Skip to main content

ఒక నిమిషం.. 'రికార్డ్' ఈ బాలిక సొంతం

జీవనయానంలో ఎదురయ్యే ఆటుపోట్లకు భయపడకుండా బతుకు పడవ నడిపే ప్రయత్నం చేసే వారు ఓడిపోరు.. అని ప్రముఖ కవి సోహన్‌ లాల్‌ ద్వివేది రాసిన ఈ పంక్తి ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నాలకు ప్రేరణగా నిలుస్తుంది. సాధనతో విజయం సాధించిన అలాంటి అమ్మాయి 16 ఏళ్ల ఆది స్వరూప. ప్రైమరీ స్కూల్‌తోనే చదువు ఆపేసిన స్వరూప నిరంతర కృషి ద్వారా ఏక కాలంలో రెండు చేతులతో రాసి రికార్డులు సృష్టిస్తోంది.

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 16 ఏళ్ల స్వరూప రెండు చేతులతో నిమిషంలో 40 పదాలు రాసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ తన పేరు నమోదు చేసుకోవడానికి నిరంతరం సాధన చేస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌ బరేలీకి చెందిన 'లతా ఫౌండేషన్‌' సంస్థ స్వరూప ప్రతిభను ప్రత్యేక ప్రపంచ రికార్డుగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 15న తన పుట్టినరోజు సందర్భంగా ఈ రికార్డును బహుమతిగా పొందింది స్వరూప.

రెండేళ్లుగా సాధన..
స్వరూప తండ్రి గోపాల్‌ గోపాకర్‌. కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే కుటుంబం. ఆర్థికలేమి వల్ల స్వరూప స్కూల్‌ చదువు కొనసాగలేదు. ఈ సాధన కోసం ఏ స్కూల్‌కీ వెళ్ళలేదు. లాక్డౌన్‌ సమయంలో స్వయంగా ఈ 10 రచనా పద్ధతులను సాధన చేసింది. వీటిలో ఏకదిశాత్మక, వ్యతిరేక దిశ, కుడి చేతి వేగం, ఎడమ చేతి వేగం, రివర్స్‌ రన్నింగ్, మిర్రర్‌ ఇమేజ్, హెటెరోటోపిక్, హెటెరో భాషా, మార్పిడి, డ్యాన్స్, బ్లైండ్‌ .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ సాధించడానికి ఆమె తన కృషి ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

ఐఎఎస్‌ .. లక్ష్యం
ఐఎఎస్‌ ఆఫీసర్‌ కావడమే తన లక్ష్యం అని చెబుతున్న స్వరూప వచ్చే ఏడాది పదవతరగతి పరీక్ష రాయడానికి ప్రైవేట్‌ అభ్యర్థిగా చేరనున్నట్లు తెలిపింది. స్వరూప మాట్లాడుతూ, రెండు చేతులతో ఒకే నిమిషంలో 40 పదాలను ఒకేసారి రాసి రికార్డు సృష్టించాను. చాలా ప్రాక్టీస్‌ తరువాత, ఇప్పుడు నిమిషంలో 50 పదాలను రాయగలుగుతున్నాను. గిన్నిస్‌ రికార్డులో నా పేరు నమోదు అయ్యేవరకు సాధన చేస్తూనే ఉంటాను అని చెప్పింది. స్వరూప గతంలో రెండు చేతులతో ఒకేసారి ఒక నిమిషంలో 25 పదాలు రాసిన రికార్డు సొంతం చేసుకుంది.

Published date : 28 Sep 2020 05:41PM

Photo Stories