ఇండియాలో ఎంటెక్, అమెరికాలో ఎం.ఎస్.: ఏది బెటర్?
యాపిల్ జ్యూస్ మంచిదా, బత్తాయిరసం మంచిదా అన్నది ఆ వ్యక్తి శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది. రెండూ మంచివే. ఆరోగ్యానికి పనికొచ్చేవే. కాకపోతే ఒంటితీరుని బట్టి వాడుకోవాలి. ఇండియాలో ఎంటెక్ చెయ్యడం మంచిదా, అమెరికాలో ఎమ్మెస్ చదవడం బెటరా అనేది కూడా అలాంటిదే. విద్యార్థి ఆసక్తిని బట్టి, ఆశయాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మాత్రమే దీనికి సరైన సమాధానం లభిస్తుంది.
ఒంటికి ఏ జ్యూస్ సరిపడుతుందో ఒక అలెర్జీ టెస్టు చేసి డాక్టర్ చెప్పగలుగుతారు. కాని ఎక్కడ ఏది చదవడం మంచిది అనే ప్రశ్నకు ఇదే స్పష్టమైన జవాబు అని ఎంతటి ఎక్స్‌పర్ట్ అయినా ఇతమిత్థంగా చెప్పలేరు. చెప్పినా అది సరికాదు. ఎందుకంటే ఇది ఏ విద్యార్థి తన స్థితిగతులకు అనుగుణంగా తను మాత్రమే ఆన్సర్ చేసుకోవలసిన ప్రశ్న. అయితే ఆ ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు ఉపయోగపడే కొన్ని పాయింటర్స్ (సూచికలు) ఉన్నాయి. వాటిని నేనిక్కడ అందించగలను.
మొదట ఇండియాలో ఐఐటీ లాంటి చోట ఎంటెక్ చెయ్యడం గురించి చూద్దాం. ముందుగా కొన్ని పాజిటివ్ సూచికలు -
ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీలకు తగ్గకుండా ఐఐటీల్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐఐటీల్లోని ప్రొఫెసర్లు ప్రపంచంలోని ఉత్తమ ప్రొఫెసర్ల కోవలోకి వస్తారు. రీసెర్చ్‌రంగంలో అంచులు చూడాలనుకున్నవారికి, శాస్త్రవేత్తలుగా మారాలనుకున్నవారికి ఐఐటీ నుంచి ఎంటెక్, ఆ తర్వాత పీహెచ్‌డీ అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఎంటెక్ అవ్వగానే కూడా ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక భారతీయ ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు తేలికగా లభిస్తాయి. ఇండియాలో అగ్రశ్రేణి కంపెనీలు ఐఐటీ నుంచి ఎంటెక్ చేసినవారిని పోటీపడి ఉద్యోగాలకు తీసుకుంటాయి.
ఐఐటీలు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. ఎంటెక్‌లో అడ్మిషన్ రాగానే మీకు ఆటోమాటిక్‌గా రీసెర్చ్ స్కాలర్‌గా మంత్లీ స్టైఫండ్ కింద కొన్ని వేల రూపాయల మొత్తం లభిస్తుంటుంది. దీనివల్ల ఫీజుల భారం పెద్దగా ఉండదు. క్యాంపస్‌లోనే ఉండటం వల్ల లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా చాలా తక్కువ.
ఐఐటీలాంటి భారతీయ ఉన్నత సాంకేతిక సంస్థల నుంచి పొందే ఎంటెక్‌కి ఇండియాలో విలువ, గౌరవం అధికం. ఇక్కడ చదువుకుని, ఇక్కడే ఉండి, స్వదేశానికి సేవ చెయ్యాలని ఆశించేవారికి దీనికి మించిన అవకాశం లేదు.
ఇప్పుడు ఇండియాలో ఎంటెక్‌కి సంబంధించి కొన్ని నెగెటివ్ పాయింటర్స్ (సూచికలు) కూడా చూద్దాం -
ఐఐటీ లాంటి భారతీయ ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్ టెస్ట్ చాలా టఫ్‌గా ఉంటుంది. కాంపిటీషన్ చాలా ఎక్కువ. కొన్ని వందల సీట్లకి కొన్ని లక్షల మంది (వివిధ ఇంజనీరింగ్ బ్రాంచీలకు చెందినవారు) పోటీపడతారు.
ఐఐటీలో ఎంటెక్ చేసిన తర్వాత చాలామంది టీచింగ్ జాబ్స్‌ని ప్రిఫర్ చేస్తారు. కాని ఈ రంగంలో ఇండియాలో జీతాలు అంత ఎక్కువేమీ కాదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తేలికగానే దొరికినా ప్రైవేట్ రంగం కూడా ఎంటెక్‌లకి గొప్ప ఆకర్షణీయమైన శాలరీస్ ఏమీ ఇవ్వడం లేదు.
ఐఐటీ లాంటి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో చేసిన ఎంటెక్‌కి ఇండియాలో విలువ, గౌరవం ఉన్నప్పటికీ గ్లోబల్ (ప్రపంచ) స్థాయి అవకాశాల విషయంలో మాత్రం దానికి ఆ స్థాయిలో ప్రిఫరెన్స్ లేదు.