Skip to main content

యు.ఎస్.లో ఉన్నత విద్య:

ముఖ్యమైన స్టెప్స్?
మొదటగా మీ అమెరికా కలని నిజం చేసుకునే దిశలో తొలి అడుగుగా మీరు యూఎస్‌లోని ఒక యూనివర్సిటీ స్కూలుకి దరఖాస్తు చేయాలి. అది సెవిప్ (ఎస్.ఇ.వి.పి.) ఆమోదం పొందిన స్కూలు అయి ఉండాలి. మీకు దగ్గరలో ఉన్న యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్. కార్యాలయంలో దీనికి సంబంధించిన సమాచారం మీకు లభిస్తుంది. ఇంకా https://studyinthestates.dhs.gov/school-searchవెబ్‌లింక్‌ని అనుసరించినా ఏది గుర్తింపు పొందిన యూనివర్సిటీయో ఒక్క నిమిషంలోగా తెలిపే యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వారి ‘సెర్చ్’ ఆప్షన్ మీకు అందుబాటులోకి వస్తుంది. అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే వారందరికీ ఇది అత్యవసరమైన మొట్టమొదటి స్టెప్. దీంతో ప్రారంభించినవారికి ‘ట్రయ్ వ్యాలీ’ లాంటి చేదు అనుభవాలు ఎదురవ్వవు.

మీరు ఎన్ని యూఎస్ స్కూల్స్‌కైనా సరే దరఖాస్తులు పంపించుకోవచ్చు (యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో అద్భుతమైన గెడైన్స్‌ని ఇవ్వగలుగుతుంది). మీరు ఎంచుకున్న యూనివర్సిటీ/స్కూలు అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఇచ్చిన సూచనల ప్రకారం కూడా మీరు మీ అప్లికేషన్‌ని పంపించవచ్చు. ఉదాహరణకు ‘సెవిప్’ స్కూల్సు జాబితా నుంచి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ - రివర్ ఫాల్స్ అనే పేరుని తీసి గూగుల్ సెర్చి చేస్తే ఆ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అడ్మిషన్లకి సంబంధించిన అనేక ప్రశ్నలకు అందులో జవాబులు దొరుకుతాయి. ఇంకా ఏమైనా సందేహాలుంటే వెబ్‌సైట్‌లో ఇచ్చే కొన్ని లింకులకి ఈ-మెయిల్ పంపించి సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అడ్మిషన్స్ అనే విండోలోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనే మీ అప్లికేషన్‌ని పంపించుకోవచ్చు.

మీకు ప్రవేశాన్నిచ్చిన ప్రతి స్కూలు నుంచి మీకు ఐ-20 ఫామ్ అందుతుంది. అయితే ఇందులో ఒక్క స్కూలును మాత్రమే ఎంచుకుని వీసా ఇంటర్వ్యూకి సమర్పించాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌సెక్యూరిటీ ఆమెదం పొందిన విద్యాసంస్థ మీకు ప్రవేశం ఇచ్చిన తర్వాత అధికారికంగా మీకు పంపించే కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ఐ-20.

విద్యార్థి, తను చేయబోయే ప్రోగ్రాం తాలూకు సమస్త సమాచారాన్ని నిరంతరం తెలుసుకునేందుకు వీలు కల్పించే ఒక స్టూడెంట్ ట్రాకింగ్ నంబర్‌ను కూడా ఐ-20లో పొందుపరుస్తారు.

