Skip to main content

యు.ఎస్. పబ్లిక్ స్కూల్స్‌లో ఎఫ్-1 విద్యార్థులకు పరిమితులు

అమెరికాలో ప్రభుత్వ ధనంతో నడిచే (పబ్లిక్) స్కూల్స్‌లో విదేశీ విద్యార్థులు (ఎఫ్-1 ఫారిన్ స్టూడెంట్స్) చదువుకోవడంపై కొన్ని పరిమితులు విధిస్తూ అమెరికన్ కాంగ్రెస్ 1996లో ఒక శాసనం చేసింది. ఈ పరిమితులు గ్రేడ్-1 నుండి గ్రేడ్-12 వరకు యు.ఎస్.లోని పబ్లిక్ స్కూల్స్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఉద్దేశించినవి. యు.ఎస్ కాంగ్రెస్ శాసనం ప్రకారం అమెరికాలో ఒక పబ్లిక్ ప్రైమరీ/ఎలిమెంటరీ స్కూల్‌లో; లేదా పబ్లిక్ ఫండ్స్‌తో నడిచే ఒక వయోజన విద్యా కార్యక్రమంలో చేరాలనుకునే వారికి ఎఫ్-1 వీసా ఇవ్వకూడదు.

అయితే ఎఫ్-1 తో సహా ఏ నాన్-ఇమిగ్రెంట్ వీసా హోల్డర్ డిపెండెంట్లయినా (భార్య/భర్త, 21 ఏళ్ళు దాటని అవివాహిత సంతానం) ఒక పబ్లిక్ ప్రైమరీ స్కూల్‌లో లేదా పబ్లిక్ ఫండ్స్‌తో నడిచే ఒక వయోజన విద్యాకార్యక్రమంలో లేదా మరొక పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో చదువుకోవడంపైన ఎటువంటి నిషేధం లేదు.

అమెరికాలో పబ్లిక్ సెకండరీ స్కూలు (హైస్కూలు)లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చుని తామే భరించాలి. ఐ-20లో ట్యూషన్ ఖర్చు రాసి ఉండకపోతే ఐ-20 మీద సంతకం చేసిన స్కూలు డి.ఎస్.ఒ. నుంచి దానికి సంబంధించిన ఒక నోటరైజ్డ్ స్టేట్‌మెంట్‌ని తీసుకోవాలి. ట్యూషన్ ఖర్చు సాధారణంగా 3 వేల డాలర్ల నుంచి 10 వేల డాలర్ల వరకు ఉంటుంది.

ఎఫ్-1 విదేశీ విద్యార్థులకు యు.ఎస్. పబ్లిక్ సెకండరీ స్కూల్ (హైస్కూల్) అటెండెన్స్ 12 నెలలకు మాత్రమే పరిమితంగా అనుమతిస్తారు. ఎఫ్-1 విద్యార్థులకు ఐ-20 మీద ‘లెంగ్త్ ఆఫ్ స్టడీ’ని 12 నెలల కంటే ఎక్కువ చూపడానికి వీలు లేదు. ఎఫ్-1 కాకుండా ఇతర వీసా స్టేటస్‌లకు చెందిన విదేశీ విద్యార్థులకు ఈ 12 నెలల పరిమితి వర్తించదు.

కాగా, యు.ఎస్. కాంగ్రెస్ 1996లో చేసిన శాసనం అమెరికాలో ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ నిధులతో నడిచే వయోజన విద్యాకార్యక్రమాలలో చదువుకునే విదేశీ విద్యార్థులకు వర్తించదు. అయితే వారు ఒక పబ్లిక్ ప్రైమరీ స్కూల్‌కి లేదా పబ్లిక్ ఫండ్స్‌తో నడిచే ఒక వయోజన విద్యా కార్యక్రమానికి మారాలనుకున్నప్పుడు మాత్రం ఈ పరిమితుల పరిధిలోకి వస్తారు. అలాగే పబ్లిక్ ఫండ్స్‌తో నడిచే ఒక వయోజన విద్యాకార్యక్రమం కింద చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఐ-20 ఇవ్వడాన్ని యు.ఎస్ కాంగ్రెస్ శాసనం నిషేధిస్తున్నది.

ఎఫ్-1 విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికయ్యే ఖర్చును ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి చెల్లించకూడదని చట్టంలో ఎక్కడాలేదు. అయితే అలా వేరొకరు చెల్లించే మొత్తం పబ్లిక్ ఫండ్స్ నుంచి రాకూడదు. ఎవరు డబ్బు చెల్లిస్తున్నప్పటికీ తన యు.ఎస్. విద్యాభ్యాసానికయ్యే ఖర్చులని (లివింగ్ ఎక్స్‌పెన్సులు సహా) భరించే శక్తి తనకి కూడా ఉన్నదని సదరు విద్యార్థి నిరూపించుకోగలగాలి.

యు.ఎస్. పబ్లిక్ స్కూల్స్‌లో కొన్ని పరిమితులకు లోబడి చదువుకునే ఎఫ్-1 కేటగిరీ విదేశీ విద్యార్థులు అమెరికాలో తమ బంధువులైన యు.ఎస్ సిటిజన్స్‌తో కలిసి నివసిస్తూ తమ విద్యాభ్యాసం కొనసాగించవచ్చు.

Published date : 26 Feb 2013 01:22PM

Photo Stories