వర్క్ ఫ్రం హోమ్ మాకూ ఇవ్వరా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కొందరు కరోనా బారినపడటంతో మిగిలిన వారు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యేందుకు తటపటాయిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు సెకండ్ వేవ్లో కరోనా బారినపడ్డారని, దాదాపు 100 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని, కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్కేఆర్ భవన్లోని కొన్ని శాఖల కార్యదర్శుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అనధికారిక వెసులుబాటు చేసుకున్నారు. 50 మంది ఉద్యోగులు ఒకరోజు విధులకు వస్తే మర్నాడు మరో 50 మంది వస్తున్నారు. వారికి సెలవుల విషయంలో సడలింపులివ్వాలి ప్రభుత్వోద్యోగుల్లో చాలా మంది పని ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దీనికితోడు కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో చాలా మంది మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులున్న ఉద్యోగులకు సెలవుల విషయంలో సడలింపులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సేవల శాఖలు, విభాగాలను మినహాయించి ఇతర శాఖల్లో 50 శాతం మంది ఉద్యోగులకు రోజు విడిచి రోజు ఇంటి నుంచి పనిచేసే సదుపాయం కల్పించాలని, మిగిలిన 50 శాతం మందితోనే ఆయా శాఖల కార్యాలయాలు పనిచేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగులకు ఆయా కార్యాలయాల్లోని డిస్పెన్సరీల ఆధ్వర్యంలో తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు.
Published date : 28 Apr 2021 03:07PM