Skip to main content

అమెరికాలో ప్రవేశానికి ఎవరు అనర్హులు?

అమెరికా వెళ్లడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చా లేక ఆ దేశంలో ప్రవేశించడానికి అక్కడి చట్టాల ప్రకారం అర్హతలేని వారంటూ ఎవరైనా ఉంటారా?
- పాఠకులు

‘ఫ్రాడ్’కి పాల్పడడం వల్ల యు.ఎస్. వెళ్లే అవకాశం కోల్పోయిన వారు ‘వైవర్’కి అప్లయ్ చేసుకోవడం గురించి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు ఎవరెవరు అమెరికా శాశ్వతంగా వెళ్లలేరో తెలుసుకోండి

అనేక శ్రేణుల వీసాలతో ఒక అక్షయపాత్రలా, ఒక పుష్పక విమానంలా, ఒక కల్పవృక్షంలా, ఒక కామధేనువులా ఏటా లక్షలాదిమందిని స్వాగతించే అమెరికా తన ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్ట ప్రకారం వీసాలు పొందడానికి లేదా దేశంలో ప్రవేశించడానికి అనర్హులుగా తీర్మానించిన కొందరికి మాత్రం తన తలుపులు మూసే ఉంచుతుంది. ఆరోగ్యపరమైన కారణాల కింద చూస్తే మొదటగా - ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే అంటువ్యాధులు ఉన్న విదేశీయులు అమెరికా వీసాకి, అమెరికాలో ప్రవేశించడానికి అనర్హులు (హెచ్.ఐ.వి.ఇన్‌ఫెక్షన్ వీసాకి ఒక అనర్హతగా పరిగణించే నిబంధనని అమెరికా 2010 జనవరి నుంచి తొలగించింది). మీజిల్స్, మంప్స్, ఇన్‌ఫ్లుయెంజా, హెపటైటిస్‌లాంటి వ్యాక్సిన్‌లతో నివారించగల వ్యాధులకు (నిర్దేశిత జాబితాలోని వాటికి) వ్యాక్సీన్‌లు వేయించుకున్నట్టుగా రికార్డు చూపలేని ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లు; తన, లేదా ఇతరుల క్షేమానికి, భద్రతకి ముప్పుగా పరిణమించగల; లేదా ఇప్పటికే పరిణమించిన శారీరక, మానసిక రుగ్మత గలవారు; మాదక ద్రవ్యాల (డ్రగ్స్)ను వినియోగించేవారు, వాటికి బానిసలైనవారు - వీరంతా అమెరికాలో ప్రవేశానికి అనర్హులు.

అనైతికమైన పనులతో నేరాలకు పాల్పడేవారు, డ్రగ్స్ లాంటి వాటికి సంబంధించి అమెరికా, లేదా ఇతర దేశాల చట్టాలను ఉల్లంఘించినవారు, వ్యభిచారానికి పాల్పడే ఉద్దేశంతో అమెరికా వెళ్లదలచినవారు లేదా గత పదేళ్లలో వ్యభిచారానికి పాల్పడిన దాఖలా ఉన్నవాళ్లు; వేశ్యలను, వేశ్యావ్యాపారం నిమిత్తం కొందరు వ్యక్తులను అమెరికాకు చేరవెయ్యాలనుకునేవారు; మానవ దౌర్బల్యాల మీద వ్యాపారం చేసేవారు అమెరికాలో ప్రవేశించడానికి వీలులేదు.

మత స్వేచ్ఛకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన విదేశీ ప్రభుత్వాల అధికారులు, మనుషుల అక్రమ తరలింపు (హ్యూమన్ ట్రాఫికింగ్)నకు పాల్పడినవారు, మనీ లాండరింగ్‌తో ప్రమేయం ఉన్నవారు; గూఢచర్యానికి, విద్రోహానికి పాల్పడే ఉద్దేశంతో అమెరికాలో ప్రవేశించాలనుకునేవారు, అమెరికా ప్రభుత్వాన్ని కూలద్రోసే చర్యలకు పాల్పడాలనుకునేవారు, టైస్టు చర్యలకు సంకల్పించేవారు, విదేశీ టైస్టు సంస్థల సభ్యులు, అమెరికా విదేశాంగ విధానికి తీవ్ర ప్రతికూల పర్యవసానాలు కల్పించగల వ్యక్తులు, నాజీ మారణకాండలో పాల్గొన్నవారు, అప్పటి నాజీ జర్మన్ ప్రభుత్వంలో ఉన్నవారు అమెరికాలో ప్రవేశానికి అనర్హులు. ఒక నిరంకుశ పార్టీ సభ్యులుగా ఉండి ఇమిగ్రెంటుగా అమెరికా వెళ్లానుకునేవారు అమెరికాలో ప్రవేశించడానికి వీలులేదు (దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి).

సైన్యంలోకి పిల్లల్ని నియమించిన చరిత్ర ఉన్నవారు, లేదా బాలలని సైన్యం కోసం ఉపయోగించుకున్నవారు; అమెరికా వెళ్లి అక్కడ బహుభార్యత్వాన్ని పాటించాలనుకున్నవాళ్లు, ఒక దేశపు చట్టాలకు విరుద్ధంగా అక్రమ ఓటింగుకి పాల్పడినవారు, పన్నులు తప్పించుకోవడానికి అమెరికన్ పౌరసత్వాన్ని అధికారికంగా వదిలేసి మళ్లీ ఆ తర్వాత కొన్నేళ్లకి అమెరికా చేరుకోవాలని ప్రయత్నించేవారు అమెరికాలో ప్రవేశించడానికి చట్టం ఒప్పుకోదు. వీటన్నింటిలోకి బాగా ముఖ్యమైన అంశం - ఏ దేశంలో అయినా సరే, ఎన్నాళ్ల క్రితం అయినా సరే - తప్పుడు సమాచారం ద్వారా, అక్రమపద్ధతుల ద్వారా వీసా పొందడానికి ప్రయత్నించినవారు అమెరికాలో ప్రవేశానికి అనర్హులు అవుతారు (వీరిలో అతి కొద్దిమందికి మాత్రం ‘వైవర్’ ద్వారా యు.ఎస్.లో ప్రవేశానికి అభ్యర్థన పంపించుకునే వీలుంటుంది).

Published date : 23 Feb 2013 03:12PM

Photo Stories