హెచ్-1 మీద వెళ్లేవారు యు.ఎస్‌లో స్థిరపడవచ్చా?
కొన్ని నాన్-ఇమిగ్రెంట్ వీసాలకు వర్తించే ‘డ్యూయల్ ఇంటెంట్’ సంశయం (అమెరికాలో స్థిరపడిపోయే ఉద్దేశం ఉన్నదేమోననే అనుమానం) హెచ్-1బి వీసా కేటగిరీకి వర్తించదు. ‘డ్యూయల్ ఇంటెంట్’ ఉండడాన్ని యు.ఎస్. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ అనుమతించడం ఈ వీసా కేటగిరీ పట్ల ఆకర్షణని పెంచింది.
కొన్ని ఇతర నాన్-ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలవారు తమ స్వదేశంలో నివాసం (ఫారిన్ రెసిడెన్సీ) కలిగి ఉండాలనే నిబంధన ఉన్నది. అయితే హెచ్-1బి ఫారిన్ స్పెషాలిటీ వర్కర్లకి ఈ ఫారిన్ రెసిడెన్స్ ఉండనవసరం లేదు. తమ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉండగా హెచ్-1లు, వారి డిపెండెంట్లయిన హెచ్-4లు ఇంకా అమలులో ఉన్న తమ వీసాల మీద నిరభ్యంతరంగా అమెరికా బయటకు వెళ్లి వస్తుండవచ్చు.
హెచ్-1బి మీద అమెరికాలో పనిచేసే ప్రొఫెషనల్స్ అక్కడ చట్టబద్ధమైన శాశ్వత నివాసం కోసం తమకి, తమ డిపెండెంట్లకి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ దరఖాస్తు ఆమోదం పొందకపోతే మాత్రం తమ హెచ్-1బి కాలపరిమితి ముగుస్తున్నంతలోనే అమెరికా నుంచి తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది.
ఈ వర్క్ పర్మిట్ వీసా మీద అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తి అక్కడ మరొక ఉద్యోగానికి మారినప్పుడు తను ఆ కొత్త ఉద్యోగం కోసం కొత్తగా వీసాకి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. హెచ్-1బి మీద యు.ఎస్.లో ఆరేళ్ళ గరిష్ఠ కాలానికి ఉండే వీలున్నా ఈ ఆరేళ్ళ కాలపరిమితి అనేది ఉద్యోగం మారినప్పుడల్లా కొత్తగా అక్కడి నుంచి మొదలవ్వదు. ఎన్ని ఉద్యోగాలు మారినా ఒక హెచ్-1బి స్టేటస్‌లో మొత్తం ఆరేళ్ళ వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు నిబంధనలు అంగీకరిస్తాయి. కొన్ని డిఫెన్స్ ప్రాజెక్టులలో మాత్రం హెచ్-1బి మీద పదేళ్ళ వరకు పనిచేసే వీలుంటుంది. హెచ్-1బి డిపెండెంట్లుగా యు.ఎస్. వెళ్ళి అక్కడ హెచ్-1బి కి మారిన వారికి వారి ఆరేళ్ళ కాలపరిమితి వారు హెచ్-4 నుంచి హెచ్-1బి కి మారినప్పటి నుంచి మొదలవుతుంది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలోను 65 వేల వీసాలు మాత్రమే హెచ్-1బి కేటగిరీలో ఇస్తారు. దీనిని ‘మాన్యువల్ న్యూమరికల్ లిమిట్’ లేదా ‘క్యాప్’ అంటారు. యు.ఎస్. మాస్టర్స్ డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ అర్హతలు ఉన్నవారి తరఫున ఫైల్ చేసిన తొలి 20 వేల పిటిషన్లకి ఈ ‘క్యాప్’ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యు.ఎస్.లో ఒక ఉన్నత విద్యాసంస్థలో, దాని అనుబంధ సంస్థలలో పనిచెయ్యడానికి లేదా ఒక ప్రభుత్వ పరిశోధనా సంస్థలో పనిచేసేందుకు వెళ్లేవారు కూడా ఈ పరిమితి కిందకు రారు. ఈ ‘కోటా’ అనేది కొత్తగా దరఖాస్తు చేసుకునే హెచ్-1బి లకి మాత్రమే వర్తిస్తుంది గాని ఇప్పటికే యు.ఎస్.లో ఈ వీసా మీద పనిచేస్తూ ఎక్స్టెన్షన్లు కోరుతున్న వారికిగాని, ఇంకొక కంపెనీకి మారాలనుకుంటున్న వారికిగాని వర్తించదు.
హెచ్-1బి వీసా కేటగిరీలో కొందరు మోసపూరితమైన దళారీలు మీ అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. వారి పబ్బం గడుపుకోవడానికి మిమ్మల్ని ఏదో ఒక ఉచ్చులో ఇరికించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. నకిలీ అనుభవ పత్రాలు, నకిలీ డిగ్రీలు లాంటివి హెచ్-1బి దరఖాస్తుదారులకు దళారీలు విక్రయించగల అవకాశం ఉన్న కొన్ని పత్రాలు. వీసా ఇంటర్వ్యూలలో నకిలీ డాక్యుమెంట్లు దొరికితే ఆ అప్లికెంటు అమెరికాలో ప్రవేశించడంపైన శాశ్వత నిషేధం విధిస్తారు. దానితోపాటు స్థానిక పోలీసులు తనని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుంది.