ఏడాది గ్యాప్ ఉంటే ఎఫ్-1 వీసా రాదా?
యూనివర్శిటీ అడ్మిషన్ గాని, ఎఫ్-1 స్టూడెంట్ వీసా గాని కేవలం మీ జి.ఆర్.ఇ. స్కోర్లని బట్టి మాత్రమే వస్తాయని అనుకోకండి. అలాగే, తక్కువగా ఉంటే అవి రావని కూడా అనుకోకండి. మీ అకడమిక్ రికార్డు, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం, టోఫెల్ స్కోరు, మీ స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, మీకు మీ ప్రొఫెసర్లు ఇచ్చే రికమండేషన్ లెటర్లు, మీ విద్యావిషయిక నేపథ్యానికి మీరు యు.ఎస్.లో ఎంచుకున్న కోర్సుతో సంబంధం, దానికి ఇండియా వచ్చాక ఇక్కడున్న అవకాశాలు, అమెరికాలో ఉండి ఆ కోర్సు చేయడానికి మీకు గల ఆర్థిక స్థోమత, మీరు చూపించే ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీకు చెందినవేనన్న వాస్తవిక, సాధికారిక రుజువులు; మీరు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చెయ్యాలనుకోవడానికి దారి తీసిన కారణాలు లేదా ప్రేరణ, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే ఉద్దేశం మీకు లేకపోవడం... ఇందులో కొన్ని అంశాలు మీకు 1-20 ఇవ్వడాన్ని, మరికొన్ని మీకు ఎఫ్-1 వీసా మంజూరు చేయడాన్ని ప్రభావితం చేస్తాయి.
కొన్ని యూనివర్శిటీలు తాము టోఫెల్, జి.ఆర్.ఇ.లలో ఎంత మినిమమ్ స్కోర్లని ఆశిస్తున్నదీ తమ వెబ్‌సైట్‌లలో తెలియజేస్తాయి. అక్కడ ఏ యూనివర్శిటీ నిబంధనలు ఆ యూనివర్శిటీకే కనుక ఒక్కో వెబ్ సైట్‌ని విడివిడిగా చూసుకోవాలి.
మీరు ప్రతిభ, పట్టుదల విద్యార్థి అని చెప్పడానికి రెండవసారి మీరు జి.ఆర్.ఇ. రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమే నిదర్శనం. వీసా ఇంటర్వ్యూలో అడిగితే మొదటిసారి వచ్చిన స్కోరుతో సంతృప్తి చెందక మళ్లీ రాశానని ఉన్నది ఉన్నట్టు చెప్పండి. రెండవసారి రాయడం ఏ మాత్రం అభ్యంతరం కాదు. కొద్దిగా అయినా బెటర్‌మెంట్ ఉంది కనుక ఒకరకంగా అది మీకు ప్లస్ పాయింటే అవుతుంది. యూనివర్శిటీలకి గాని, వీసా ఆఫీసర్లకి గాని మీలాగా కష్టపడి రికార్డుని మెరుగు పరచుకునే విద్యార్థుల పైన సదభిప్రాయం ఏర్పడుతుందని నా నమ్మకం.
ఏడాది గ్యాప్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఈ గ్యాప్‌లో ఏదైనా ఉద్యోగం చేస్తే, అదే సంగతిని వీసా ఆఫీసర్ అడిగితే దాచకుండా చెప్పండి. జి.ఆర్.ఇ.లో బెటర్‌మెంట్ కోసం ఎటూ ప్రయత్నించారు కనుక దానితోపాటు మీరు చదివిన ఫీల్డులో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని ఆ స్వల్ప కాలిక ఉద్యోగం ద్వారా పొందగలిగానని చెప్పండి. అంతేగాని ఎవరో, ఏదో చెప్పారని చెయ్యని కోర్సుల్ని చేసినట్టు చూపించకండి. గ్యాప్ ఉన్నప్పుడు ఆ సమయాన్ని విద్యార్థి ఎంత ప్రాడక్టివ్‌గా ఆ సమయాన్ని వాడుకున్నారన్నది ముఖ్యం.
యు.ఎస్.వీసా అప్లికేషన్ ప్రాసెస్‌లో వీసా ఆఫీసర్లు ముఖ్యగా గమనించేది అప్లికెంట్ల సత్యశీలత. వీసా ఇంటర్వ్యూలలో లేనిది ఉన్నట్టు చూపినా, ఉన్నది లేనట్టు చెప్పినా ఫ్రాడ్ కేసు క్రింద నమోదై యు.ఎస్. వెళ్లే అవకాశం శాశ్వతంగా పోతుంది. మంచి ఉద్దేశాలు ఉన్న మీలాంటి కృషీవలులు కొందరు అక్కడక్కడ విన్న మాటల్ని బట్టి వీసా ప్రాసెస్‌లో పొరపాట్లు చేస్తుంటారు. అది మీ విషయంలో జరగకుండా చూసుకోండి. మీకు ఆ మాట ఈ మాట చెప్పేవారు కూడా మీకు చెడు చేయాలని అలా చెప్పరు. వాళ్లు సైతం ఎవరిదగ్గరో విన్న మాటలనే మీకు చెబుతారు. ‘‘గ్యాప్’’ వల్ల వీసాలు రాలేదని అనుకునేవారు ఎలా ఉంటారో... ‘‘గ్యాప్’’ ఉండి కూడా వీసాలు వచ్చినవారూ అలాగే ఉంటారు. అలా వీసాలు వచ్చినవారు రాత్రికి రాత్రి యు.ఎస్.కి ఫ్లయిట్ ఎక్కేసార్తురు కనుక వారి పాజిటివ్ స్టోరీలు మీ వరకూ రావు. వీసాలు రాక ఇక్కడ మిగిలిపోయిన వారి కథనాలు మాత్రమే ఆ నోటా ఈ నోటా చిలవలు పలవలుగా ప్రచారమవుతాయి. వీసా అప్లింకెట్లకి ప్రత్యేకించి స్టూడెంట్స్‌కి యు.ఎస్. వీసా ప్రాసెస్ మీద ప్రచారం అయ్యే అనేక అసత్య కథనాలు, అపోహల వల్లనే ఎక్కువగా నష్టం జరుగుతోంది.
మీకు జరిగిన ఆలస్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇక మీదట జరగవలసిన ప్రాసెస్‌ని ఒక నిర్ణీతమైన టైమ్‌లో పూర్తి చేసుకోండి. అన్ని రిక్వయిర్మెంట్లని జాగ్రత్తగా పూర్తి చేసుకుని ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తే మీలాంటి హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్‌కి 1-20, ఎఫ్-1 వీసా రెండూ రావచ్చు. ‘‘హలో అమెరికా’’లో ఇంతవరకు ఇచ్చిన సమాచారం అంతా ఒకేచోట రీడర్స్ అందరికీ అందుబాటులో ఉంది.
(https://www.sakshi.com/Main/DailyStory.aspx? categoryid=30&subcatid=0)
యు.ఎస్.యూనివర్శిటీలు, కోర్సులు, వీసాలు లాంటి అనేక అంశాల మీద ఇప్పటికి 80 రోజులకు పైగా రాసిన వివరాలన్నీ మీకు ఇక్కడ లభ్యమవుతాయి. ఇవి మీ ప్రయత్నంలో మీకు చాలా వరకు ఉపయోగపడతాయి.