Skip to main content

యూనివర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేయాలి

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు ఉత్కృష్ట ప్రమాణాలకు నిలయాలుగా ఉండాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో మరింతగా అభివృద్ధి చేసి నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విశ్వవిద్యాలయాలు బోధన కేంద్రాలుగా మాత్రమే మిగలకుండా, పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయాలుగా ఎదగాలని స్పష్టం చేశారు. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌లో భారత్‌ 49వ స్థానంలో ఉందని, అయితే టాప్‌ 20లో దేశాన్ని నిలపాలంటే యూనివర్సిటీలు కూడా పరిశోధనలు, ఆవిష్కరణల్లో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 14 విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో గవర్నర్‌ బుధవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో అకడమిక్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్‌ చేయడం, యూత్‌ రెడ్‌ క్రాస్, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు మరింత విస్తరించడం, గ్రామాల దత్తత లాంటి అంశాలను ప్రోత్సహిం చాలని సూచించారు. సకాలంలో క్లాసులు, పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వర్సిటీలపై ఉందన్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు పొందలేకపోతున్న అణగారిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ నిర్వహించాలి..
విద్యా సంస్థల్లో తరగతి గది బోధనకు హాజరుకావడానికి వీలుగా తమకు టీకా ఇవ్వాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తులకు గవర్నర్‌ తమిళిసై మద్దతు తెలిపారు. వర్సిటీలు, కళాశాలల విద్యార్థులతో బుధవారం ఆమె ట్విట్టర్‌లో ‘ఆస్క్‌ ది చాన్స్‌లర్‌’కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రత్యక్ష బోధనకు అనుమతించే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తరగతి గది బోధనతోపాటు పరీక్షలకు హాజరుకావడానికి విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. సకాలంలో పరీక్షలు నిర్వహించి తదుపరి సెమిస్టర్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరారు. కాళోజీ హెల్త్‌ వర్సిటీకి చెందిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సత్వరంగా పరీక్షలు నిర్వహించాలని, ఇప్పటికే తాము ఐదు నెలలు వెనకబడ్డామని విన్నవించారు. ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు.
Published date : 10 Jun 2021 05:26PM

Photo Stories