మీకు అడ్మిషన్ ఇచ్చినట్టు అటు మీకు, మీతో పాటు యూఎస్ ప్రభుత్వానికి ఒక విద్యాసంస్థ ఏకకాలంలో తెలియజేసేదే ఐ-20. ఎఫ్-1 వీసా పొందడానికి, యూఎస్‌లో ఒక స్కూలు నుంచి మరొక స్కూలుకి మారేటప్పుడు చట్టబద్ధంగా స్టేటస్‌ని కొనసాగించడానికి ఐ-20 తప్పనిసరి. సెవిస్ ఫీజు చెల్లించడం ఇక ఇప్పుడు విద్యార్థి వంతు. ఇది ఎఫ్, ఎం, జె కేటగిరీల వారందరికీ వర్తిస్తుంది. సెవిస్ ఐ-20 ఫీజు చెల్లించినవారు వీసాకి దరఖాస్తు చేసుకోవడం కుదరదు. fmjfee.comవెబ్‌సైట్ ద్వారా సెవిస్‌ఫీజు చెల్లించవచ్చు. ఇక ఇప్పుడు ఎక్కబోయే మెట్టు చాలా కాలంగా మీరు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. అది మీ ప్రాంతంలోని యూఎస్ కాన్సులేట్‌లో ఎఫ్-1 వీసాకి అప్లై చేయడం.

ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఎంతో స్పష్టంగాను, సునాయాసంగాను ఉంటుంది. ఎవరి ఆసరా లేకుండా మీరే సమస్తం నిర్వహించుకోవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా మీ ప్రాంతానికి చెందిన యు.ఎస్. కాన్సులేట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటిలో ఇచ్చిన సూచనల్ని పాటించడమే. మీరు ఏ కాన్సులేట్ పరిధిలోకి వస్తారో ఆ కాన్సులేట్ వెబ్‌సైట్‌లోని సూచనల్ని అనుసరించండి.

వీసా నిర్ణయంలో పెండింగ్?
యు.ఎస్.లో ఉన్నత విద్యాభ్యాసం చెయ్యాలనుకునేవారు దాటవలసిన కీలక దశలను వరుసగా చూస్తున్నాం కదా!

అమెరికన్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం స్టూడెంట్ వీసాకి దరఖాస్తు చేసుకునేవారు మూడు ముఖ్యమైన అంశాలలో వీసా అధికారికి సంతృప్తికరమైన అభిప్రాయాన్ని కలిగించాలి. (ఎ) మీరు మీ దేశంలో ఒక నివాసాన్ని కలిగి ఉండాలి. అలాగే దానిని ఇంతలో వదిలివేసే ఉద్దేశం లేనివారై కూడా ఉండాలి. (బి) కోర్సు పూర్తి కాగానే యు.ఎస్ నుంచి తిరిగి వెళ్ళిపోయే ఉద్దేశం మీకుండాలి. (సి) యు.ఎస్.లో మీ విద్యాభ్యాసానికి అవసరమైన డబ్బు మీ దగ్గర ఉండి ఉండాలి. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని - మొదట యు.ఎస్. కాన్సులేట్ వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా మీ వీసా ఇంటర్వ్యూకి అపాయింట్‌మెంట్‌ను తీసుకోవాలి.

ఎఫ్-1 విద్యార్థులైతే ఫామ్ ఐ-20 ఎబి; ఎమ్-1 విద్యార్థులైతే ఫామ్ ఐ-20 ఎం.ఎన్.; ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్; మీరు యు.ఎస్.లో ఎప్పటివరకు ఉండదలచారో దానికి ఆరు నెలలు దాటి అమలులో ఉండే మీ పాస్‌పోర్టు, కాన్సులేట్ వెబ్‌సైట్‌లో (వీసా పేజీలో) సూచించిన స్పెసిఫికేషన్లని ఖచ్చితంగా పాటిస్తూ తీయించుకున్న మీ పాస్ పోర్టు ఫోటో, సెవిస్ ఫీజు రసీదు, మీరు విద్యాభ్యాసం చేసిన సంస్థల నుంచి ట్రాన్ స్క్రిప్టులు, డిగ్రీ ఇత్యాదులు; టోఫెల్, శాట్, జిఆర్‌ఇ, జి-మాట్ లాంటి అడ్మిషన్ టెస్టుల స్కోర్లు (ఏవి వర్తిస్తే అవి), మీ వద్ద లేదా మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్న మీ తల్లిదండ్రుల వద్ద యు.ఎస్.లో మీ ట్యూషన్ ఫీజులు, లివింగ్ ఎక్స్‌పెన్సులకు అవసరమైన నిధులు ఉన్నాయని రుజువుచేసే ఫైనాన్షియల్ ఎవిడెన్స్- ఇవన్నీ మీ వీసా ఇంటర్వ్యూ క్రమంలో మీకు అవసరమైనవి.

