యు.ఎస్.లో స్టెమ్ కోర్సులు చేస్తే వృక్షంలా ఎదగొచ్చు!
స్టెమ్ డిగ్రీలు చెయ్యాలనుకునేవారికి, చేస్తున్నవారికి, చెయ్యబోతున్నవారికి అమెరికాలో ఆదరణ, విలువ అవకాశాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సైన్స్, చెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమాటిక్స్‌లలో మొదటి ఆంగ్ల అక్షరాల నుంచి ఏర్పడిన సంక్షిప్త నామం స్టెమ్ (STEM). ఈ నాలుగు ఫీల్డులకి యు.ఎస్. విద్యారంగంతో పాటు యు.ఎస్. ప్రభుత్నం కూడా ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు వీటికి స్టెమ్ కోర్సులు అనే పొట్టి పేరు అమెరికా అంతరిక్ష సంస్థ సంక్షిప్త నామం (నాసా)తో సమానంగా పాపులర్ అయింది.
స్టెమ్ కోర్సులు చేసినవారికి యు.ఎస్‌లో అదనంగా 17 నెలల ఓ.పి.టి. (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అవకాశం గురించి ‘హలో అమెరికా’ లో ఒకసారి చెప్పుకున్నాం. ఓ.పి.టి. అంటే ఎఫ్-1 మీద ఉంటూనే విద్యార్థి 12 నెలల పాటు (హెచ్-1 కి మారే పని లేకుండా) తన కోర్సుకి సంబంధించిన రంగంలో ‘ట్రైనింగ్’ మీద తాత్కాలిక ఉద్యోగం చేసి సంపాదించుకోవడం. స్టెమ్ కోర్సుల వారికి ఈ అవకాశం ఇప్పుడు మొత్తం 29 నెలలకి పెరిగింది. విదేశీ విద్యార్థులు అమెరికాలో స్టెమ్ ఫీల్డులలో ఎక్కువగా చదవడం, వారు యు.ఎస్.లో ఎక్కువకాలం ఉండి సేవలు అందించడం తమకి ప్రయోజనకరంగా ఉంటుందని యు.ఎస్ ప్రభుత్వం భావించింది. అందువల్లనే ఒబామా ప్రభుత్వం చొరవ తీసుకుని స్టెమ్ బ్రాంచిల వారికి ఓ.పి.టి. ఎక్స్‌టెన్షన్ సదుపాయం కల్పించే ప్రతిపాదన చేసింది.
ఇలా ఉండగా యు.ఎస్. జాబ్ మార్కెట్‌లో కూడా స్టెమ్ డిగ్రీలకి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు బేసిక్ టెక్నికల్ స్కిల్స్‌తో ఉన్నవారు లభించక ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు 2020 నాటికి ఒక కోటికి పెరుగుతాయని అంచనా. ఈ ప్రకారం చూస్తే యు.ఎస్. లో రెండేళ్ళ స్టెమ్ డిగ్రీకి అక్కడ లిబరల్ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల అధ్యయనం కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎక్కువ ‘స్టెమ్’ విద్యార్థుల్ని ఆకర్షించేందుకు ‘స్టెమ్ మీన్స్ జాబ్స్’ అనే ఒక కన్వెన్షన్‌ని ప్రసిద్ధ ‘యు.ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్’ ఈ ఏడాది జూన్‌లో డల్లస్‌లో నిర్వహించింది.
యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ గడచిన మే నెలలో విస్తృతీకరించిన స్టెమ్ డిగ్రీల లిస్టుని విడుదల చేసింది. ఫార్మాస్యూటికల్ సైన్స్‌లు; ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లాంటి ఫీల్డులని కూడా ఇందులో చేర్చడం ద్వారా మరింతమంది విదేశీ స్టెమ్ విద్యార్థులకు యు.ఎస్.లో అవకాశం కల్పించాలనే తన సంకల్పాన్ని యు.ఎస్. ప్రభుత్వం పునరుద్ఘాటించినట్టయింది. https://www.ice.gov/ doclib/sevis/pdf/stemlist.pdf వెబ్ లింక్ వద్ద యు.ఎస్. ప్రభుత్వం ఆమోదించిన తాజా స్టెమ్ డిగ్రీల జాబితాని చూడవచ్చు. ఇందులో వందలాది కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సులు ఏయే యూనివర్సిటీలలో అందుబాటులో ఉన్నదీ తెలుసుకోవడానికి మన విద్యార్థులు ఒక్కో యూనివర్సిటీ వెబ్ సైటుని శ్రద్ధగా బ్రౌజ్ చేసి చూసుకోవాలి.
సోవియట్ యూనియన్ 1957 లో తొలి మానవ నిర్మిత అంతరిక్ష వస్తువు అయిన స్పుత్నిక్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి గ్లోబల్ టెక్నాలజీలో తమ ఆధిక్యతని చాటిచెప్పినప్పుడు సమస్త ప్రపంచం సంచలనంలో మునిగిపోతే అమెరికన్లు మాత్రం ఖంగు తిన్నారు. (సోవియట్‌లు ముందు గా ఈ పని చేసి తమ గూఢచారి ఉపగ్రహాలకి మార్గం సుగమం చేశారని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ లోలోపల సంతోషించాడని మరికొన్ని కథనాలు ఉన్నాయి!) ఏమైనా, ఈ ‘షాక్’ తర్వాత అమెరికా తన మాథ్స్, సైన్స్ ఎడ్యుకేషన్ రంగాలకి ఒక నూతన పథనిర్దేశం చెయ్యడం ద్వారా కాలక్రమంలో తన సాంకేతిక ఆధిక్యతని మళ్ళీ అందిపుచ్చుకుంది. స్పుత్నిక్ తర్వాత ఎంత ‘అర్జెన్సీ’ తో నిర్ణయాలు తీసుకుందో మళ్ళీ అదే తరహా ‘అర్జెన్సీ’ ని అమెరికా ఇప్పుడు స్టెమ్ ఫీల్డులకి ఒక కొత్త ఊపు ఇవ్వడంలో ప్రదర్శిస్తోందని, విదేశీ విద్యార్థులకి స్టెమ్‌లో కొత్త కిటికీలు తెరవడానికి అదే కారణమని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. కారణాలు ఏవైనా, అమెరికాలో విద్య, ఉద్యోగ అవకాశాలు వెదుక్కుంటూవెళ్ళే విదేశీ విద్యార్థులందరికీ స్టెమ్ ఫీల్డులోని ఆశావహస్థితి ఒక శుభవార్తే. స్టెమ్ స్టూడెంట్స్‌కి యు.ఎస్.లో ఇప్పటికే సువర్ణావకాశాలు ఏర్పడ్డాయి. ఇక మీద రానున్నది కూడా ‘‘స్టెమ్’’ లకి స్వర్ణయుగమే!