పిహెచ్.డిలకు యు.ఎస్.లో సువర్ణావకాశాలు
శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు అవసరమైన అత్యాధునిక వసతులు అత్యుత్తమంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో అందరికీ అందుబాటులో ఉండే ‘రీసెర్చర్ల పుణ్యస్థలాలు’ యు.ఎస్. యూనివర్శిటీలు. రీసెర్చ్‌లో అంచులు చూడాలనుకున్న వారికి అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మించినవేమీ ఉండవనేది అతిశయోక్తి కాదు. ఒక్క పిహెచ్.డి. చేసేటప్పుడు మాత్రమే కాకుండా అమెరికాలో విద్యాబో ధన ఆద్యంతం రీసెర్చ్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అనేక ఇతర దేశాల యూనివర్శిటీలలో మరికొన్ని ఏళ్ల తర్వాత గాని నెలకొల్పలేని ఖరీదైన లేబొరేటరీ పరికరాలు, ఇంకా ప్రపంచంలో అగ్రశ్రేణి ఆచార్యుల కోవలోకి వచ్చే ప్రొఫెసర్లు అక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉండడం మరొక విశేషం. ఇండియాలో ఐ.ఐ.టి.లు, మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థలలో మాత్రమే ఇలాంటి సదుపాయాలు ఉంటే యు.ఎస్.లో ప్రతి యూనివర్శిటీ తన విద్యార్థులకోసం అత్యాధునిక పరిశోధనా వసతులు కల్పించడానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది.
ఇది ఒక పార్శ్వమైతే అమెరికాలో పిహెచ్.డిలో ప్రవేశానికి సరళమైన విలక్షణ మార్గం ఉండడం మరొక ఆసక్తికరమైన అంశం. ‘మాస్టర్స్’ తర్వాతనే పిహెచ్.డి. అనేది ఇక్కడ చాలామందిలో పాతుకుపోయిన అభిప్రాయం. ఇక్కడ బి.టెక్. అయినవాళ్ళు కూడా నేరుగా పిహెచ్.డిలో చేరే అవకాశం అమెరికాలో కొన్ని యూనివర్శిటీలలో ఉన్నదనేది ఇంకా చాలామందికి తెలియదు. ఇందులో చేరినవారికి మొదటి రెండేళ్ళుఅయిన తర్వాత ‘మాస్టర్స్’ ఇచ్చి అటుపైన పిహెచ్.డిని కొనసాగిస్తారు. ఏ యూనివర్శిటీలో అలాంటి అవకాశం ఉన్నదనేది యూనివర్శిటీ వెబ్‌సైట్‌లని గాలించి తెలుసుకోవాలి. అలాగే, పిహెచ్.డి. అనగానే అది చేసినవాళ్లు టీచింగ్ ప్రొఫెషన్‌కి మాత్రమే వెళతారు అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఉత్కృష్టమైన టీచింగ్ రంగంలో అవకాశాలతోపాటు పెద్దపెద్ద ఎం.ఎన్.సి.లు ఇప్పుడు కీలకమైన ఆర్ అండ్ డి జాబ్‌లకి ఇతర గ్రాడ్యుయేట్‌ల కంటె పిహెచ్.డి.లనే ఎక్కువగా తీసుకుంటున్నాయి.
అయితే యు.ఎస్. యూనివర్శిటీలలో ఎం.ఎస్.లో చేర్చుకున్నంత ఎక్కువ సంఖ్యలో విదేశీ విద్యార్థులను పిహెచ్.డి. కోర్సులలో చేర్చుకోరు. అలాగే, యు.ఎస్. యూనివర్శిటీలో ‘మాస్టర్స్’ చేసినవారికి అక్కడ పిహెచ్.డి.లో (విదేశీ విద్యార్థుల కంటే అధికంగా) ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి పిహెచ్.డి. చెయ్యాలనుకున్న వారి ‘సి.వి.’ బాగా పటిష్టంగా ఉండాలి. ఇక్కడ బి.ఇ. లేదా బి.టెక్ తర్వాత యు.ఎస్.లో పిహెచ్.డి. కి అప్లయ్ చేసే వారికి అర్హతలు మరింత గట్టిగా ఉండాలి.
పరిశోధనల రంగంలో పుర్వానుభవం ఉన్నవారు పిహెచ్.డి. ఆడ్మిషన్‌లలో సహజంగానే ప్రాధాన్యం పొందుతారు. టోఫెల్, జి.ఆర్.ఇ.లో మంచి స్కోర్లు, అత్యుత్తమంగా ఉన్న ‘స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్’, ‘పూర్వ ప్రొఫెసర్ల రికమండేషన్ లెటర్లు’, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మీ ఫెర్ఫార్మెన్స్ అడ్మిషన్‌లో కీలకపాత్ర వహిస్తాయి.
అమెరికాలో పిహెచ్.డి.లో ప్రవేశం దొరికిన వారందరికీ దాదాపుగా ‘ఫండింగ్’ దొరుకుతుంది కనుక ఖర్చుల సమస్య ఉండదు. వీరికి ఇంకొక ప్రధానమైన వెసులుబాటు ఏమిటంటే పిహెచ్.డి. తర్వాత అమెరికాలోనే ఉండి లీగల్‌గా అక్కడ అవకాశాలను పొందగోరేవారికి ‘ఇ.బి.1’ కేటగిరీ కింద కాలక్రమంలో గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు ఉంటాయి. యు.ఎస్. ఇమ్మిగ్రేషన్ చట్టాల క్రింద అక్కడ ప్రతి ఆర్థిక సంవత్సరం (అక్టోబర్-సెప్టెంబర్)లోను దాదాపు లక్షా 40 వేలమందికి ఎంప్లాయ్‌మెంట్ - బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాలు లభిస్తున్నాయి. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమాటిక్స్ (స్టెమ్) ఫీల్డులలో పిహెచ్.డి. లాంటి అడ్వాన్స్‌డ్ డిగ్రీలు చేసినవారికి రానున్న రోజులలో డిగ్రీతో పాటుగా గ్రీన్ కార్డు కూడా ఇచ్చే అవకాశాలు మెరుగుపడడం మరొక శుభసూచన. ఇన్ని అవకాశాలకు బంగారు వాకిలి లాంటి యు.ఎస్. యూనివర్శిటీ పిహెచ్.డి.లో అడ్మిషన్‌కి సహజంగానే కాస్త ఎక్కువగా శ్రమ చెయ్యవలసి ఉంటుంది మరి! కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో పిహెచ్.డి.కి రిక్వయిర్మెంట్‌ల గురించి ప్రసిద్ధ ‘టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్శిటీ’ ఏం చెబుతుందో ఈ వెబ్ లింక్‌లో చూడండి.
https://www.cs.tamu.edu/academics/graduate/phd_requirements