Skip to main content

యు.ఎస్.లో విదేశీ విద్యార్థులు: న్యాయశాస్త్రం

అమెరికాలో న్యాయశాస్త్రం అధ్యయనాన్ని మనం సమీక్షిస్తుండగానే అక్కడ విదేశీ విద్యార్థులపై ఏటా సమగ్రమైన వివరాలు అందించే ‘ఓపెన్ డోర్స్’ తాజా నివేదిక విడుదలైంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వారు యు.ఎస్. విదేశాంగశాఖలోని బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ అందించే గ్రాంటుతో రూపొందించే ఈ నివేదిక అమెరికాలో విదేశీ విద్యార్థుల ధోరణులపైన అత్యంత సాధికారికమైనది. ఇప్పుడు వెలువడిన సర్వేలో అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య రికార్డుస్థాయిలో ఆరు శాతం పెరిగినట్టు నమోదైంది. యు.ఎస్.ఓ 764,495 మంది ఫారిన్ స్టూడెంట్స్ ఉండగా వీరిలో దాదాపు 4వ వంతు (194,029) చైనా నుంచి వస్తే ఆ తర్వాత ఎక్కువ సంఖ్యలో (100,270) భారతీయ విద్యార్థులు ఉన్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు 22.7 బిలియన్ (2270 కోట్ల) డాలర్లు లభించడం మరొక విశేషం

‘ఓపెన్ డోర్స్’ నివేదిక ఇంత ఆశావహంగా ఉన్నా, యు.ఎస్.లో న్యాయశాస్త్రం చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. ఎం.బి.ఏ. ఇంజనీరిగ్ లకే ఎక్కువమంది విదేశీ విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తారు. పైగా యు.ఎస్.లో చట్టం, న్యాయం ఒక ప్రాతిపదిక మీద ఉంటే ఇతర దేశాలలో అవి మరొకరకంగా ఉంటాయి. (అ+ఆ)2 అనేది ఇంజనీరింగ్ విద్యార్థులకి ఏ దేశంలోనైనా ఒకటే. కాని ‘‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ లా’’అమెరికాలో ఒకరకంగా ఉంటే ఇతర దేశాల్లో ఇంకొకరకంగా ఉంటుంది. విదేశీ విద్యార్థులు యు.ఎస్.లో పరిమిత సంఖ్యలోనే న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి ఇది ముఖ్య కారణం.

అమెరికాలోని ‘లా’ స్కూల్స్ చదవాలనుకున్న మన విద్యార్థులు ప్రథమంగా గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే- యు.ఎస్. లా స్కూల్స్ ప్రధానంగా అమెరికాలో లా ప్రాక్టీస్ చెయ్యడానికి విద్యార్థులకు తర్ఫీదునిస్తాయి. యు.ఎస్.లో లీగల్ ఎడ్యుకేషన్‌కి కేంద్రబిందువు యు.ఎస్ లీగల్ సిస్టమ్ తప్ప మరొకటి కాదు.

అయితే అంతమాత్రం చేత ఇతర దేశాల విద్యార్థులు అమెరికాలో న్యాయశాస్త్రం చదవడానికి అనర్హులని అనుకోకూడదు. యు.ఎస్.లో మొట్టమొదటి ప్రొఫెషనల్ లా డిగ్రీ జ్యూరిస్ డాక్టర్ (జె.డి) బాచిలర్స్ డిగ్రీ తర్వాత మూడేళ్ళ ఫుల్‌టైమ్ అధ్యయనంలో ‘జె.డి.’ వస్తుంది. దీనికి విదేశీ విద్యార్థులు అనర్హులని ఎవరూ చెప్పనప్పటికీ దీని అధ్యయనమంతా అమెరికన్ న్యాయవ్యవస్థ పైనే ఎక్కువ ఆధారపడి ఉండడం వల్ల మన విద్యార్థులకి ఇది సాధారణంగా అంతగా పనికిరాదు.

అమెరికాలో విదేశీ విద్యార్థులు మాస్టర్ ఆఫ్ కంపారిటివ్ లా (ఎం.సి.ఎల్), దీనినే మాస్టర్ ఆఫ్ కంపారిటివ్ జూరిస్‌ప్రుడెన్స్ (ఎం.సి.జె) అని కూడా అంటారు. ఇంకా ఎల్.ఎల్.ఎం. (మాస్టర్ ఆఫ్ లా) పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇందులో ఎల్.ఎల్.ఎం. డిగ్రీని అనేక స్పెషలైజేషన్స్‌తో చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ బిజినెస్ లా లో ఎల్.ఎల్.ఎం. చేయడానికి అమెరికాలో విదేశీ విద్యార్థులు ఎక్కువ మొగ్గుచూపుతారు. తాము స్వదేశంలో అప్పటికే చేసిన లా డిగ్రీకి ఇటువంటి స్పెషలైజేషన్‌తో చేసే యు.ఎస్. మాస్టర్ ఆఫ్ లా అదనపు బలాన్ని, గుర్తింపుని ఇస్తుంది.

యు.ఎస్.లోని లా స్కూల్స్‌లో అడ్మిషన్‌లకి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ న్యాయశాస్త్రంలో డిగ్రీలు చెయ్యాలంటే ఉత్తమ స్థాయిలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం. అలాగే స్వదేశంలో చేసిన విద్యాభ్యాసం తాలూకు అత్యుత్తమమైన అకడమిక్ రికార్డు ఎటూ తప్పనిసరి. లాస్కూల్ అడ్మిషన్ టెస్ట్ లా-శాట్‌లో కూడా సంతృప్తికరమైన స్కోర్లు సంపాదించాలి.

యు.ఎస్.లోని లా స్కూల్స్‌లో ప్రవేశం సంపాదించాలనుకున్నవారు మొదట లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లోని వివరాలను పరిశీలించి (www.lsac.org) ఆ తర్వాతే తమ జర్నీని మొదలుపెడితే ప్రయోజనకరంగా ఉంటుంది.

Published date : 21 Nov 2012 05:57PM

Photo Stories