ఫార్మసీలో ఎం.ఎస్. చేస్తే యు.ఎస్.లో ఫార్మసిస్టు అవ్వలేరు
అమెరికాలో ఫార్మసిస్టులకి డాక్టర్లతో సమానమైన విలువ, గౌరవం ఉంది. అందువల్లనే విదేశీయులకు అక్కడ మెడికల్ డాక్టర్ అవ్వడం ఎంత కష్టమో ఫార్మసిస్టు అవ్వడం కూడా అంతే కష్టం. ఈ నేపథ్యంలో చూస్తే ఇక్కడ బి.ఫార్మసీ చేసి ఆ తర్వాత అమెరికాలో అడ్వాన్స్‌డ్ ఫార్మసీ కోర్సులకు వెళ్ళాలనుకునేవారు ముందుగా తెలుసుకోవలసిన అంశం అక్కడ ఏయే ఫార్మా డిగ్రీలకి ఎలాంటి అవకాశాలున్నాయనేది. అక్కడ ఫార్మసిస్టులుగా మారడం అంతర్లీన లక్ష్యంగా ఉన్నవారు ఈ అంశంలో మరింత జాగ్రత్తగా ఆలోచించాలి. ఫార్మసీలో ఎం.ఎస్., లేదా పిహెచ్.డి. చేసినా అక్కడ ఫార్మసిస్టుగా పనిచేసే అవకాశం లభించదు. ఆ డిగ్రీలు చేసిన వారికి ఔషధ పరిశ్రమలలో, పరిశోధనలలో, టీచింగ్ లాంటి రంగాలలో మాత్రమే అవకాశాలుంటాయి గాని వారికి ఫార్మసిస్టు లెసైన్స్‌లు ఇవ్వరు.
యు.ఎస్.లో ఫార్మసిస్టుగా బోర్డు పెట్టుకోవాలంటే అక్కడ ‘‘ఫార్మ్-డి’’ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) చెయ్యాల్సిందే. మళ్ళీ అది చెయ్యడం కూడా విదేశీ విద్యార్థులకు అంత సులభం కాదు. ఇప్పుడు అమలులో ఉన్న విధానం ప్రకారం అమెరికాలో ‘ఫార్మ్-డి’ పట్టా చేతిలోకి రావడానికి దాదాపు 9 ఏళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ అవసరమవుతుంది. ఇందులో సీటు రావాలంటే కొన్ని ప్రవేశార్హతలుంటాయి. అక్కడ అక్రెడిటెడ్ స్కూల్స్‌లో చదివిన కోర్సులు కావాలి. ఎక్కువ భాగం ఫార్మసీ స్కూల్సు 4-ఏళ్ళ ‘ఫార్మ్-డి’ కోర్సులో ప్రవేశానికి ‘పికాట్’ ఎంట్రెన్స్ టెస్సుని నిర్దేశిస్తాయి. అంతకు ముందు చేసిన బాచిలర్స్ డిగ్రీలో సైన్స్ సబ్జెక్టులు, మ్యాథ్స్, కంపోజిషన్, హ్యుమానిటిస్ లాంటి వాటిలో 60 నుండి 90 ‘క్రెడిట్ అవర్స్’ మేర యూనివర్సిటీ కోర్స్ వర్క్ చేసిన అనుభవం కూడా ఉండాలి.
అక్రెడిటెడ్ స్కూలు నుంచి ‘ఫార్మ్-డి’ చేసిన తర్వాత ఒక లెసైన్స్డ్ ఫార్మసిస్టు దగ్గర అప్రెంటీసు చెయ్యడం, నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లెసైన్యూర్ ఎగ్జామ్ పాస్ కావడం, ఎం.పి.జె.ఇ. అనే మల్టీ-స్టేట్ ఫార్మసీ జ్యూరిస్ ప్రూడెన్స్ పరీక్షని కూడా దాటడం అనేవి అమెరికాలో ఫార్సిస్టుగా ప్రాక్టీస్ పెట్టడానికి ముందుగా పరిపూర్తి చేయవలసిన రిక్వయిర్మెంటులు. నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ డిగ్రీ), నాలుగేళ్ళ గ్రాడ్యుయేట్ (మన పోస్ట్ గ్రాడ్యుయేట్) స్థాయి డాక్టొరల్ డిగ్రీ (ఫార్మ్-డి), వాటితో పాటు ఒకటి నుంచి రెండేళ్ళ ఐచ్ఛిక (ఆప్షనల్) పోస్టుగ్రాడ్యుయేట్ రెసిడెన్సీ ట్రైనింగ్ ఉంటేనే 2020 నాటికి అమెరికాలో ఫార్మసిస్టులు పేషెంట్ల సంరక్షణలో నేరుగా పనిచెయ్యడాన్ని అనుమతించే నిబంధన కూడా రాబోతుందని భావిస్తున్నారు.
అమెరికా వెలుపల బాచిలర్స్ ఫార్మసీ కోర్సులు చేసిన విదేశీ విద్యార్థులు అమెరికాలో రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు అవ్వాలంటే వారు మొదట ‘ఫారిన్ ఫార్మసీ ఈక్వలెన్సీ ఎగ్జామినేషన్’ అనే ‘ఎఫ్.పిజి.ఇ.ఇ.’ పరీక్షని, ఆ తర్వాత ‘నాప్లెక్స్’ అనే నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లైసేన్స్యూర్ ఎగ్జామ్‌ని చెయ్యాలి.
ఇలా ఉండగా కొన్ని యు.ఎస్. యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులను--వారు ‘ఫ్రీ రిక్విజిట్ కోర్సులను’ చేసినా ‘డి-ఫార్మసీ’లోకి అనుమతించవు. ఏ యూనివర్సిటీ నిబంధనలు ఏమిటో ఆ నిర్ణీత విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లోకి వెళ్ళి తెలుసుకోవాలి.