Skip to main content

నేషనల్ డిజిటల్ లాకర్‌లోసర్టిఫికెట్ల డిపాజిట్లు.. ఎందుకో తెలిస్తే ఆశ్యర్యపోతారు!

సాక్షి, అమరావతి: నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్‌ఏడీ) ద్వారా విద్యార్థుల సర్టిఫికెట్ల డిజిటలైజేషన్ విధానాన్ని కేంద్రం చేపట్టింది.

దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలు, విద్యాసంస్థలు, విద్యార్థులను దీనికి అనుసంధానించే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అన్ని విద్యాసంస్థలు ఎన్‌ఏడీకి అనుసంధానం కావాలని, అలాగే విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను ఎన్‌ఏడీలో రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా తమ పరిధిలోని వర్సిటీలు, కాలేజీలు, ఇతర సంస్థలకు సూచించాయి. విద్యార్థుల ధ్రువపత్రాల సమాచారం విద్యాసంస్థలు ఎన్‌ఏడీలో అప్‌లోడ్ చేసిన అనంతరం అవి డిజిటలైజ్ అవుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ఈ డిజిటలైజ్డ్ సర్టిఫికెట్లు శాశ్వతంగా భద్రంగా ఉండేలా ఎన్‌ఏడీ ‘డిజిలాకర్’లో నిక్షిప్తం చేస్తోంది. యూజీసీ ద్వారా కేంద్రం ఏర్పాటు చేసిన ఈ విధానానికి ఆయా విద్యాసంస్థల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌ఏడీలో వివిధ విద్యాసంస్థలు విద్యార్థులకు సంబంధించిన 6,60,36,798 ధ్రువపత్రాలు డిపాజిట్ చేశాయి. 36,52,875 మంది విద్యార్థులు ఎన్‌ఏడీలో రిజిస్టర్ అయ్యారు. ఇతర విద్యాసంస్థలు కూడా దీనితో అనుసంధానమయ్యేలా యూజీసీ ఇతర కేంద్ర విద్యావిభాగాలు చర్యలు చేపట్టాయి.

దేశవ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలు
దేశంలో సుమారు 60 పాఠశాల బోర్డులు, 416 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 124 డీమ్డ్ వర్సిటీలు, 54 కేంద్ర విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలో వేలాది కాలేజీలు, 364 ప్రయివేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితో పాటు ఐఐఎస్‌సీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఐఐఐటీలు, ఎన్‌ఐటీలు 107, కేంద్ర నిధుల ద్వారా నడుస్తున్న 12 ఇతర సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు వివిధ డిగ్రీలు, డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నాయి. కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు సర్టిఫికెట్లు, మార్కుల షీట్లు, మూల్యాంకన రికార్డులు, ఇతర అవార్డులు జారీ చేస్తుంటాయి. ఇవే కాకుండా వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలు, ఇతర నైపుణ్యాభివృద్ధి సంస్థలు పలు కోర్సులు నిర్వహిస్తూ సర్టిఫికెట్లు అందిస్తున్నాయి.

పాడైపోవడం, తిరిగి పొందడంలో ఇబ్బందులు
కాగితాల రూపంలో ఇస్తున్న ఈ సర్టిఫికెట్లు పాడైపోవడం, ఇతర కారణాల వల్ల వాటిని తిరిగి పొందడంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వివిధ కాలేజీలు.. విద్యార్థులు తమకు అందించిన ధ్రువపత్రాలను తిరిగి వారికి ఇచ్చేటప్పుడు ఇబ్బందులు పెడుతున్నాయి. కాగితాల రూపంలో ఇస్తున్న ఈ ధ్రువపత్రాల ద్వారా ఉద్యోగమో, ఉపాధి కోసం, రుణాలు పొందడానికి, ఇతర అవసరాలకు ఆయా సంస్థలకు అందించినప్పుడు వాటి పరిశీలన కష్టతరంగా మారుతోంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలకు వెళ్లినప్పుడు ఆయా సంస్థలకు ఈ ధ్రువపత్రాల పరిశీలనలో సమస్యలు ఎదురవుతున్నాయి. నేషనల్ అకడమిక్ డిపాజిటరీలోని డిజిటల్ లాకర్‌లో అన్ని సంస్థల సర్టిఫికెట్లను పొందుపర్చడం ద్వారా ఆన్‌లైన్‌లో ఆయా సంస్థలు అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవో కావో సులభంగా కనుక్కోగలుగుతారు.

ఎవరెవరు దీని పరిధిలోకి వస్తారంటే..

