Skip to main content

No Extra School Fees : ఇక‌పై ప్రైవేట్ స్కూల్స్‌లో ఇలాంటి ఫీజులు వసూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు... ఇంకా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని ప్రైవేట్‌ స్కూళ్ల దోపిడిపై విద్యాశాఖ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మకుండా నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
No Extra School Fees Rules

ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. ఇతరత్రా ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించాలని, ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. 

ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఫీజులు...
ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఫీజులు ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందినట్లు కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. క్రీడలు ఇత‌ర‌ ప్రత్యేక శిక్షణ కోసం కూడా అదనపు ఫీజులకు అనుమతించకూడదని తెలిపింది. స్కూళ్లను కేటగిరీలుగా విభజించి ఫీజులు కంట్రోల్ చేయాలని, పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అలాగే లైబ్రరీ, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, డిజిటల్‌ పరిజ్ఞానం, బోధనా సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలతో సహా మొత్తం నిర్వహణ ఖర్చును పరిగణనలోకి తీసుకుని ఫీజులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. 

కొంతకాలంగా ప్రైవేట్  స్కూల్స్ దోపిడిపై విద్యా కమిషన్‌ చర్చలు జరిపి నివేదికను తయారుచేసింది. దానిని ఇటీవ‌లే విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో... విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేశ్‌, జ్యోత్స్న విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు అందించారు. నివేదికను పరిశీలించిన విద్యాశాఖ కమిషన్ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 

స్కూళ్లలో అదనపు ఫీజులను వసూలు చేయకుండా... ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. పాఠశాలల పరిస్థితులను బట్టి ఫీజులను క్యాటగిరీలు విభజించాలని తెలిపింది. స్కూల్ సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. బుక్స్, యూనిఫాంల వంటివి పాఠశాలలు వ్యాపారం చేయనివ్వకుండా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని సూచించింది. అలాగే కమిటీకి చైర్మన్‌గా రిటైర్డ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని సభ్యులుగా నలుగురు నిపుణులను నియమించాలని చెప్పింది. 

జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఫీజులను ఖరారు చేసిన తర్వాత వాటి అమలులో ఫిర్యాదులుంటే చర్యలు తీసుకోవాలి. మూడేళ్లకోసారి ఫీజును ఖరారు చేయాలి. విద్యా కమిషన్‌ చేసిన సిఫార్సులపై ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోవాలి. ఈ సిఫార్సుల అమలుకు ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదంతో చట్టబద్ధత తప్పనిసరి కల్పించాలి. అప్పుడే ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటుకు అవకాశముంటుందని కమిషన్ అధికారులు వివరించారు.

Published date : 03 Feb 2025 02:40PM

Photo Stories