జె-1 కూడా స్టూడెంట్ వీసాయేనా?
స్టూడెంట్ వీసా కేటగిరీలైన ‘ఎఫ్’, ‘ఎం’ కేటగిరీల మాదిరిగానే ‘సెవిస్’ వ్యవస్థ పర్యవేక్షణ కింద ఉండే మరొక ముఖ్యమైన వీసా - ‘జె’. దీనినే ఎక్స్‌ఛేంజ్
విజిటర్ వీసా అని కూడా అంటారు. విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర మార్పిడుల ద్వారా అమెరికన్ ప్రజానీకానికి, ఇతర దేశాల ప్రజలకు మధ్య
అవగాహనను పెంపొందించడానికి అమెరికా చట్టాల పరిధిలో ఈ ఎక్స్‌ఛేంజ్ విజిటర్స్ (జె-1) ప్రోగ్రాంని రూపొందించారు. ఇందులో ఒక ముఖ్యమైన ఆంక్షని
అమలు జరుపుతారు.
జె-1 మీద వెళ్లిన వారు అక్కడ తమ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్లీ అమెరికా తిరిగి చేరుకోవాలంటే విధిగా కొంతకాలం తమ స్వదేశంలో
నివసించాలి. దీనినే ‘‘ఫారిన్ రెసిడెన్సీ రిక్వయిర్మెంట్, లేదా టూ ఇయర్ హోమ్‌కంట్రీ ఫిజికల్ ప్రెజెన్స్ రిక్వయిర్మెంట్’’ అంటారు. ప్రొఫెసర్లు లేదా
స్కాలర్లు, రీసెర్చి అసిస్టెంట్లు, కొందరు స్టూడెంట్లు / ట్రయినీలు, టీచర్లు, స్పెషలిస్టులు లాంటి వారు జె-1 కేటగిరీ కిందికి వస్తారు. ఎక్స్‌ఛేంజ్ విజిటర్
కార్యక్రమాల కింద ఏ నెలలో చూసినా దాదాపు లక్ష, 70 వేల మంది పని చేస్తూనో, చదువుతూనో, బోధన చేస్తూనో ఉంటారంటే ఈ ప్రోగ్రాం ఎంత
విశిష్టమైనదో అర్థమవుతుంది. జె-1 వెంట వెళ్లే జీవిత భాగస్వామి, వారి 21 ఏళ్లు దాటని అవివాహితులైన పిల్లలకి ఇచ్చే వీసాని జె-2 అంటారు.
ఈ డిపెండెంట్ వీసా మీద వెళ్లిన వారు యు.ఎస్.లో ‘‘వర్క్ ఆథరైజేషన్’’ పొంది అక్కడ పని చెయ్యవచ్చు. అయితే జె-2 వీసా మీద ఉన్న వ్యక్తి
సంపాదించిన డబ్బుతో జె-1 వీసాహోల్డర్ని సపోర్ట్ చెయ్యడానికి వీలులేదు. జె-2లు అక్కడ చదువుకోవచ్చు కూడా. జె- వీసాలు నాన్-ఇమిగ్రెంట్ కేటగిరీ
కిందికి వస్తాయి. వీటి కోసం నేరుగా యు.ఎస్. కాన్సులేట్లలో దరకాస్తు చేసుకోవడానికి వీలు లేదు. యు.ఎస్ లోని ఒక అధీకృత స్పాన్సర్ (సంస్థ) నుంచి
‘‘డి.ఎస్.2019’’ ని అందుకున్న వారు మాత్రమే సమీపంలోని కాన్సులేట్ నుంచి జె-వీసా కోసం అప్లయ్ చేసుకోవాలి. జె-వీసా అప్లికేషన్ నిబంధనలు
యు.ఎస్. కాన్సులేట్ల వెబ్‌సైట్‌లలోను, ఈ ప్రోగ్రాం పూర్తి వివరాలు అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్ -exchanges. state.govలోను చూడవచ్చు.