Skip to main content

యు.ఎస్.లో నల్లజాతివారితో ఎలా మెలగాలి?

‘హలో అమెరికా’లో యు.ఎస్. యూనివర్సిటీ అడ్మిషన్లు, యు.ఎస్. వీసాల గురించే కాక యు.ఎస్. వెళ్ళిన తర్వాత అక్కడ సొసైటీని అర్థం చేసుకుని జీవించడానికి ఉపయోగపడే అనేక అంశాలని తెలియజేస్తున్నారు. అక్కడి నల్లజాతి అమెరికన్లతో ఎలా మెలగాలో చెబుతారా?
- కొందరు పాఠకులు

అందరితో ఎలా మెలగుతారో అలాగే మెలగండి. అమెరికన్ చట్టాలు వివక్షని ఒక్క శాతం కూడా క్షమించవు. అమెరికా ఏర్పడినప్పుడు అనేకజాతుల వారు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఒక అందమైన భవిష్యత్తుని నిర్మించుకునేందుకు అమెరికాకు తమకు తాముగా చేరుకుంటే నల్లజాతి వారు మాత్రం తమ ప్రమేయం లేకుండానే (బలవంతంగా) బానిసలుగా పనిచెయ్యడానికి ఆఫ్రికా నుంచి అమెరికాకు రవాణా చేయబడ్డారు.

ఈ బానిసత్వ నిర్మూలన సమస్యపైనే అమెరికాలో ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఒక అంతర్యుద్ధం జరిగి లక్షలాదిమందిని బలిగొంది. దీనికోసమే అబ్రహంలింకన్ ప్రాణ త్యాగం చేశాడు. బానిసత్వం రూపుమాసిన తర్వాత మళ్ళీ ఈ నల్లజాతి వారి హక్కుల పోరాటంలోనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అశువులర్పించాడు. ఇప్పుడు ఆ నల్లజాతి నుంచి వచ్చిన ఒక జాతి రత్నం బరాక్ ఒబామా రెండవసారి అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించాడు. అమెరికా చరిత్ర ఎంత ఉత్కృష్టమైనదో అక్కడ నల్లజాతి వారి చరిత్ర కూడా అంతే ఉత్కృష్టమైనది.

యు.ఎస్. యూనివర్సిటీ క్యాంపస్‌లలోను, బయట మీకు ఎంతో మంది నల్లజాతి వారు సహాధ్యాయులుగా ఉంటారు. మీకు టీచర్లుగా వస్తారు. మీ పొరుగువారిగా జీవిస్తుంటారు. తమ నలుపు గురించి వారికేమీ న్యూనత ఉండదు. వారి వర్ణాన్ని బట్టి మీరు కూడా ఏ మాత్రం ప్రత్యేకంగా ప్రవర్తించకూడదు. అక్కడ నల్లజాతి వారిని మొదట ‘కలర్డ్’ అనేవారు.

దానిని కించపరచే శబ్దంగా భావించడంతో ఆ తర్వాత ‘నీగ్రో’ అనే మాట వాడుకలోకి వచ్చింది. కొన్నాళ్ళకి కొందరు దీనిని కూడా వ్యతిరేకించడంతో నల్లజాతి వారిని ‘బ్లాక్స్’ అని సంబోధించడం సర్వత్రా వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ‘ఆఫ్రికన్-అమెరికన్’ అనేది నల్లజాతి వారి విషయంలో మిక్కిలి గౌరవప్రదమైన సంబోధనగా మారడం వల్ల వారిని అక్కడ మీరు కూడా అలాగే సంబోధించండి.

Published date : 27 Mar 2013 01:54PM

Photo Stories