Skip to main content

కంప్యూటర్ గేమ్ డిజైన్ కోర్సులతో 3- డి ఫ్యూచర్!

యు.ఎస్‌లో కంప్యూటర్ గేమ్ డిజైన్ రంగం విద్యార్థులకు భవిష్యత్తులో సువర్ణావకాశాలను ‘త్రీ-డీ’ ఫార్మాట్‌లో ఆవిష్కరిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి రానున్న దశాబ్దంలో ఇంకా గిరాకీని పెంచుతుందని అంచనా. గేమ్ డిజైన్‌రంగంలో మార్కెట్ విలువ 2010లో 5550 కోట్ల డాలర్లు ఉండగా 2015 నాటికి అది 8240 కోట్లకి చేరుతుందని లెక్కలు చెబుతున్నాయి.

వీడియోగేమ్ ప్రొడక్షన్, డెవలప్‌మెంట్, డిజైన్, ఆర్ట్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్‌లాంటివి ఇందులో భాగం. ఈ రంగానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గేమింగ్ స్టూడియోలలోను, ఆర్కిటెక్చర్‌లోను; ఇంకా మెడిసిన్, ‘లా’ లాంటి (ఇంటరాక్టివ్ స్టిమ్యులేషన్ అవసరమైన) ఇతర రంగాలలోను పని చేస్తుంటారు.

యు.ఎస్.లోని ఉత్తమ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంపెనీలలో ఒకటైన ‘ప్రిన్స్‌టన్ రివ్యూ’ (ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి, దీనికి సంబంధం లేదు) వీడియోగేమ్ డిజైన్‌కోర్సులకి అమెరికాలో ఉత్తమమైన విద్యాసంస్థల తాజా జాబితాని (2012) ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ‘టాప్ టెన్’లో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీడియో గేమ్ డిజైన్ కోర్సు వర్క్‌ని ఆఫర్ చేస్తున్న 150 విద్యాసంస్థలపై సర్వే చేసిన తర్వాత ‘ప్రిన్స్‌టన్ రివ్యూ’ ఈ జాబితాని రూపొందించింది. సిలబస్, ఫ్యాకల్టీ, సదుపాయాలు, మౌలిక వసతుల క్వాలిటీని ఈ సర్వేలో ప్రధాన అంశాలుగా తీసుకున్నారు.

ప్రిన్స్‌టన్ రివ్యూ సర్వే ప్రకారం వీడియోగేమ్ డిజైన్ కోర్సులకి అమెరికాలో ‘టాప్ టెన్’ గ్రాడ్యుయేట్ స్కూల్స్...: యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్ సి.ఎ.; రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రోచెస్టర్, ఎన్.వై; మశాచుసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంబ్రిడ్జ్జి, ఎం.ఎ; యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, ఆర్లండో, ఎఫ్.ఎల్; సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ, ప్లానో, టి.ఎక్; కార్నెగిమెలన్ యూనివర్సిటీ, పిట్స్‌బర్గ్, పి.ఏ., డిజీపెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రెడ్మాండ్ డబ్ల్యూ.ఎ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటాక్రజ్, సి.ఎ; డ్రెక్సెల్ యూనివర్సిటీ, ఫిలడెల్ఫియా, పి.ఎ, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అట్లాంటా, జార్జియా), న్యూయార్క్ యూనివర్సిటీ (న్యూయార్క్, ఎన్.వై), ది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ (రిచర్డ్స్‌న్, టి.ఎక్స్.), యూనివర్సిటీ ఆఫ్ ఊటా (సాల్ట్ లేక్ సిటీ, యు.టి.)మొదలైన మరికొన్ని విద్యాసంస్థలు కూడా వీడియోగేమ్ డిజైన్‌లో బెస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నట్టు ‘ఆనరబుల్ మెన్షన్’ గా ప్రిన్స్‌టన్ రివ్యూ పేర్కొంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ విద్యాసంస్థల వెబ్‌సైట్‌లలోకి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న కోర్సుల్ని పరిశీలించాలి.

రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (రోచెస్టర్, ఎన్.వై) గేమ్ డిజైన్ డెవలప్‌మెంట్‌లో ఆఫ్ చేస్తున్న ఎం.ఎస్.ని ఒక ఉదాహరణగా తీసుకుంటే-ఇది ప్రొఫెషనల్‌గేమ్ ఇండస్ట్రీలోను, సంబంధిత రంగాలైన సిమ్యులేషన్, ఎడ్యుటైన్‌మెంట్, విజువలైజేషన్‌లో కెరియర్‌ని ఆశించే వారికోసం రూపొందించిన కోర్సు, కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైన్, హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్, ఇంటరాక్టివ్ నేరేటివ్, గేమ్ డిజైన్ ఇందులో కోర్స్‌వర్క్‌గా ఉంటాయి. ఇది రెండేళ్ళ ఆన్ క్యాంపస్ ప్రోగ్రాం. కోర్సువర్క్ పూర్తయ్యాక విద్యార్థులు డెవలప్‌మెంట్ టీములుగా ఏర్పడి ఒక ‘వర్కింగ్ గేమ్ ఇంజన్’ని, సాఫ్ట్‌వేర్ టైటిల్‌ని నిర్మిస్తారు. దీనిని ప్రోగ్రాం ఫ్యాకల్టీ సమీక్షకి, పబ్లిక్ డిస్‌ప్లేకి కూడా పంపిస్తారు. రెండవ సంవత్సరంలో విద్యార్థులు బృందాలుగా 20 వారాలు పనిచేసి ఈ ‘వర్కింగ్ గేమ్ ఇంజన్’ ని రూపొందిస్తారు.

ఈ కోర్సులో ప్రవేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్‌సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ యానిమేషన్, హ్యూమన్- కంప్యూటర్ ఇంటరాక్షన్‌లో యు.జి.ని కూడా అడ్మిషన్‌కి పరిశీలిస్తారు. విదేశీ విద్యార్థులకు టోఫెల్, జి.ఆర్.ఈ. పరీక్షలు తప్పనిసరి. ఇతర ఫ్రీ-రిక్విజిట్‌ల కోసం ఒక్కో విద్యాసంస్థ వెబ్‌సైట్‌ని విడివిడిగా, ఓపికగా పరిశీలించాలి.

Published date : 29 Nov 2012 06:03PM

Photo Stories