అమెరికాలో ఫిజికల్ థెరపీ
ఫార్మసిస్టుల మాదిరిగానే అమెరికాలో అపారమైన గౌరవం, విలువ ఉన్న వృత్తి ఫిజియోథెరపీ. యు.ఎస్.లో దీనిని ఫిజికల్ థెరపీ అంటారు. అక్రెడిటెడ్ కాలేజి లేదా యూనివర్శిటీ నుంచి ఫిజికల్ థెరపిస్టు అవ్వడానికి అన్ని ఇతర ఫార్మాలిటీస్ కలిపి దాదాపు ఆరేళ్లు పడుతుంది. అక్రెడిటెడ్ విద్యాసంస్థల నుంచి రెండు మూడేళ్ల డిగ్రీలతో వచ్చే ఫిజికల్ థెరపిస్టు అసిస్టెంట్లకి కూడా అమెరికాలో మంచి డిమాండు ఉంది.
అమెరికాలో ఫిజికల్ థెరపిస్టు అంటే మానవ శరీరం పైన, పనితీరు పైన దృష్టి పెట్టే ఒక విద్యాధికుడైన లెసైన్స్డ్‌హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అనేది సర్వత్రా నెలకొని ఉండే ఒక గొప్ప అభిప్రాయం. నొప్పిని తగ్గించడం; ఆరోగ్యాన్ని, స్వస్థతని పెంపొందించడం; మానవ శరీరపు కదలికల్ని మెరుగుపరచడం లేదా పునరుద్ధరించడం అక్కడ వారి వృత్తికి సంబంధించిన నిర్వచనంగా ఉంటుంది. ఫిజికల్ థెరపిస్టు ఒక కేసులో జోక్యం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవన ప్రమాణం మెరుగుపడి శరీరం గరిష్ఠస్థాయిలో పనిచేస్తుందనేది ఎల్లెడలా నాటుకుని ఉండే నిశ్చితాభిప్రాయం.
అమెరికాలో ఫిజికల్ థెరపిస్టులు ఆస్పత్రులు, స్కూళ్లు, పునరావాస కేంద్రాలు, నర్సింగ్ సెంటర్లు, పరిశ్రమలు, పేషెంట్ల గృహాలతో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొంటారు. వీరు క్లినీసియన్లుగా, రీసెర్చర్లుగా, ఎడ్యుకేటర్లుగా, అడ్మినిస్ట్రేటర్లుగా, కన్సల్టెంట్లుగా పనిచేస్తారు.
యు.ఎస్.లో ఫిజికల్ థెరపిస్టు అవ్వాలంటే ఏ విద్యార్థి అయినా సరే ముందుగా ఒక అక్రెడిటెడ్ ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ చేసి ఆ తర్వాత నేషనల్ లెసైన్సింగ్ పరీక్షని కూడా అధిగమించాలి. ఈ ప్రోగ్రామ్‌లలో 90 శాతం డి.పి.టి. (డాక్టర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ) డిగ్రీని ఇస్తారు. సగటు డి.పి.టి. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌కి మూడేళ్ల వ్యవధి, 115 క్రెడిట్స్ అవసరం అవుతాయి. క్లాసులు, లేబొరేటరీ కోర్సులు కాక విద్యార్థులు 36 వారాల ఫుల్-టైమ్ క్లినికల్ ఇంటర్న్‌షిప్ అనుభవం పొందాలి.
ఫిజికల్ థెరపీ కోర్సులో ప్రవేశం పొందడానికి ముందు విద్యార్థులు విధిగా చేసి ఉండవలసిన ‘ప్రీ-రిక్విజిట్’ కోర్సులలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, హ్యూమన్/వెర్టైబ్రేట్ అనాటమీ; ఫిజియాలజీ, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఫిజికల్ థెరపిస్టు ప్రాక్టీసుకి సంబంధించి యు.ఎస్. రాష్ట్రాలలో నిబంధనలు మారుతూ ఉంటాయి. యు.ఎస్. కార్మికశాఖ (లేబర్ డిపార్ట్‌మెంట్) అంచనా ప్రకారం 2018 నాటికి అమెరికాలో ఫిజికల్ థెరపిస్టు ఉద్యోగాలకు 30 శాతం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
యు.ఎస్.లో విదేశీ విద్యార్థులు ఫిజికల్ థెరపీ కోర్సులలో ప్రవేశం పొందడానికి గల అవకాశాలపై ఒక ఉదాహరణ కోసం టెక్సాస్ రాష్ట్రంలోని ఒక యూనివర్శిటీ వెబ్‌సైట్‌ని పరిశీలించినప్పుడు ‘‘విదేశీ విద్యార్థులు - వారు తమ దేశంలో మెడికల్ డిగ్రీని పొందిన వారైనప్పటికీ ఇక్కడ ప్రీ రిక్విజిట్ కోర్సులను పూర్తి చెయ్యడం తప్పనిసరి’’ అని అక్కడ ఉంది. వీటికి తోడు జి.ఆర్.ఇ., టోఫెల్ స్కోర్లు కూడా కావాలి. లెసైన్సు పొందాలనుకున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక రిక్వయిర్మెంట్‌లని కూడా పరిపూర్తి చేయవలసి ఉంటుంది.