విద్యాశాఖలో కోర్టు కేసుల కంప్యూటరీకరణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన కోర్టు కేసులను కంప్యూటరీకరించాలని ఆ శాఖ నిర్ణయించింది.
ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి.. ఏయే కేసులకు ఎప్పుడు ఎవరు కోర్టుకు వెళ్లాలన్న సమగ్ర సమాచారం పాఠశాల విద్యా డెరైక్టరేట్ వద్ద లేదు. దీంతో ఒక్కోసారి జిల్లాల నుంచి సమాచారం అందక, ఎవరూ వెళ్లకపోవడంతో కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. ఒక్కోసారి ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా జడ్జీలు పిలుస్తు న్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు పాఠశాల విద్యకు సంబంధించిన ప్రతీ కేసును కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ఆ శాఖ నిర్ణయించింది. తద్వా రా రాష్ట్ర స్థాయి అధికారులు ఏ రోజు ఏ జిల్లాకు సంబంధించిన ఎన్ని కేసుల హియరింగ్ ఉంది.. వాటికి ఎవరు హాజరు కావాలి.. తదితర అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రక్రియపై దృష్టి సారించింది. త్వరలో పాఠశాల విద్యా వెబ్‌సైట్‌లో కోర్ట్ కేసెస్ పేరుతో ప్రత్యేక లింకును అందుబాటులోకి తీసుకురానుంది.
Published date : 09 Jan 2020 02:35PM