న్యూరోసర్జన్ అవుతా- ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష టాపర్ కామిరెడ్డి అనూష
గ్రామీణ ప్రాంత విద్యార్థులు వైద్యవిద్యలో రాణించడం అంత సులువేంకాదు. పోటీ తీవ్రంగా ఉండే జాతీయస్థాయి వైద్యప్రవేశ పరీక్షలో సీటు సాధించాలంటే .. కఠోర శ్రమ అవసరం. దాంతోపాటు కాన్సెప్ట్యువల్‌గా చదవాలి. చిన్నప్పటినుంచి వైద్యవృత్తిలో ప్రవేశించాలనేది నా కోరిక. భవిష్యత్తులో న్యూరాలజిస్ట్‌గా పేరు తెచ్చుకోవడమే ధ్యేయం అంటున్నారు కామిరెడ్డి అనూష. అత్యంత కష్టంగా భావించే ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఇద్దరు విద్యార్థుల్లో ఈమె ఒకరు. అనూషతో సాక్షి భవిత సక్సెస్ టాక్...
మాది వరంగల్ జిల్లా. టెన్త్‌వరకు అక్కడే చదివాను. ప్లస్‌టూ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. నాన్న ఈఎన్‌టీ స్పెషలిస్ట్. అమ్మ గైనకాలజిస్ట్. చిన్నప్పటి నుంచీ వీరి ప్రోత్సాహం ఉండేది. దీని వల్ల కఠినమైన పరీక్షల్లో కూడా ఇబ్బందిపడకుండా అనుకున్న విజయాలు సాధించగలిగాను.
లక్ష్యం సాధించా:
వైద్యవిద్యనందించడంలో ఎయిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ. ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎలాగైనా ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావడంతో మంచి మార్కులు వచ్చాయి. ఎయిమ్స్ ఈ ఏడాది నుంచి ఢిల్లీ క్యాంపస్‌కు అనుబంధంగా పాట్నా, భువనేశ్వర్, రుషికేష్, రాయపూర్‌లో కొత్త క్యాంపస్‌లు ప్రారంభిస్తోంది. వీటిలో ఏదో ఒక క్యాంపస్‌లో సీటు వచ్చే అవ కాశం ఉంది. ఎయిమ్స్‌లో సీటు సాధించాలనే లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉంది.
అందుకే మెడిసిన్:
వైద్యవిద్య ద్వారా పది మందికి ఉపయోగపడవచ్చు. ఇంట్లో అమ్మానాన్న కూడా వైద్యులే. దాంతో స్వతహాగానే నాక్కూడా ఆసక్తి ఏర్పడింది. ఇంట్లో ప్రోత్సాహంతో మెడిసిన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. పదో తరగతి తర్వాత సైన్స్ అంటే ఆసక్తి పెరిగింది. పైగా ఇందులో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. బయాలజీ ఇష్టమైన సబ్జెక్టు. ప్లస్‌టూ (మార్కులు 979) తర్వాత ఎంసెట్‌కు బాగా ప్రిపేర్ కావడంతో 23వ ర్యాంకు వచ్చింది.
పలు ప్రవేశ పరీక్షలు రాశా:
జాతీయస్థాయి మెడిసిన్ ప్రవేశ పరీక్షలు అంటే ఆసక్తి. వీటివల్ల పోటీ ప్రపంచంలో మనం ఎక్కడున్నామో, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఎంసెట్‌తోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే జిప్‌మర్, బీహెచ్‌యూ, ఎయి మ్స్ వంటి పరీక్షలు రాశాను. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఎయిమ్స్‌లో సీటు ఏ క్యాంపస్‌లో వస్తుంది? అనే దాన్నిబట్టి చేరాలా? వద్దా? నిర్ణయించుకుంటాను.
సీట్లు తక్కువ.. అందుకే బాగా కష్టపడ్డా:
ఎయిమ్స్‌లో మెడిసిన్ సీట్లు చాలా తక్కువ. అసాధారణంగా కష్టపడితేనేగాని సీటు లభించదు. అందుకే రోజుకు 6 నుంచి 8 గంటలకుపైగా చదివాను. ఎంసెట్ పూర్త య్యాక దృష్టంతా ఈ పరీక్షపైనే పెట్టాను. ప్రధానంగా పాత ప్రశ్నపత్రాలను ఫాలో అవడంతో పరీక్ష విధానంపై అవగాహన వచ్చింది. పైగా ఈ ఏడాది పరీక్ష పాత సిలబస్ ప్రకారం నిర్వహించడం కలిసి వచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌తో నీట్ ఉంటుంది. దాంతో ఈసారి ఎలాగైనా సీటు సాధించాలనుకుని ప్రిపేరయ్యా. సబ్జెక్టులను కాన్సెప్ట్యువల్‌గా ప్రిపేర్ కావడంతో రివిజన్ కొంచెం సులువైంది. ఫిజిక్స్ సబ్జెక్టుపై బాగా దృష్టిసారించా. జీకే చాలా కష్టంగా ఉండడంతో కొన్ని అటెంప్ట్ చేయలేకపోయా. నెగెటివ్ మార్కింగ్ ఉండడంతో తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు రాశాను. తెలియని ప్రశ్నలను వదిలేశా.
ఇలా ప్రిపేరైతే మేలు:
సైన్స్ సబ్జెక్టులను అర్థం చేసుకుని కాన్సెప్ట్యువల్‌గా చదివితే పట్టు దొరుకుతుంది. దీంతో ఎలాంటి ప్రవేశపరీక్షల్లోనైనా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎంసెట్, ఎయిమ్స్ ప్రవేశపరీక్షల్లో చాలా తేడా ఉంటుంది. ఎయిమ్స్ పరీక్షకు బాగా ప్రిపేరైతేనే సీటు ఆశించాలి. పైగా ఇక్కడ నెగటివ్ మార్కింగ్, సీట్లు తక్కువ, సిలబస్ పరిధి చాలా ఎక్కువ. కాబట్టి ఎంసెట్‌తో దీన్ని పోల్చలేం. కాకపొతే సబ్జెక్టును బట్టీ పట్టకుండా అర్థం చేసుకుని చదివితే విజయం ఎవరికైనా దక్కుతుంది.
పోటీ ఎక్కువగా ఉండే ఈ పరీక్షల్లో సబ్జెక్టు సందేహాలు ఏ చిన్నవి వచ్చినా వదలకుండా చదవాలి. ప్రతి విషయాన్ని బాగా విశ్లేషించుకోవాలి. ఎయిమ్స్‌లాంటి పరీక్షలకు పాత ప్రశ్నపత్రాలను ఫాలో అవడం చాలా ముఖ్యం. కానీ చాలామంది విద్యార్థులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అలాగే జీకే పార్ట్ కొంచెం కఠినంగానే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అవసరం లేదనుకుంటే స్కోరింగ్‌లో వెనుకబడిపోతారు.
న్యూరోసర్జన్ అవుతా:
న్యూరోసర్జన్ కోర్సు, సబ్జెక్టు అంటే ఆసక్తి ఉంది. ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ చేసి న్యూరోసర్జన్ కావాలనేదే నా కోరిక. ఎయిమ్స్, జిప్‌మర్‌లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకే పీజీ సీట్లలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. బయట విద్యార్థులకు అవకాశాలు తక్కువ. అయినాసరే జిప్‌మర్ పాండిచ్చేరి, లేదా చంఢీగఢ్‌లో పీజీ చేస్తా.