Skip to main content

విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏపీ వాదనను వినాలి: సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు రాష్ట్రానికి సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది.
ధర్మాధికారి కమిటీకి మరోసారి తన వాదనను విన్పించే అవకాశాన్నిచ్చింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏపీ వాదనను వినాలని జనవరి 24 (శుక్రవారం)న సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది. తాజా పరిణామాలపై ఏపీ విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ.. న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రిలీవ్ చేసి, ఏపీ విద్యుత్ సంస్థలు తీసుకోని ఉద్యోగులకు ఊరట లభించిందని భావిస్తున్నారు. తమ పోరాటం ఫలించిందని ట్రాన్స్ కో జేఎండీ చక్రధర్‌బాబు అన్నారు.

ఆదినుంచీ వివాదమే : విభజన అనంతరం విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యగా మారింది. తెలంగాణ స్థానికత లేని ప్రతీ వ్యక్తీ ఏపీకి వెళ్ళాలని తెలంగాణ వాదించింది. విభజన చేయాల్సిన మొత్తం ఉద్యోగుల్లో 3,500 మంది ఏపీకి, 2,600 మంది తెలంగాణకు కేటాయించాలన్నది ఏపీ ప్రతిపాదన. దీనికోసం కేంద్రం షీలా బిడే కమిటీని ఏర్పాటు చేసింది. వివాదం కొనసాగుతుండగానే ఏపీ స్థానికత గల 1,157 మంది ఉద్యోగులను తెలంగాణ సంస్థలు రిలీవ్ చేశాయి. దీన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఏపీ ఉద్యోగులకు సానుకూలంగా తీర్పు ఇచ్చినా... వివాదం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టుకు ధర్మాధికారి ఇచ్చిన నివేదిక వివాదాస్పదమైంది. మొత్తం 6,100 ఉద్యోగుల విషయాన్ని పట్టించుకోని ఆయన... తెలంగాణ రిలీవ్ చేసిన 1,157 మందిలో 613 మందిని ఏపీకి, 502 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏ ఆప్షన్లు పెట్టుకోని మరో 42 మందిని కూడా ఏపీకే కేటాయించారు. తెలంగాణకు వెళ్ళేందుకు ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లనూ ఆయన పరిశీలించలేదని ఏపీ ఆక్షేపించింది. దీనివల్ల ఏపీ విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం పడుతుందని, ఇది ఏకపక్ష నిర్ణయమని ఏపీ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
Published date : 25 Jan 2020 02:33PM

Photo Stories