ఏ వీసా మీద వెళుతున్నా ఇది మొదట తెలుసుకోండి
పిల్లల్ని తల్లిదండ్రులు ఒక దెబ్బ కొడితేనే కాదు... అమెరికా వెళ్లిన తర్వాత జీవిత భాగస్వామితో దురుసుగా ప్రవర్తించినా, బయట ఒక మహిళకు ఇబ్బంది కలిగించినా అక్కడి చట్టాలు దానిని తీవ్రంగానే పరిగణిస్తాయి. చదువులు, ఉద్యోగాల కోసం, ఇంకా ఇతర రకాల వీసాల మీద అమెరికా చేరుకునే వారందరూ తమ కోసం, తమ కుటుంబాల శ్రేయస్సు కోసం హార్డ్‌వర్క్ చేసి అభ్యున్నతి సాధించడానికి అక్కడికి వెళ్ళే మెచ్యూర్డ్ జనరేషన్‌కి చెందినవారే కనుక ఇటువంటి బెడద వారికి రాదనే భావించాలి. అయితే ఇక్కడ ఉండగా యథాలాపంగా జీవిత భాగస్వామి మీద చెలాయించే ఒక ‘విశేషాధికారం’, బయట వారి మీద వేసే ఒక జోక్ అక్కడ డొమెస్టిక్ వయొలెన్స్ (గృహహింస), వయొలెన్స్ అగెనైస్ట్ విమెన్, యాంటీ-స్టాకింగ్ చట్టాల లాంటి వాటిని తట్టి లేపవచ్చు.
అమెరికా చట్టాలు గృహాలను, ఆఫీసులను, బయట సమాజాన్ని వేధింపుల నుంచి సురక్షితం చేస్తున్నాయి. ఈ చట్టాలు స్త్రీ, పురుషులకు సమానంగా వర్తిస్తాయి. అయితే ఎక్కువ సందర్భాలలో బాధితులు మహిళలే కనుక వీటి ప్రయోజనం వారికే ఎక్కువ. అలాగే, అమెరికాలో స్థానికులతో పాటు ఇతర దేశాల నుంచి అక్కడికి నాన్-ఇమిగ్రెంట్లుగా, ఇమిగ్రెంట్లుగా వెళ్లేవారందరికీ ఇవి సమానంగా వర్తిస్తాయి. పురుషాధిక్య సమాజాల నుంచి వెళ్ళేవారు యు.ఎస్.లో పురుషాధిక్యత అన్నది మాటవరసకి కూడా చెల్లదని మొదట అర్థం చేసుకోవాలి. ఏయే చర్యలు అక్కడ డొమెస్టిక్ వయొలెన్స్ కిందికి తెలుసుకునే ముందు ఇప్పుడు ‘స్టాకింగ్’ గురించి-
ఇక్కడి నుంచి చూస్తే ఇది చాలా సున్నితంగా కనిపిస్తుంది. ఒక బయటి మహిళకి ఫ్లవర్స్ ఇవ్వడం కూడా కొన్ని సందర్భాలలో ‘స్టాకింగ్’ నేరం కిందకే వస్తుందంటే విదేశాల నుంచి వెళ్ళినవారు దీనిపట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుస్తుంది.
ఒక వ్యక్తి (ఎక్కువ సందర్భాలలో ఒక స్త్రీ) పట్ల అనవసరమైన శ్రద్ధ చూపడం, తనతో అకారణ పరిచయానికి ప్రయత్నించడం, అది వేధింపు కిందకి వచ్చేలా ప్రవర్తించడం, ఆ వ్యక్తికి భయం కలిగించడం, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరగడం ‘స్టాకింగ్’ కిందికి వస్తుంది. విక్టిమ్ ఒక స్త్రీ అయినప్పుడు ఎలాంటి చర్యలు దీనిలో నేరంగా భావిస్తారో చూద్దాం-
ఫోన్, పోస్టల్ మెయిల్, ఈమెయిల్ ద్వారా అనవసరంగా ఒక మహిళను అనవసరంగా పదే పదే డిస్టర్బ్ చెయ్యడం
ఆమె అభిలషించకపోయినా ఆమెకి పదే పదే గిప్టుల్ని పంపడం లేదా ఆమె కోసం వాటిని ఒకచోట వదిలిపెట్టడం
ఇల్లు, స్కూలు, ఆఫీసు, ఇంకా ఇతర ప్రదేశాల వద్ద ఆమె కోసం కాపు కాయడం లేదా ఆమెని అనుసరించి అక్కడికి వెళ్ళడం
ఆమెకి, ఆమె పిల్లలకి బంధుమిత్రులకి, పెట్స్‌కి హాని తలపెట్టగలనని బెదిరించడం, ఆమె ఆస్తికి నష్టం కలిగిస్తానని బెదిరించడం, లేదా నష్టం కలిగించడం లేదా ఇంటర్నెట్ ద్వారా ఆమెని వేధించడం,
బహిరంగ ప్రదేశంలో గాని, వేరొకరితో మాట్లాడడం ద్వారా గాని, ఇంటర్నెట్ ద్వారా గాని ఆమెకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చెయ్యడం లేదా ఆమె మీద వదంతులు సృష్టించడం
పబ్లిక్ రికార్డుల నుంచి, ఇంటర్నెట్ ‘సెర్చ్’ సర్వీసులను ఉపయోగించి, ప్రైవేట్ డిటెక్టివ్‌లను నియమించి, ఆమె వేస్ట్ బాస్కెట్లని శోధించి, ఆమెని అనుసరించి, ఆమె మిత్రుల్ని కుటుంబ సభ్యుల్ని, సహోద్యోగుల్ని, పొరుగువారిని కాంటాక్ట్ చేసి ఆమెకి సంబంధించిన సమాచారాన్ని పోగుచెయ్యడం...
ఇవన్నీ యు.ఎస్.లో ‘స్టాకింగ్’ నేరం కిందికే వస్తాయి. బాధితుల కోసం యు.ఎస్.డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని 1-800-394-2255; 1-800-211-7996 హాట్ లైన్స్ ఉన్నాయి. విదేశాల నుంచి వెళ్ళినవారికైనా, అమెరికాలోని స్థానికులకైనా సహాయం అందుతుంది.
సోమవారం ‘హలో అమెరికా’లో అక్కడ గృహహింస, మహిళల పరిరక్షణ కింద ఏయే అంశాలు వస్తాయో చూద్దాం. ఈలోగా శని, ఆదివారాలలో రీడర్స్ ప్రశ్నలకి జవాబులు.