద్రంలో మునిగినప్పుడు ఆ చమురు జలాశయాల్లో కలవడం వల్ల నీరు కలుషితమవుతోంది. చమురు.. నీటిపై తెట్టులాగా వ్యాపిస్తుంది. దీంతో అనేక సముద్ర జీవులు నశిస్తాయి.

భార లోహాలు వివిధ కారణాల వల్ల నీటిలోకి చేరి జల కాలుష్యానికి, మానవుడి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అలాంటి కొన్ని భార లోహాలు..

పాదరసం: ఇది చేరిన నీటిని తాగితే మినిమేటా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తొలిసారిగా జపాన్‌లో గుర్తించారు. శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడం; స్పర్శ, వినికిడి, దృష్టి మందగించడం; మాట పడిపోవడంతోపాటు జన్యు మార్పులు ఏర్పడతాయి.
సీసం: ప్రగలనం జరిపే పరిశ్రమలు; బ్యాటరీ, రంగులు, రసాయనాలు, క్రిమి సంహారిణులను తయారు చేసే పరిశ్రమల నుంచి సీసం వెలువడుతుంది. వాహనాల పొగ ద్వారా లెడ్‌ వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. సీసం కలిసిన నీటిని తాగితే ఉత్పరివర్తనంతోపాటు తలనొప్పి, రక్తహీనత, కండరాలు బలహీనపడటం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
కాడ్మియం: ఇది లోహ పరిశ్రమలు, విద్యుత్‌ మలాము, పురుగు మందులు, ఫాస్ఫేట్‌లను తయారు చేసే పరిశ్రమల నుంచి వెలువడుతుంది. మూత్రపిండాలు, కాలేయం, ప్లీహం తదితర భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. రక్త పీడనం, రక్త హీనత, జరాయువు దెబ్బతింటాయి. కాడ్మియం ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తద్వారా భూమిని తర్వాత వరి, గోధుమ మొదలైన పంటల్లోకి చేరుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
జింక్‌: దీని కాలుష్యం వల్ల వాంతులు వస్తాయి. విసర్జక వ్యవస్థ పనిచేయదు. కండరాలు సంకోచిస్తాయి.
కోబాల్ట్‌: దీనివల్ల పక్షవాతం, అతిసారం, బీపీ తగ్గడం, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధులు ఏర్పడతాయి.
ఆర్సినిక్‌: ఆర్సినిక్‌ కలిసిన నీటిని తాగితే నాడీ వ్యవస్థ, రక్త ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. మానసిక ఒత్తిడి; కాలేయ, మూత్రపిండ, ఊపిరితిత్తి సంబంధ వ్యాధులు వస్తాయి. జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడతాయి.
రాగి, నికెల్, టైటానియం, క్రోమియం మొదలైన లోహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి రక్త స్వభావంలో, ఎంజైమ్‌ల పనితీరులో మార్పు వస్తుంది. మూత్రపిండాల వాపునకు కారణమవుతాయి.

నీటి కాలుష్యం దుష్ప్రభావాలు

  • కలుషిత నీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి.. కలరా, టైఫాయిడ్, డయేరియా, పచ్చ కామెర్లు, చర్మ వ్యాధులు.
  • కలుషిత నీటిలో ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల జలచరాలు నశిస్తాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 మిలియన్ల మంది పిల్లలు నీటి కాలుష్యం వల్ల కలిగే వివిధ వ్యాధులతో చనిపోతున్నారు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ్యహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలకు సరైన తాగునీరు, పారిశుధ్యం అందుబాటులో లేదు.
  • 80% నీటి కాలుష్యం.. మురుగు, కుళ్లిన పదార్థాల వల్ల ఏర్పడుతోంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 బిలియన్‌ టన్నుల పట్టణ వ్యర్థ పదార్థాలను దగ్గరలోని జలాశయాల్లో కలపడం వల్ల తీవ్ర నీటి కాలుష్యం ఏర్పడుతోంది.
  • గంగా, యమునా నదులు ప్రపంచంలోనే అత్యంత తీవ్ర కాలుష్యానికి గురైనట్లు శాస్త్రవేత్తలు నిర్ధరించారు.
  • నీటి కాలుష్యం వల్ల మన దేశంలో ఏటా 1000 మంది చిన్నారులు చనిపోతున్నారు.
  • రాజస్థాన్‌లో నీటి కాఠిన్యత వల్ల బాల్య మరణాలు సంభవిస్తున్నాయి.
  • మహారాష్ట్రలోని నాగపూర్‌లో కలుషిత నీరు తాగి అనేక పశువులు మరణించాయి.
  • తెలంగాణలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో కలుషిత నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ కాలుష్యం వల్ల ప్రజలకు ఫ్లోరోసిస్‌ వ్యాధి వస్తోంది.
  • తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ఫ్లోరోసిస్‌ ఉంది.
  • డబ్లూ్యహెచ్‌ఓ ప్రకారం తమిళనాడులోని రాణిపేట్‌.. ప్రపంచంలోని అతి తీవ్ర కలుషిత ప్రదేశాల్లో ఒకటి. చెన్నైకి సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణంలోని పరిశ్రమల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతోంది.

జల కాలుష్య నియంత్రణ చట్టాలు: కేంద్ర ప్రభుత్వం 1974లో జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టాలను రూపొందించింది.

కాలుష్యానికి సంబంధించిన కొన్ని ముఖ్య పదాలు
జీవ ఆక్సిజన్‌ గిరాకీ
: ప్రమాణ ఘనపరిమాణం గల నీటిలోని కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు వాయుయుత స్థితిలో జీవ రసాయన ఆక్సీకరణ చర్య జరుపుతాయి. ఇందులో వినియోగించుకున్న ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు.
యుట్రిఫికేషన్‌: నీటి మొక్కలు, ఆకుపచ్చ శైవలాలు, అకశేరుకాలు గుంపులుగా చేరి నీటిపై తెట్టులా తేలియాడుతుంటాయి. ఈ నీరు చిక్కపడి ఆకుపచ్చగా మారి దుర్గంధం వెదజల్లే స్థితిని యుట్రిఫికేషన్‌ అంటారు. దీనివల్ల నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గి జలచరాలు చనిపోతాయి.
ఒలిగోట్రాఫికేషన్‌: కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సులు మొదలైన జలాశయాల్లో నీరు నిలకడగా ఉండి నీటి మొక్కలకు, జలచరాలకు కావాల్సిన పోషక పదార్థాలు లేకపోవడం వల్ల నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ స్థితిని నీటి ఒలిగోట్రాఫికేషన్‌ అంటారు.

నీటి కాలుష్య నివారణ చర్యలు

  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చెరువుల్లో బట్టలను ఉతకడాన్ని; పశువులను, వాహనాలను కడగడాన్ని; మల, మూత్ర విసర్జనలను నిషేధించాలి.
  • పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు పంపాలి.
  • పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మురుగు నీటిని ఆధునిక పద్ధతుల్లో శుభ్రపర్చి అవసరమైన చోట వాడుకోవాలి.
  • వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి.
  • జలాశయాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాలు, హానికర రసాయనాలు, లోహాలు, మృత కళేబరాలు మొదలైనవి కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. నీటి కాలుష్య నివారణ చట్టాలను అమలుచేయాలి.
Published date : 14 Mar 2017 01:55PM

Photo Stories