మీకు వీసా వచ్చిన తర్వాత కూడా కాన్సులేట్ నుంచి అది మీ చేతికి రావడానికి ఒక్కోసారి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూ తేదీకి, యు.ఎస్‌కి తాము ప్రయాణమయ్యే తేదీకి నడుమ ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది.

కొందరి వీసాలపై వెంటనే నిర్ణయం తీసుకోవడం సాంకేతిక కారణాల దృష్ట్యా కుదరక వాటిని అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కోసం పెండింగులో పెట్టడం జరుగుతుంది. ఎటువంటి ప్రాసెసింగ్ కోసం మీ కేసుని పెండింగులో పెట్టారనే వివరాలను కాన్సులేట్లు మీకు తెలియజేయడం సాధ్యపడదు. మీ కేసుపై నిర్ణయం జరిగి మీకు వెబ్‌సైట్‌లో ఆ సమాచారం తెలిసేవరకు మీరు వేచి ఉండడం మినహా మీ కేసు ఏమైందో అడగడానికి ఇట్టి సందర్భాలలో మీరు ఫోన్లు చెయ్యడం, ఈ-మెయిల్స్ పంపించడం కాన్సులేట్లు అనుమతించవు. అమెరికన్ కాన్సులేట్లు అప్లికెంట్లకి విడమరచి చెప్పని కారణాలలో ఒకటి టెక్నాలజీ అలర్ట్ లిస్టు.

ఈ సమాచారం కూడా కాన్సులేట్ అఫిషియల్‌గా మీకు ఎక్కడా ఇవ్వవు. కెమికల్ అండ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, మెటీరియల్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, రోబోటిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అర్బన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, డిజైన్, సివిల్ ఇంజనీరింగ్ సహా అధ్యయనానికి లేదా పరిశోధనలకు మీరు వెళ్లదలుచుకున్నప్పుడు టెక్నాలజీ అలెర్ట్ లిస్టులో ఈ రంగాలు ఉండడం వల్ల మీ వీసా దరఖాస్తు కొన్ని నిబంధనల ప్రకారం అదనపు భద్రతా తనిఖీలకు వెళ్ళవచ్చు కనుక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ క్రింద దానిపై నిర్ణయానికి అదనపు సమయం పట్టవచ్చు (ఈ లిస్టు బహిరంగ అంశం కాదు కనుక ఈ వివరాలు కర్టాకర్ణిగా విని మీకు తెలియజేస్తున్నవే గాని ఇదమిత్థంగా ఏ యు.ఎస్. ప్రభుత్వ సోర్స్ నుంచో నేను తెలుసుకున్నవి కావని గమనించాలి).

ఒక స్టూడెంట్‌గాని, స్కాలర్ గాని వీసాకి అప్లయ్ చేసినప్పుడు వారి స్టడీ లేదా రీసెర్చి ఏరియా ఈ టెక్నాలజీ అలెర్ట్ లిస్టులో దేని క్రిందికి వస్తుందో నిర్ణయించగలగాలని, అలా ఒక కేటగిరీని తాము ఇతమిత్థంగా నిర్ణయించలేనప్పుడు ఇక ఆ వీసా అప్లికేషన్‌ని వాషింగ్టన్‌కి సమీక్ష కోసం పంపిస్తారని నా అవగాహన.

Published date : 11 Feb 2013 03:37PM

Photo Stories