ఆశయం మెడిసిన్...ఆదుకునే దాతలెవ్వరూ?- ఎ.రాహుల్, ఇంటర్మీడియెట్ బైపీసీలో స్టేట్ టాపర్
రాహుల్.. ఇంటర్మీడియెట్ బైపీసీలో స్టేట్ టాపర్. అలాగని.. కాసులు కుమ్మరించి కార్పొరేట్ కళాశాలల్లో చదవలేదు. కటిక పేదరికాన్ని జయించి కేవలం స్వీయ ప్రతిభతో ప్రకాశించాడు. ఇప్పటికీ ఆ పేదరికం వెంటాడుతూనే ఉంది. త్వరలో ప్రకటించనున్న ఎంసెట్ ఫలితాల్లో మెడిసిన్‌లో ర్యాంకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. దానికి ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు ఆదుకుంటే మెడిసిన్ పూర్తిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానంటున్న రాహుల్ సక్సెస్ సీక్రెట్స్ తన మాటల్లోనే...
అడుగడుగునా ఇబ్బందులే:
మాది కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపూర్. నాన్న వ్యవసాయకూలీ. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాను. వాస్తవానికి పదోతరగతిలో రూ.10 వేల ఫీజు కట్టడానికి సైతం ఆర్థిక స్థోమతలేని కుటుంబం. ఏం చేయాలి? చదవాలా? మానేయాలా? అని ఆలోచిస్తుంటే అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులు పడి ఫీజు కట్టారు. శ్రమనే శ్వాసగా చేసుకుని పదోతరగతిలో 551 మార్కులు తెచ్చుకున్నా.
ఇంగ్లిష్ మీడియంతోనే భవిష్యత్తు.. కానీ?
తెలుగు మీడియంలో చదివితే డాక్టర్ కావాలనే కల నెరవేరదు. ఇంగ్లిష్ మీడియంలో చదవాలంటే స్థోమత సరిపోదు. మళ్లీ.. ఏం చేయాలి అనే సందిగ్ధంలో ఉండిపోయా. అదృష్టం కొద్దీ పదోతరగతి మార్కుల ఆధారంగా ఓ ప్రైవేటు కాలేజీ ఇంటర్‌లో సగం రాయితీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. మిగతా సగం? తిరిగి అవే కష్టాలు.. అమ్మానాన్న మళ్లీ కష్టపడి ఫీజులు కట్టారు. ఇంటర్ బైపీసీలో 989 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించా.
ఇకపై.. ఎంబీబీఎస్.. ఎలా?
ఇప్పటిదాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతిభతో దూసుకెళ్తున్న నా లక్ష్యం ఎంబీబీఎస్ పూర్తిచేసి పదిమందికి సాయం చేయడం. కానీ ఎలా? మెడిసిన్ విద్య ఖరీదైన కోర్సు. ఇకపై తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా. అందు కే.. పేద విద్యార్థులను ఇంటర్నెట్‌ద్వారా ఆదుకునే ‘‘బ్రిలియంట్ బ్రెయిన్స్ డాట్ ఓఆర్‌జీ’’ అనే వెబ్ సైట్‌ను ఆశ్రయించి అందులో రిజిస్టర్ చేసుకున్నా.
పేద విద్యార్థులకు పాఠాలెన్నో:
పేదరికం వెక్కిరిస్తున్నా చదువును నిర్లక్ష్యం చేయకూడదు. చదువుకుంటేనే ఎవరికైనా విలువ. తల్లిదండ్రులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటారు. వాటిని నిజం చేయాల్సిన బాధ్యత పిల్లలదే. కష్టపడి చదివితే పేదరికం పారిపోతుంది. నా వరకు నేను మెడిసిన్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌నవుతా.
ఎక్కువ మార్కులకు తారక మంత్రం ఒక్కటే:
పాఠం ఎంత కష్టంగా ఉన్నా అర్థం చేసుకుని చదవాలి. అప్పుడే మంచి మార్కులు సాధించగలం. కష్టమైన పాఠాలను వదిలేస్తే తప్పు చేసినట్లే. అర్థం కాకపోతే పాఠాన్ని వదిలేయకుండా టీచర్ల సలహాలు తీసుకోవాలి. మిగతా వాళ్లతో పోల్చుకోవద్దు. ఎవరి సామర్థ్యాలు వారివి.