Skip to main content

విపత్కర పరిస్థితుల్లోనూ అచంచల ఆత్మవిశ్వాసంతో భారతీయులు: లింక్‌డ్‌ఇన్ సర్వే

సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లోనూ తొణక్కుండా, బెణక్కుండా ఉండటంలో మనవాళ్ల ఆత్మవిశ్వాసం గట్టిగానే ఉంటుందని మరోసారి వెల్లడైంది.
దేశంలో కోవిడ్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూ, వివిధ ముఖ్యమైన రంగాల్లో అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత సందర్భంలోనూ మనోళ్లలో ధీమా వ్యక్తమవుతోందట. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లోనూ రాబోయే కాలం బాగా ఉంటుందనే ఆశావహ దృక్పథమూ కనిపిస్తోందట. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ అంశాలపై నిర్వహించిన అధ్యయనంలో భారతీయుల ఆత్మవిశ్వాసం, ధీమా మరింత పెరుగుతున్నట్టు తేలింది. వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్ ద్వారా ఉద్యోగ సంబంధిత ఆన్‌లైన్ సర్వీసులను నిర్వహించే ‘లింక్‌డ్‌ఇన్’అమెరికా వ్యాపార సంస్థ.. ‘వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’పేరుతో నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ఆదాయం, పొదుపు, ఉద్యోగాలపై పడే ప్రభావం తదితర అంశాలపై భారత్‌లోని వివిధ రంగాలు, వర్గాల ఉద్యోగులు, వృత్తినిపుణుల నుంచి సమాధానాలు రాబట్టారు.

పొదుపు పెరుగుతుంది..: వృత్తి నిపుణుల్లో మూడింట రెండొంతుల మంది వచ్చే ఆరునెలల్లో తమ వ్యక్తిగత పొదుపు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆరు నెలల్లోనూ వివిధ అవస్చరాల కోసం తాము చేయబోయే ఖర్చులు కూడా ఇప్పటిలాగే ఉండొచ్చునని ఐదింట రెండొంతుల మంది అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో భాగంగా విధించిన ఆంక్షలను దశలవారీగా ఎత్తేస్తుండడంతో చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆత్మవిశ్వాసం కూడా క్రమంగా పెరుగుతున్నట్టు తేలింది. దీంతోపాటు జూన్‌తో పోలిస్తే జూలైలో ఆర్థికవనరుల నిర్వహణకు సంబం ధించిన ఆత్మవిశ్వాసం వీరిలో మరింతగా పెరిగినట్టు వెల్లడైంది. తమ ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక నిల్వలు తదితర అంశాలపై అధిక ఆత్మస్థైర్యాన్ని చూపిన పలువురు వృత్తి నిపుణులు.. తమ ఉద్యోగ భద్రత విషయంలో మాత్రం అదేస్థాయిలో ఆత్మవిశ్వాసం కనబరచలేకపోయారని ఈ సర్వే వెల్లడించింది. పెద్ద కంపెనీలు, సంస్ధల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే.. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వృత్తి నిపు ణులు తమ ఉద్యోగాలు నిలబెట్టుకునే విష యంలో అంత నమ్మకంగా లేరు. ముఖ్యంగా పదివేల మందికి పైగా పనిచేస్తున్న సంస్థల్లోని ఉద్యోగుల్లో ఇలాంటి అభద్రతా భావం వ్యక్త మైంది. వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, బయట ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాల నేపథ్యంలో 65% మంది సాఫ్ట్‌వేర్, ఐటీ ఉద్యోగులు, 61% మంది ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్, మీడియా, కమ్యూనికేషన్ రంగాలకు చెందిన ఉద్యోగులు తిరిగి తమ కార్యస్థానాలకు వెళ్లేందుకు జంకుతున్నట్టుగా ఈ సర్వేలో వెల్లడైంది.
Published date : 20 Aug 2020 02:29PM

Photo Stories