ఎఫ్-1 విద్యార్థులకి ఆత్మీయ నేస్తం యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్.
అమెరికా అనే ఒక మహా సుందర స్వప్నంలో మీరు మీ వాటాను పంచుకోవాలంటే దానికి గౌరవప్రదమైన దగ్గర దారి బహుశ ఆ దేశంలో మీరు చదువుకోవడమే. ఎం.ఎస్. అయినా ఎం.బి.ఎ. అయినా అక్కడ కష్టపడి సాధించుకోగలిగితే ఆ కష్టం మీకెంతో ప్రియమైన మీ అమెరికన్ డ్రీమ్‌ని సాకారం చేస్తుంది.
అమెరికాలో ఒక విద్యాసంస్థలో ప్రవేశం సంపాదించడం, ఆ తర్వాత యు.ఎస్. వీసా అటుపిమ్మట అమెరికన్ యూనివర్సిటీలో/కాలేజీలో కాంపస్ లైఫ్-మీ యు.ఎస్. డ్రీమ్ నెరవేర్చుకునే ఎక్సయిటింగ్ జర్నీని మీరిక ప్రారంభించబోతున్నారు! అయితే ఈ ప్రయాణాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? భూమిలో బలమైన పునాదితో హండ్రెడ్‌స్టోరిస్‌కి మించిన బహుళ అంతస్థుల భవంతులను అనాయాసంగా, తామర తంపరగా కట్టుకుంటూ సోయే అమెరికన్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగే ఇక్కడ మీకు ఆదర్శం. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం అనే మీ సుందర స్వప్నం సాకారం కావడానికి మీరు ఈ దిశగా తీసుకునే తొలి దృఢ నిర్ణయాలు కీలకంగా నిలుస్తాయి.
మొట్టమొదటగా మీకోసం యు.ఎస్. యూనివర్సిటీల్ని వెదికి పెట్టడానికి, యు.ఎస్. యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం తెప్పించడానికి, మళ్ళీ ఆ తర్వాత మీ వీసా అప్లికేషన్లని నింపడానికి లేదా మీ వీసా దరఖాస్తుకి అవసరమైన డాక్యుమెంట్లని సమకూర్చడానికి మీ దగ్గర డబ్బు తీసుకుని పని చేసే వారెవరూ మీలాంటి ప్రతిభావంతులకి, హార్డ్‌వర్క్ చేసే వారికి అవసరం లేదని అర్థం చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతటినీ మీకు మీరుగా నిర్వహించుకోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీ ఆశయ సాధనకు ఈ సంకల్పమే మొదటి పునాది రాయి.
ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న యు.ఎస్. కాన్సులేట్‌లోని యు.ఎస్. ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్.) కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ తీసుకుని వారి సలహా కోసం వెళ్ళండి. అక్కడ నామమాత్రపు ఫీజు చెల్లించి మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా అమెరికాలో ఉన్నత విద్యా సంబంధమైన వనరులు, సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. యు.ఎస్.లో హయ్యర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన సాధికారికమైన, అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఇక్కడ మీకు లభిస్తుంది. (ఉచితంగా!)
యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్. ఆధ్వర్యంలో అనేక ఓరియంటేషన్ సెషన్స్ జరుగుతుంటాయి. వీటిలో పాల్గొనడానికి మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో యు.ఎస్. కాన్సులేట్లు లేదా యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్. ప్రెస్ రిలీజ్‌ల ద్వారా, ఇంకా వారి వెబ్‌సైట్లలోను ముందుగానే తెలియజేస్తారు.
అమెరికాలో పైచదువులకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ ఓరియంటేషన్ సెషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అనుభవజ్ఞులైన స్టూడెంట్ కౌన్సెలర్లు మీ సందేహాలను ఓపికగా తీర్చి మీ విద్యార్హతలకు తగిన ఉన్నతవిద్యని (యు.ఎస్.లో) మీ సూచించడంలోను, ఆయా కోర్సులలో ప్రవేశానికి అవసరమైన టోఫెల్, జి.ఆర్.ఇ లాంటి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయంలోను చక్కని సలహాల నిస్తారు.
అయితే యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్. ఏ యూనివర్సిటీకి ర్యాంకింగులు ఇవ్వడం గాని, ఫలానా యూనివర్సిటీ మంచిదని చెప్పడం గాని చెయ్యదు. చెన్నై, ముంబై, కోల్‌కతా, న్యూఢిల్లీల లోని యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్. కార్యాలయాలు: హైదరాబాద్, బెంగళూరు, మణిపాల్, అహ్మదాబాద్‌లలోని వీటి అనుబంధ కేంద్రాలు (శాటిలైట్ సెంటర్స్) మీ అమెరికా కల నెరవేరడానికి అవసరమైన అన్ని రకాల (విద్యావిషయక) సమాచారాన్ని ఒక్కచోటనే మీకు అందజేసే సింగిల్ విండోల్లాంటివి.