  • దేశంలోని యూజీసీ సహా వివిధ విభాగాల అనుమతి, గుర్తింపు ఉన్న వివిధ విద్యాసంస్థల విద్యార్థులు.
  • జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు, బోర్డులు, సంబంధిత ఇతర సంస్థలు, బ్యాంకులు, దేశ, విదేశీ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, విశ్వవిద్యాలయాలు.
  • కేంద్ర విద్యాశాఖ, యూజీసీ సహా వివిధ విభాగాల పరిధిలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఐఐఎస్‌ఆర్‌లు, ఇతర అన్ని విద్యాసంస్థలు, గుర్తింపు ఉన్న ప్రయివేటు, డీమ్డ్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు.
  • కేంద్ర విద్యాసంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల చట్టాల ద్వారా అధికారం పొందిన వర్సిటీలు.
  • కేంద్ర నైపుణ్యాభివృద్ధి విభాగం పరిధిలోని సంస్థలు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇతర పాఠశాలల బోర్డులు.
  • యుజీసీ జారీ చేసిన జాబితాలోని వివిధ అర్హత పరీక్షా సంస్థలు.


ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌తో ప్రయోజనాలు..

  • అన్ని విద్యాసంస్థలు డిజిటల్ లాకర్‌లో ధ్రువపత్రాల డేటాను అప్‌లోడ్ చేయడం ద్వారా విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం విద్యాసంస్థలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.
  • వివిధ సంస్థలు ఆయా సర్టిఫికెట్లను నిర్ధారించుకోవడానికి విద్యాసంస్థలను సంప్రదించాల్సిన అవసరమూ ఉండదు.
  • సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేయడం వల్ల వాటిని ఫోర్జరీ, దొంగ సర్టిఫికెట్లు రూపొందించడం తదితరాలకు అడ్డుకట్ట పడుతుంది.
  • ఎన్‌ఏడీ పరిధిలోని డిజిటల్‌లాకర్ ద్వారా ఏరోజైనా, ఏ క్షణమైనా అందుబాటులో ఉంటుంది.
  • విద్యార్థుల క్రెడెన్షియల్స్ పరిశీలన


ఇక చాలా సులువు
ప్రస్తుతం విద్యార్థుల సర్టిఫికెట్లను ప్రింట్ చేసి ఇస్తున్నందున చాలా వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. డిజిలాకర్ విధానం వల్ల సర్టిఫికెట్లు డిజిటలైజ్ అయి ప్రింట్ అవసరం ఉండదు. విద్యార్థుల సర్టిఫికెట్లు అసలైనవో కాదో తెలుసుకోవడానికి ఆయా సంస్థలు వర్సిటీలకు, ఆయా విద్యాసంస్థలకు పంపి ఆ సమాచారం కోసం వేచి ఉండాల్సిన పనిలేదు.
- ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి

విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం
ఇది విద్యార్థులకు, అన్ని విద్యాసంస్థలకు వరం. సర్టిఫికెట్లకు ఇది ట్రెజర్ హౌస్‌లా మారుతుంది. విద్యార్థుల ధ్రువపత్రాలు ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వారు ఉన్నత కోర్సులు చేసినా ఆ సర్టిఫికెట్లు కూడా ఈ డిజిలాకర్‌కు అనుసంధానమవుతాయి. తద్వారా విద్యార్థి ప్రతిసారి తన అర్హతలకు సంబంధించిన వివరాలను పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు.
- ఏఆర్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి, ఏపీ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్

సర్టిఫికెట్ల భద్రతపై మాకు ఆందోళన ఉండదు
డిజిలాకర్ విధానం వల్ల సర్టిఫికెట్లు పోతాయనో, పాడవుతాయనో భయపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని విద్యార్థులు పొందే అవకాశమూ ఉంటుంది. ఏ సమయంలోనైనా డిజిలాకర్ కోడ్‌తో మా సర్టిఫికెట్లను మేము పరిశీలించుకోగలుగుతాం. ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ల సమర్పణ మరింత సులభం అవుతుంది. దొంగసర్టిఫికెట్ల బెడద తప్పుతుంది.
- రమ్యశ్రీ, బీకాం థర్డ్ ఇయర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మదనపల్లె

వ్యయప్రయాసలు తప్పుతాయి
డిజిలాకర్ నుంచి ఎప్పుడంటే అప్పుడు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఉండడం వల్ల ఆయా సంస్థలకు వెళ్లి రావడానికి వ్యయప్రయాసలు తప్పుతాయి. ప్రింట్ సర్టిఫికెట్లు పాడైనా, పోయినా వాటిని తిరిగి పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొన్నింటికి పోయినట్లు పోలీసు స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి వస్తోంది. డిజిలాకర్ వల్ల ఈ సమస్యలుండవు. పరిశీలన సులభతరమవుతుంది.
- ఎ.శివరాణి, బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని, మదనపల్లె

Published date : 10 Dec 2020 04:06PM

Photo Stories