స్టెమ్ లకి గ్రీన్ కార్డు అవకాశాలు?
యు.ఎస్‌లో స్థిరపడే ఉద్దేశం తనకి లేదని ఇంటర్వ్యూలో రుజువు చేసుకోలేకపోయిన విద్యార్థికి ఇక్కడ వీసా దొరకదు. అయితే యు.ఎస్. వెళ్ళిన విద్యార్థులు అక్కడ ‘అత్యంత ప్రతిభావంతులైన’ (హైలీ స్కీల్డ్) విదేశీయులుగా రుజువు చేసుకుంటే మాత్రం వారికి అక్కడే మంచి అవకాశాలు కల్పించి వారు అమెరికాలోనే స్థిరపడే వెసులుబాటుని యు.ఎస్. ప్రభుత్వమే స్వయం గా కల్పిస్తుంది. సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమాటిక్స్ (స్టెమ్) ఫీల్డులలో విశేష ప్రతిభ కనబరిచే విదేశీయులకి అక్కడ గ్రీన్కార్డ్ల మంజూరు నిబంధనలను కూడా యు.ఎస్. ప్రభుత్వం కొంత సరళం చేస్తోంది. ఎంతగా సరళతరం చేస్తున్నారంటే-‘‘స్టెమ్ డిగ్రీలకి ఇక గ్రీన్ కార్డ్‌లు స్టేపుల్ (పిన్) చేసి మరీ ఇస్తారేమో...’’అన్నంతగా!
యుఎస్.లో విదేశీయుల రాకపోకల మీద అధికారం గల డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డి.హెచ్.ఎస్.) కూడా యు.ఎస్. ప్రభుత్వ విధానాలని అనుసరించి ‘‘హైలీ స్కిల్డ్’’ ఇమ్మిగ్రెంట్లని అమెరికాలోకి ఆకర్షించడానికి, వారు ఎప్పటికీ అక్కడ ఉండిపోయేలా ప్రోత్సహించడానికి తన నిబంధనలలలో అనేక సంస్కరణలు తలపెట్టింది. ఈ ప్రయత్నానికంతటికీ పునాది విదేశీ ప్రతిభని స్వదేశానికి సమర్థంగా వాడుకునేందుకు ప్రెసిడంట్ ఒబామా ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో తలపెట్టిన మార్పులు. ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రతిభావంతమైన వర్క్ ఫోర్స్ అమెరికాకు మాత్రమే ఉన్నదని రుజువు చెయ్యడం ఒబామా ధ్యేయం. విదేశీ స్టెమ్ గ్రాడ్యుయేట్లకి అదనంగా లభించిన 17 నెలల ఎక్స్టెన్షన్ ఒబామా ఆలోచనే. స్టెమ్ ఫీల్డులని ఇప్పటికే అనేక కొత్త సబ్జెక్ట్లకి విస్తరించిన డి.హెచ్.ఎస్ మరిన్ని కొత్త కోర్సుల్ని కూడా ముందుముందు ఇందులో కలపాలని ఆశించడం విదేశీ విద్యార్థులకు మరొక శుభవార్తే.
ఎఫ్-1 విద్యార్థుల జీవిత భాగస్వామి (ఎఫ్-2 స్పౌజ్) యు.ఎస్.లో కొన్ని స్వల్పకాలిక హాబీ కోర్సుల్ని తప్ప అకాడమిక్ కోర్సులు చెయ్యడానికి ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం వీలుపడదు. అయితే ఎఫ్-2 లు అదనంగా పార్ట్‌టైమ్ ప్రాతిపదికపైన అకాడమిక్ క్లాసులలో చేరే అవకాశాన్ని ఒబామా సంస్కరణలు ప్రతిపాదించాయి. యు.ఎస్. యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల బాగోగులు చూసే డి.ఎస్.ఒ.ల సంఖ్యను పెంచుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని తలపెట్టారు.
హెచ్-1 బి మీద ఉన్న హెచ్-4 స్పౌజ్‌లు యు.ఎస్‌లో ఉద్యోగాలు చేసేందుకు ఇంతవరకు అనుమతి లేదు. వీరిలో కొందరికి వర్క్ ఆథరైజేషన్ ఇవ్వడం కూడా ఈ సంస్కరణల లక్ష్యంగా ఉంది. హెచ్-1బి మీద కొంత ‘‘మినిమమ్ పీరియడ్‌కి’ అక్కడ పనిచేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ద్వారా గ్రీన్ కార్డ్‌కి అప్లయ్ చేసుకున్న హెచ్-1బి స్పౌజ్‌కి (హెచ్-4కి) వర్క్ ఆథరైజేషన్ ఇచ్చే ప్రతిపాదన చేశారు. ఒక ఎంప్లాయర్ తన వద్ద ఉన్న హెచ్-1బి విదేశీ ఉద్యోగి తన ఫీల్డులో ‘‘వెరీ బెస్ట్’’ అని ప్రూవ్ చెయ్యడానికి (గ్రీన్ కార్డు కోసం) ఇప్పటి వరకు కొన్ని నిర్దేశిత సాక్ష్యాలను మాత్రమే సమర్పించవలసి ఉండేది. అయితే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల క్రింద కొన్ని ‘‘కంపేరబుల్ ఎవిడెన్సు’’లని (సమానమైన సాక్ష్యాలని) కూడా ఆమోదించాలని తలపెట్టారు.
స్థానికుల ఉద్యోగాలను ఎగరేసుకుపోయే ప్రతిభావంతులైన విదేశీయుల హోదాను అమెరికాలో ఉద్యోగుల స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే యజమానుల స్థాయికి పెంచడానికి కూడా ఒబామా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. విదేశీ టాలెంట్‌కి అమెరికా నూతన స్వరంతో పలుకుతున్న ఆహ్వానాన్ని ఒక్క తెలుగు విద్యార్థులే కాక భారతీయులందరూ సద్వినియోగం చేసుకోవాలి.