ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అపార అవకాశాలు...: ఐటీ మంత్రి రవిశంకర్
Sakshi Education
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అనుకూల విధానాలతో ఎలక్ట్రానిక్స్ తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు.
భారత్‌కు ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏప్రిల్ 28న రాష్ట్రాల ఐటీ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. వర్క్ ఫ్రం హోమ్‌నకు సంబంధించిన నిబంధనలు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉన్నప్పటికీ జూలై 31 దాకా పొడిగిస్తున్నట్లు సమావేశం అనంతరం ఆయన విలేకరులకు తెలిపారు. ఆరోగ్య సేతు యాప్‌ను రాష్ట్రాలు కూడా ప్రశంసించాయని, ఫీచర్ ఫోన్స్ కోసం కూడా దీన్ని రూపొందిస్తున్నట్లు.. త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు వార్తల వ్యాప్తిని కట్టడి చేయడంలో కంపెనీలు విఫలమైతే కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఉత్తమ విధానాలపై ఐడియాలను కేంద్రం, రాష్ట్రాలు పంచుకునేందుకు త్వరలోనే యాప్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు.
Published date : 29 Apr 2020 06:12PM