Skip to main content

ట్రిపుల్ ఐటీ 2020-21 ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్

సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మంగళవారం రాత్రి జీఓ 152ను ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర విడుదల చేశారు. దీని ప్రకారం 2020-21 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు ఆయా కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ట్రిపుల్ ఐటీల్లోని ఆయా కోర్సుల సీట్లకు పదో తరగతిలో మెరిట్‌లో ఉన్న విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంది. కోవిడ్ నేపథ్యంలో 2019-20 విద్యాసంవత్సరంలోని పదో తరగతి విద్యార్థులను మార్కులు, గ్రేడ్లు లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటించడంతో మెరిట్ నిర్ణయం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్, విద్యార్థుల ఎంపికకు విధివిధానాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ప్రకటించనున్నారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను వంద మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఓఎమ్మార్ షీట్లతో నిర్వహించనున్నారు. టెన్త్ మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఈ పరీక్ష ప్రశ్నలు అడగనున్నారు. మేథ్స్‌లో 50, ఫిజిక్సు, కెమిస్ట్రీల్లో 25, బోటనీ, జువాలజీల్లో 25 మార్కులకు మొత్తం 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. 85% సీట్లు లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులకు, మిగతా 15% సీట్లు మెరిట్ కోటాలో భాగంగా రాష్ట్ర విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకూ అవకాశమిస్తారు. ఈ టెస్ట్ ద్వారానే విద్యార్థులను డిప్లొమా కోర్సులకు ఎంపిక చేసుకోవాలని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీలు నిర్ణయించాయి.
Published date : 22 Oct 2020 12:17PM

Photo Stories