మన దేశంలోని విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఇదే..
తేనెటీగలాగ అమెరికాలో సంగ్రహించిన మకరందాన్ని మన దేశానికి తీసుకు రాగలిగిన ఆలోచనలను ఆశించారాయన. అలాంటి ఆలోచనకు ప్రతిరూపంగా నిలుస్తున్న యువతి హిమశ్రీ దేశాయ్.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హిమశ్రీ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. విప్రో, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు చేసి ఆ అనుభవం తో అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడ సియెటెల్ వంటి పెద్ద కంపెనీలో పని చేసిన తర్వాత కొంతకాలం ఫ్రీలాన్సర్‌గా పెద్ద కంపెనీలకు సర్వీస్ అందించారు. ఒక బిడ్డకు తల్లిగా అమెరికాలో పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారనే విషయాలను నిశితంగా గమనించారామె. ఇండియాలో పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు దాదాపుగా ప్రైవేట్ స్కూళ్లన్నీ కంప్యూటర్ క్లాసులు బోధిస్తున్నాయి. ఇక్కడ కంప్యూటర్ క్లాసు సిలబస్ చూసిన తర్వాత ''మనదేశానికి చేయాల్సింది చాలా ఉంది'' అని అర్థమైంది హిమశ్రీకి. స్కూల్లో ఉన్నంత కాలం ఎమ్‌ఎస్ ఆఫీస్, పెయింట్‌లతోనే కాలం వెళ్లబుచ్చిన పిల్లలు ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత పడే కష్టం చిన్నది కాదు.
మన దగ్గర చాలా కొద్ది స్కూళ్లలో తప్ప మెజారిటీ స్కూళ్లలో పాఠశాల స్థాయి కంప్యూటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పెద్దగా పురోగతి కనిపించలేదామెకు. అమెరికా, యూకే వంటి చోట్ల ప్రైమరీదశలోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుంటారు. వాళ్లు స్కూల్ ఫైనల్‌కు వచ్చేటప్పటికి సబ్జెక్టు మీద పట్టు వస్తుంది. ఇండియాలో పిల్లలు స్కూల్‌లో నేర్చుకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో బీటెక్‌లో చేరుతున్నారు. ఫస్టియర్‌లో ఏకంగా ప్రోగ్రామింగ్ చేయాల్సి రావడంతో చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏడాది పూర్తయ్యేలోపు గాడిలో పడతారు. ఎక్కువ మంది వెనుకపడతారు. ఆ వెనుకబాటుతనం కాలేజ్ ఇచ్చిన మార్కుల షీట్‌తో ఆగిపోదు. వాళ్లు అంతర్జాతీయ వేదిక మీద ఇతర దేశాల విద్యార్థులతో పోటీ పడి ఉద్యోగాల్లో పురోగతి సాధనలో కూడా ఆ వెనుకబాటు వాళ్లను వెంటాడుతూనే ఉంటోంది.
ఇలాంటి దుస్థితి రాకూడదంటే స్కూలు దశలోనే మంచి పునాది పడాలనుకున్నారు హిమశ్రీ. ఏదో ఒకటి చేయాలని మూడేళ్ల కిందట కుటుంబంతో సహా ఇండియాకు వచ్చేశారు. హిమశ్రీ అమెరికా నుంచి తిరిగి ఇండియాకి రాగానే 'కిట్ ఓ లిట్ డాట్ కామ్' అనే సంస్థను స్థాపించి హైదరాబాద్‌లో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను సంప్రదించారు. హిమశ్రీ తయారు చేసిన సిలబస్‌ను అనుసరించడానికి, విద్యార్థులకు కోడింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఓ ఎనిమిది స్కూళ్లు ఆసక్తి చూపించాయి. రెండవ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్, ఐఓటీ క్లాసులు పరిచయం చేశారామె.
కోడింగ్‌తోనే భవిష్యత్తు..
కోడింగ్‌కి భవిష్యత్తు ఉండడం కాదు... కోడింగ్‌తోనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు హిమశ్రీ. ఇంజనీరింగ్‌లో చేరుతున్న చాలామందిలో ఇంజనీరింగ్ చేయాలనే కల తప్ప, ఇంజనీరింగ్ సబ్జెక్టు మీద ఇష్టం ఉండడం లేదు. చేరిన తర్వాత అయిష్టంగా పూర్తి చేయడం, అన్యమనస్కంగా ఉద్యోగం చేయడం, జాబ్ సాటిస్‌ఫాక్షన్ లేదని ఆవేదన చెందడాన్ని చూశాను. పిల్లలు చిన్నప్పుడే కోడింగ్, ఐవోటీ నేర్చుకుంటే మెళకువలు పట్టుపడతాయి. ఒకవేళ ఇంకా అయిష్టం ఉంటే నా అభిరుచి ఇందులో లేదు అనే స్పష్టత అయినా తెలుస్తుంది. మరేదయినా రంగంలో అడుగుపెట్టవచ్చు. అయితే ఇప్పుడు మెడికల్, ఆర్కిటెక్చర్, మెకానికల్... అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కాబట్టి ఇతర రంగాల్లో కెరీర్ నిర్మించుకునే వాళ్లకు కూడా స్కూల్లో నేర్చుకున్న కోడింగ్, ఐవోటీలు ఉపయోగపడతాయి'' అన్నారు హిమశ్రీ.
ఈత నేర్పి కొలనులో దింపుదాం...
భవిష్యత్తంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య కంప్యూటర్స్‌లోనే. అక్కడి వెర్షన్స్ అన్నీ మన దగ్గర కంటే చాలా ముందుంటాయి. మనవాళ్లు తడబడుతున్నది అక్కడే. పిల్లలకు ఈత బాగా నేర్పిన తర్వాత కొలనులో కాదు సముద్రంలో దించినా ఈది ఒడ్డుకు చేరతారు. అందుకే ప్రక్షాళన ఇక్కడి స్కూళ్ల నుంచే మొదలవ్వాలనుకున్నాను. నేను మొదలు పెట్టిన తర్వాత ఏడాదికే మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం కూడా ఇదే పద్ధతిని ప్రవేశ పెట్టింది. అది తలుచుకుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. మొదట్లో స్కూళ్లకు వెళ్లి క్లాసులు ఇచ్చేవాళ్లం. కరోనా కారణంగా ఇప్పుడు కొంత విరామం వచ్చింది. ఆసక్తి ఉన్న వాళ్ల కోసం ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే... మేము ఆన్‌లైన్ కోడింగ్ క్లాసులు మొదలు పెట్టిన తర్వాత ఇండియన్స్ కంటే ఎక్కువగా అమెరికా, యూకే, సింగపూర్, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటూ ఉండడంతో ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుంచి మరో స్లాట్ మొదలు పెడుతున్నాను.