Skip to main content

ఎఫ్-1 వీసా: హై-అలర్ట్ పాయింట్లు!

ఇవాళ ‘హలో అమెరికా’లో మన విద్యార్థులు ఎఫ్-1 వీసాకి వెళ్లేముందు, అలాగే ఎఫ్-1 వీసా వచ్చిన తర్వాత నిబంధనల పట్ల సరైన అవగాహన లేదా నిబద్ధత లేక చేసే కొన్ని పొరపాట్లని, దానితోపాటు వారు చెయ్యకూడని కొన్ని తప్పిదాల గురించి చర్చించుదాం.

ఎఫ్-1 ఇంటర్వ్యూకి యు.ఎస్. కాన్సులేట్‌కి వెళ్లేముందు పొరపాట్లు చెయ్యని విద్యార్థులకంటే చేసేవారే ఎక్కువగా ఉంటారంటే మీకు ఆశ్చర్యం కలిగినా అది నిజం. వీరు చేసే మొదటి పొరపాటు ఎఫ్-1 వీసా రూల్స్‌ని చివరి నిమిషం వరకూ అంతగా పట్టించుకోకపోవడం. అలాగే, వీసా తాలూకు సందేహాల గురించి కనిపించిన అందరి దగ్గరా మాట్లాడటం. దానివల్ల సమస్య తీరకపోగా అవతలివాళ్ల సందేహాలు వీరి సందేహాలకు తోడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకొక పెద్ద తప్పిదం - యు.ఎస్.కాన్సులేట్లు అందించే అధికారిక సమాచారాన్ని అంతగా పట్టించుకోకుండా కొందరు నకిలీ కన్సల్టెంట్ల మాటలు విని నకిలీ ఆస్తి పత్రాల్లాంటివి వీసా ఇంటర్వ్యూలకి తీసుకెళ్లడం. ఇక సర్వసాధారణంగా చాలామంది విద్యార్థులు చేసే మరొక పొరపాటు ఇంటర్వ్యూ చెయ్యబోయే ఆఫీసర్ పట్ల, యు.ఎస్. వీసా ప్రాసెస్ పట్ల ప్రతికూల భావాలతో వెళ్లడం. అన్నీ పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయినవారు సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చి ఇంటర్వ్యూ చేసినా భయపడవలసింది ఏమీ ఉండదు.

ఇక స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత దశలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఐ-20 మీద ఉన్న కోర్సు ప్రారంభ తేదీకి 30 రోజుల్లోగా ఎఫ్-1లు అమెరికా చేరుకోవచ్చు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు. యూనివర్సిటీలో చేరిన తర్వాత ఇండియా వచ్చి వెళ్లే విద్యార్థులు ‘సెవిస్’ నంబరు ఉన్న ఐ-20 ని దగ్గర పెట్టుకోవాలి. ఇండియాలో ఉండే కాలం 5 నెలలకు మించితే మళ్లీ వీసా స్టాంపింగ్‌కి వెళ్లవలసి ఉంటుంది.

ఎఫ్-1లు అక్కడ చదివేటప్పుడు మొదటి సంవత్సరంలో ఆఫ్-క్యాంపస్ ఎంప్లాయ్‌మెంట్‌ని అంగీకరించకూడదు. ఒక ఏడాది చదివిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యు.ఎస్.సి.ఐ.ఎస్. వారు ఆఫ్-క్యాంపస్ ఉద్యోగానికి అనుమతించవచ్చు. అలాగే యు.ఎస్.సి.ఐ.ఎస్. అనుమతి లేకుండా ఆన్-క్యాంపస్ ఉద్యోగాన్ని అనుమతించకూడదు. ఎఫ్-1 వీసా మీద ఉన్న విదేశీ విద్యార్థి భార్య/భర్త; డిపెండెంట్లయిన పిల్లలు అమెరికాలో పొరపాటున కూడా పనిచేసి డబ్బు సంపాదించకూడదు. ఇక ఓ.పి.టి. నుంచి హెచ్-1కి మారడం విదేశీ విద్యార్థి జీవితంలో కీలక దశ. ఓ.పి.టి. వల్ల విదేశీ విద్యార్థులు ఎఫ్-1 వీసా మీద ఉండగానే హెచ్-1తో పని లేకుండానే వర్క్ చేసి డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఓ.పి.టి. ముగియకముందే ఎఫ్-1 స్టేటస్ కోల్పోక పూర్వమే హెచ్-1కి జాగ్రత్తగా మారడం కుదరకపోతే అమెరికా నుంచి తక్షణం నిష్ర్కమించవలసి వస్తుంది. ఈ దశలో పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా అవసరం.

Published date : 15 Mar 2013 02:43PM

Photo Stories