Skip to main content

ఇక డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్: ఉన్నత విద్యామండలి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు రాబోతున్నాయి.
బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా విధి విధానాలను ఖరారు చేసేందుకు అధికారులు, పారిశ్రామిక వర్గాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కోర్సులపై చర్చించారు. రాష్ట్రంలోనూ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. వచ్చే వారం రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అమల్లోకి తేనున్నారు. ఇప్పటివరకు డిగ్రీలో మ్యాథ్స్, స్టాటస్టిక్స్‌తోపాటు కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్టులుగా చదివే అవకాశముంది. అయితే ఇకపై మ్యాథ్స్, స్టాటస్టిక్స్‌తోపాటు డేటా సైన్స్ ను చదువుకోవచ్చు. అలాగే బీకాంలో బిజినెస్ అనలిటిక్స్‌ను కూడా చదువుకునే వీలు కల్పించనుంది. వీటిల్లోనే ఆనర్స్ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రెగ్యులర్ డిగ్రీల కంటే ఆనర్స్ డిగ్రీల్లో 20 నుంచి 30 క్రెడిట్స్ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలని యోచిస్తోంది. ఇవి కాకుండా కాలేజీలు ముందుకొస్తే బీఎస్సీ మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ కోర్సులను ముందుగా సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, అటానమస్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించే, ఆయా కోర్సులను నిర్వహించగలిగే సత్తా కలిగిన టాప్ ప్రైవేటు కాలేజీల్లోనూ ఆయా కోర్సులను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఆయా సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకి ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయనుంది. సమావేశంలో కమిటీ సభ్యులు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ ఎస్.రామచంద్రం, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీ, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, టీసీఎస్, కాగ్నిజెంట్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
Published date : 18 Feb 2020 03:04PM

Photo Stories