ఎన్నాళ్లకి మించి క్లాసులకి బ్రేక్ తీసుకోకూడదు?
క్లాసులకు ఎక్కువగా గైర్హాజరైతే విద్యార్థులు ఇక్కడ పరీక్షలకి అవకాశం కోల్పోతారు. అదే అమెరికాలో అయితే క్లాసులకి ‘డుమ్మా’ కొడితే ఏకంగా వీసా స్టేటసే గల్లంతై యు.ఎస్. నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు స్వదేశానికి వెళ్లినప్పుడు యు.ఎస్.లోని తమ క్లాసుల నుంచి ఎంతకాలం (గరిష్టంగా) ‘బ్రేక్’ తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
అమెరికా నుంచి బయటకు (స్వదేశానికి లేదా మరొక ఇతర దేశానికి) వెళ్లే విదేశీ విద్యార్థులు (ఎఫ్-1, ఎం-1 కేటగిరీల వారు) ఆ ‘బ్రేక్’ ఐదు నెలలు దాటితే వారి వీసా స్టేటస్‌ని కోల్పోతారు. తమ కోర్సుకి సంబంధించిన అధ్యయనం కోసం మరొక దేశానికి వెళ్లిన వారికి మాత్రం ఈ ఐదునెలల గడువు వర్తించదు. అయితే వేరొక దేశం వెళ్లి పరిశీలించాలనుకున్న అధ్యయనాంశం గురించి విద్యార్థులు తాము చదివే యూనివర్సిటీ అధికారి (డి.ఎస్.ఓ.)తో ముందుగానే చర్చించి, తగు అనుమతి తీసుకుని, దానిని గురించి ‘సెవిస్’ రికార్డులో నమోదు చేయించుకోవడం తప్పనిసరి.
కాగా, ఐదు నెలలకు మించి అమెరికా వెలుపల ఉన్న తర్వాత మళ్లీ యు.ఎస్. ఎయిర్‌పోర్టులో దిగిన ఎఫ్-1, ఎం-1 విద్యార్థులకి గడువు తీరని (ఆన్-ఎక్స్‌పైర్డ్) స్టూడెంట్ వీసా ఉన్నప్పటికి వారిని ‘తగిన నాన్- ఇమ్మిగ్రెంట్ వీసా లేనివారిగానే’ పరిగణించి అక్కడి అధికారులు వారికి అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించవచ్చు. ఆ సమయంలో బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అట్టి విద్యార్థులకు అంతవరకు ఉన్న గడువు తీరని (‘వాలిడ్’) స్టూడెంట్ వీసాని రద్దు చెయ్యవచ్చు కూడా.
ఇదిలా ఉండగా అమెరికా నుంచి బయటకు వెళ్లకపోయినా ఒక విదేశీ విద్యార్థి అక్కడ యూనివర్సిటీని, లేదా కోర్సుని మార్చుకున్న తర్వాత ఐదు నెలలలోగా మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించకపోతే సదరు విద్యార్థి వీసా స్టేటస్ రద్దు కావచ్చు. అలా స్టేటస్ కోల్పోయిన విద్యార్థులకు యు.ఎస్.సి.ఐ.ఎస్. వారు స్టేటస్‌ని పునరుద్ధరిస్తే తప్పించి వారి ఎఫ్-1, ఎం-1, వీసాలు ‘ఇన్ వాలిడ్’ అయి మళ్లీ భవిష్యత్తులో వారి అమెరికా ప్రయాణానికి ఉపయోగపడకుండా పోతాయి. యు.ఎస్.సి.ఐ.ఎస్. వెబ్‌సైట్‌ని గూగుల్‌సెర్చ్ ద్వారా చేరుకుని నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్ పొడిగింపు లేదా మార్పునకు ఉపయోగించే ఫామ్ ఐ-539 ని పంపించుకునే వివరాలను, ఇతర సమాచారాన్ని పొందవచ్చు.