ఎంటర్టైన్మెంట్ వీసా: పి
ఒక నిర్ణీతమైన కార్యక్రమానికి, పోటీకీ, ప్రదర్శనకి విదేశీ క్రీడాకారులు, ఆర్టిస్టులు, ఎంటర్టైనర్లని అమెరికాలోకి అనుమతించే నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీ పి-1
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్టిస్టు, ఎంటర్టైనర్, అథ్లీట్ ఈ వీసా మీద యుఎస్.లో ప్రవేశించి అక్కడ ఒక యు.ఎస్. ఎంప్లాయర్ లేదా యు.ఎస్. ఏజెంట్ ద్వారా ఏర్పాట్లు చేసుకునే విదేశీ ఎంప్లాయర్ నిర్వహించే కార్యక్రమం లేదా ప్రదర్శనలో పాల్గొనవచ్చు.అలా ఏర్పాటు చేసే ప్రదర్శనలకు అంతర్జాతీయ స్థాయి పొందిన పెర్ఫార్మర్లు మాత్రమే కావాలి. పి1 మీద యు.ఎస్. వెళ్లిన వారు అక్కడ పేమెంట్ కోసం, లేదా ప్రైజ్ మనీ కోసం ప్రదర్శన ఇవ్వవచ్చు.
యు.ఎస్.లో వారు పార్ట్‌టైమ్ స్టడీలో పాల్గొనవచ్చు. తమ వెంట వెళ్ళే సహాయకుల వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ డిపెండెంట్ల కోసం పి-4 వీసాలను కోరవచ్చు. పి1 ఎంటర్టైనర్లు ఒక్కరుగా కాక ఒక బృందంలో భాగంగా మాత్రమే యుఎస్.లో ప్రదర్శనలివ్వాలి. (ఇది క్రీడాకారులకు వర్తించదు). తగిన లేబర్ ఆర్గనైజేషన్‌ని సంప్రతించకుండా యు.ఎస్.సి.ఐ.ఎస్. వారు ఈ వీసా పిటిషన్లని ఆమోదించరు. వీరు ఒకరికంటె ఎక్కువ ఎంప్లాయిర్లకి పనిచేసే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రతి ఎంప్లాయరూ వేర్వేరుగా ఫామ్ ఐ-129 ని సమర్పించాలి. వీరి డిపెండెంట్లు వీరితో పాటు యు.ఎస్.లో ఉన్నప్పటికీ అక్కడ ‘వర్క్’ చెయ్యకూడదు. పి-1 మీద అయిదేళ్ల వరకు అమెరికాలో ఉండగలగడం, మొత్తం పదేళ్లకు దాటకుండా ఎక్స్టెన్షన్ చేసుకోగలగడం ఈ వీసా కేటగిరీ విశేషం. సర్కస్ బృందాలూ పి1-కేటగిరీ లోకి వస్తాయి.
ఇక ఫారిన్ ట్రూప్స్ లేదా బ్యాండ్స్ అమెరికా వెళ్ళి అక్కడ ఎక్స్చేంజి ప్రోగ్రాం క్రింద ప్రదర్శనలివ్వడానికి పి-2 వీసా అనుమతిస్తుంది. దీని మీద వెళ్ళేవారు అమెరికాలో ఒక ఎంటర్టైనర్గానో, ఆర్టిస్టుగానో ఒక బృందంలో సభ్యునిగానో లేక ఇచ్చిపుచ్చుకునే (రెసిప్రోకల్) ఎక్స్చేంజిలో భాగంగానో ఒక్కరుగానో పాల్గొనడానికి తాత్కాలికంగా వెళ్ళే వారై ఉండాలి. వీరు పేమెంట్ కోసం, ప్రైజ్ మనీ కోసం అక్కడ పెర్ఫామ్ చెయ్యవచ్చు. పార్ట్‌టైమ్ స్టడీలో పాల్గొనవచ్చు. తమ సహాయకులకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ డిపెండెంట్లకి పి-4 వీసాలని కూడా కోరవచ్చు.
ఇక అమెరికాలో ప్రదర్శన లివ్వడానికి, ఆర్టిస్టులు లేదా ఎంటర్టైనర్లుగా టీచ్ లేదా కోచ్ చెయ్యడానికి ఒక్కరుగా గాని, ఒక గ్రూపులో సభ్యులుగా గాని-సాంస్కృతికంగా విలక్షణమైన కార్యక్రమం కింద వెళ్ళే నాన్ ఇమిగ్రెంట్లకి ఇచ్చేది పి-3 వీసా. ఒక సంప్రదాయికమైన ఎథ్నిక్, ఫోక్, కల్చరల్, మ్యూజికల్, థియేట్రికల్ లేదా ఆర్టిస్టిక్ ప్రదర్శనకి సంబంధించి డెవలపింగ్, ఇంటర్ ప్రెటింగ్, రిప్రజెంటింగ్, కోచ్ లేదా టీచ్ చేసేందుకు అమెరికా వెళ్ళదలచిన ఆర్టిస్టులు, లేదా ఎంటర్టెయినర్లకి ఈ వీసా అందుబాటులో ఉంటుంది. ఈ వీసా మీద వెళ్ళేవారు యు.ఎస్.లో పాల్గొనే సాంస్కృతిక బృందాలు వారి కళారూపాల పట్ల అవగాహనను పెంచి వాటి అభివృద్ధికి దోహదం చేసేవారు కూడా అయి ఉండాలి. వీరు కూడా పార్ట్‌టైమ్ స్టడీలో పాల్గొనడం, ముఖ్యమైన సహాయకులకు వీసాలు కోరడానికి, పేమెంట్ లేదా ప్రయిజ్ మనీ కోసం పని చెయ్యడానికి, డిపెండెంట్లకి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.