Skip to main content

నిబంధనలకు అనుగుణంగానే సివిల్స్‌ పరీక్షా ఫలితాలు

సాక్షి, న్యూఢిల్లీ : 2019 సివిల్‌ సర్వీసుల పరీక్షా ఫలితాలపై యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఆగ‌స్టు 6వ తేదీన‌ వివరణ ఇచ్చింది.
ఈ పరీక్షల్లో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, సివిల్‌ సర్వీసుల పరీక్షల నిబంధనలు-2019కు అనుగుణంగా రిజర్వ్‌ జాబితాను నిర్వహించామని యూపీఎస్‌సీ స్పష్టం చేసింది. సివిల్‌ సర్వీసుల పరీక్షల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయదలుచుకున్న ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్ధులను ఎంపిక చేశారని తప్పుదారి పట్టించే ప్రచారం తమ దృష్టికి వచ్చిందని యూపీఎస్‌సీ పేర్కొంది. సివిల్‌ సర్వీసుల పరీక్షల ద్వారా నియామకాల కోసం భారత ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షా నిబంధనలను కమిషన్‌ తూచాతప్పకుండా అనుసరించిందని తెలిపింది. సివిల్‌ సర్వీసుల పరీక్షల ద్వారా 927 ఖాళీల కోసం తొలి విడతగా 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, నిబంధనల ప్రకారం రిజర్వ్‌ జాబితాను నిర్వహిస్తున్నామని ఆ ప్రకటనలో యూపీఎస్‌సీ వెల్లడించింది. దశాబ్ధాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారని తెలిపింది. సాధారణ ప్రమాణాల్లో ఎంపికైన రిజర్వ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు వారికి ఉపయోగకరంగా ఉంటే వారి రిజర్వ్‌ స్టేటస్‌ ఆధారంగా సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.
Published date : 06 Aug 2020 07:53PM

Photo Stories