మూడేళ్ల డిగ్రీలకి యు.ఎస్. యూనివర్సిటీలలో ప్రవేశం?
ఇండియా నుంచి నాలుగేళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లు యు.ఎస్.లో ఎం.ఎస్.కి, ఎం.బి.ఎ.కి వెళుతుంటే ఇక్కడ బిఏ, బికామ్, బిఎస్సీ లాంటి మూడేళ్ల
డిగ్రీలు చేసినవారు అటువంటి అవకాశాల్ని పొందలేకపోతున్నారు. అమెరికాలో ఎం.ఎస్, ఎం.బి.ఎ. లాంటి కోర్సుల్లో చేరాలంటే అంతకుముందుగా 16
యేళ్ల పాటు చదివి ఉండాలన్న నియమం ఉండటం వల్ల ఇండియాలో పెద్దసంఖ్యలో ఉన్న మూడేళ్ల గ్రాడ్యుయేట్లకు అమెరికాలో ఉన్నత విద్య అందని ద్రాక్ష
పండుగానే మిగిలిపోతోంది. ఇక్కడ మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఒక విద్యార్థి అంతవరకూ 15 యేళ్ల పాటు మాత్రమే విద్యాభ్యాసం చేసి ఉంటాడు.
కొంతమంది ఆ ఒక్క ఏడాదిలోటును పూరించుకుని అమెరికన్ యూనివర్శిటీలో సీటుకోసం దరఖాస్తు చేసుకునే అర్హతని పొందడానికి మూడేళ్ల డిగ్రీ తర్వాత
వన్-ఇయర్ పీజీ డిప్లొమా చేస్తారు.
అయితే అసలు ఈ మూడేళ్ల డిగ్రీలు చేసేవారికి యు.ఎస్. యూనివర్శిటీలు ఉమ్మడిగా ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయా లేక కొన్ని యూనివర్శిటీల్లో ఏమైనా
మినహాయింపు ఉన్నదా? అంటే యూరప్‌లో ఏ దేశంలో చదివే డిగ్రీకైనా ఆ ఖండం మొత్తం మీద ఒకేరకమైన గుర్తింపు, ప్రవేశార్హతలు, ఉద్యోగ అవకాశాలు
లభించేందుకు వీలుగా యూరోపియన్ యూనియన్‌లోని కొన్నిదేశాలు ఉమ్మడిగా ‘బొలోన్యా ప్రాసెస్’ అనే ఒక నిరంతర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇప్పటికి 47దేశాలు ఇందులో భాగస్వాములుగా చేరాయి. ఇవన్నీ కలిసి ఉమ్మడి విద్యావిధానాన్ని పాటించడం వల్ల అక్కడ ఒక దేశంలో చేసిన డిగ్రీకి
మరొక దేశంలోని యూనివర్శిటీలో అర్హత, ప్రమాణాలకు సంబంధించిన చిక్కులు ఏర్పడవు.
పరిజ్ఞానం ప్రాతిపదిక మీద పురోగమిస్తున్న ప్రపంచ ఆర్థికవ్యవస్థలో పోటీని తట్టుకోవడానికి మరింత ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు
చేసుకోవలసిన అవసరం ఉన్నదని గుర్తించిన యూరోపియన్ యూనియన్ 1999 లోనే ఈ ‘బొలోన్యా ప్రాసెస్’ కి అంకురార్పణ చేసింది (బొలోన్యా అనేది
ఇటలీలోని ఒక యూనివర్శిటీ పేరు). ఒక ఉమ్మడి విద్యావిధానం దిశగా యూరోపియన్ యూనియన్ ముందుకు కదిలిన తర్వాత అమెరికన్
విద్యావ్యవస్థపైన కూడా దాని ప్రభావం కొంత పడిందని, విదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలకడంలో యు.ఎస్. విద్యాసంస్థలు కొన్ని అదనపు సౌలభ్యాలు
కల్పించడానికి ఇది కొంతమేరకు ప్రేరణ కల్పించిందని కొందరు పరిశీలకులు అంటారు. దాని సంగతి అలా ఉంచి ఇండియాలో మూడేళ్ల డిగ్రీలు చేసినవారికి
యు.ఎస్. యూనివర్శిటీల్లో ప్రవేశావకాశాలను ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ డిగ్రీలని అమెరికన్ డిగ్రీలతో సమంగా గుర్తించడం అనేది అమెరికాలో ఆరంభమైనదని చెప్పడానికి ఇప్పటికే కొన్ని సూచనలు ఉన్నాయని
కొందరు సోదాహరణంగా వివరిస్తున్నారు. కర్నాటకలోని ఒక ప్రముఖ యూనివర్శిటీ నుంచి ఒకామె బి.ఏ, ఎం.ఏ, ఎంఫిల్ చేయగా అమెరికన్
యూనివర్శిటీల కోసం విదేశీ డిగ్రీలను ‘ఎవాల్యుయేట్’ చేసే ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థ ఆ బి.ఏ, ఎం.ఏలని వాటికి సమానమైన యు.ఎస్. డిగ్రీల
సరసన ఉంచి ఇక్కడ చేసిన ఎంఫిల్‌కి యు.ఎస్.లో అడ్వాన్స్‌డ్ గ్రాడ్యుయేట్ స్టడీస్‌తో సమంగా ర్యాంకింగ్ ఇచ్చింది. కాగా యు.ఎస్.లోని కొన్ని
టాప్-ర్యాంకింగ్ యూనివర్శిటీలు కూడా మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీలు ఉన్నవారిని అడ్మిషన్లకు పరిశీలిస్తున్నట్టు తమ వెబ్‌సైట్లలో అధికారికంగా
పేర్కొంటున్నాయి. ప్రసిద్ధ డార్ట్ మౌత్ యూనివర్శిటీకి చెందిన ‘టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (హానోవర్ ఎన్.హెచ్.) తన వెబ్‌సైట్‌లోని ‘ఎఫ్.ఎ.క్యూ.’
సెక్షన్‌లో ఇలా వివరించింది...
ప్రశ్న: నాకు మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. టక్ స్కూల్లో అడ్మిషన్‌కి అది సరిపోతుందా?
జవాబు: సరిపోతుంది. అప్లికెంట్లకి బ్యాచిలర్స్ లేదా దానికి సరిసమానమైన డిగ్రీ (యూనివర్శిటీ లెవెల్) ఉండాలని మేము చెబుతున్నాము. ఆ డిగ్రీ
నాలుగేళ్లకంటే ఎక్కువకాలంలో పూర్తయినదా లేక నాలుగేళ్ల కంటే తక్కువకాలంలో చేసిందా అనేది అడ్మిషన్ కమిటీ పట్టించుకోదు.
న్యూయార్క్ (ఎన్.వై.)లోని ప్రసిద్ధ కొలంబియా యూనివర్శిటీకి చెందిన బిజినెస్ స్కూల్ కూడా మూడేళ్ల డిగ్రీలు చేసినవారిని ప్రవేశానికి పరిశీలిస్తోంది.
‘మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను మా అడ్మిషన్ల ఆఫీసు అంగీకరిస్తుంది. ఆ దరఖాస్తులను ‘కేస్-బై-కేస్’ ప్రాతిపదికన
పరిశీలిస్తాము’ అని కొలంబియా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.