Skip to main content

విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేక సిగ్నల్స్‌ అందక.. పాఠాల్లేవ్‌..

కరోనా దెబ్బతో పాఠశాలలు మూసి ఉంచడం, ఆన్లైన్ పాఠాలే దిక్కు అవడం పిల్లల చదువులకు శరాఘా తంగా మారింది.
సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు లేక, అవి ఉన్నా సిగ్నళ్లు సరిగా అందక, డేటా చార్జీలను భరించలేక, అన్నీ ఉన్నా ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంగాక.. పిల్లలు చదువులు వదిలి పనుల బాట పడుతున్నారు. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులతో మాట్లాడి పలు అంశాలపై సర్వే చేసింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఇబ్బందులను గుర్తించింది. ఆన్‌లైన్‌ పాఠాలు, బోధన తీరుపై దాదాపు అందరిలోనూ అసంతృప్తి కనిపించింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు రాయటం, చదవటం సమస్యగా మారిందని.. వారి మానసిక స్థితి ఇబ్బందికరంగా తయారవుతోందని ఆందో ళన వ్యక్తమైంది. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థమయ్యే పరిస్థితి లేదని.. పలు కఠిన నిబంధనలు పెట్టి అయినా పాఠశాలలను తెరవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడటం గమనార్హం.

చ‌ద‌వండి: ఆగస్టు 23, 24 తేదీల్లో లాసెట్, పీజీఎల్సెట్– 2021 పరీక్షలు

చ‌ద‌వండి: తెలంగాణ పాలిసెట్– 2021 ఆప్షన్ల ఎంపికకు నేడే ఆఖరు తేదీ

ఆర్థిక ఇబ్బందులతో..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు ఓ మోస్తరుగా బాగానే జరుగుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద కుటుంబాలు కావడంతో స్మార్ట్‌ఫోన్లు కొనలేకపోవడం, కొన్నా డేటా కోసం అదనపు ఖర్చు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నచోట ఒకే ఫోన్‌ ఉండటంతో వారు మాత్రమే పాఠాలు వినడం వంటివి జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను వ్యవసాయం, ఇతర పనులకు తీసుకెళ్తు న్నారు. ఆన్‌లైన్‌ పాఠాలు సరిగా అర్థం కావడంలేదని పిల్లలు చెప్తుండటం, ఇంట్లోనే ఉంటుండటం కూడా దీనికి కారణమవుతోంది. వ్యవసాయ సీజన్‌ కావడంతో కూలీల కొరత నెలకొంది. రేట్లు పెరిగాయి. దీనివల్ల కూడా పిల్లలు ఆన్‌లైన్‌ పాఠాలను పక్కనపెట్టి.. కూలిపనులకు వెళ్లడం పెరిగింది.

అందని సిగ్నళ్లు.. కరెంటు కోతలు
పట్టణప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు బాగానే ఉన్నా.. జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు సరిగా అందడం లేదు. కాసింత సిగ్నల్‌ వచ్చినా అది ఆన్‌లైన్‌ పాఠాలకు సరిపడేంతగా డేటా స్పీడ్‌ రావడం లేదు. పొలాల్లో మంచెలు, చెట్లు ఎక్కి పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామాల్లో కూడా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగా ఉండటం లేదు. అక్కడక్కడా కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి. దీంతో పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులు వినలేకపోతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక తల్లిదండ్రులతో పనులకు వెళ్తున్నారు.

ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంగాక..
చాలా మంది విద్యార్థులు తమకు ఆన్‌లైన్‌ పాఠాలు సరిగా అర్థంకావడం లేదని వాపోతున్నారు. సిగ్నల్‌ సరిగాలేక తరచూ ఆగిపోతుండటం, ఉపాధ్యాయుల గొంతు సరిగా వినిపించకపోతుండటం వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. దానికితోడు తమ వద్ద ఉన్న ఫోన్లలో ధ్వని సరిగా రావడం లేదని కొందరు చెప్తున్నారు. ఏదైనా సందేహం వస్తే.. అడిగి తెలుసుకునే అవకాశం లేక పాఠం అర్థంకావడం లేదని వాపోతున్నారు.

ఫోన్లలో గేమ్స్‌ ఆడుతున్నారని..
ఆన్‌లైన్‌ పాఠాల కోసమని తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌ అప్ప గిస్తే.. పలుచోట్ల పిల్లలు గేమ్స్‌ ఆడుతూ, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. పిల్లలను ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఇంట్లో వదిలి తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అంతేగాకుండా పిల్లలు క్లాసులను పక్కనపెట్టేసి ఆటలు ఆడటానికి వెళ్తున్నారని కొందరు తల్లిదండ్రులు చెప్పారు. అందుకని ఇంట్లో వదలకుండా వ్యవసాయం, ఇతర పనుల కోసం తమ వెంట తీసుకెళ్తున్నామని తెలిపారు.

సరైన పర్యవేక్షణ, అవగాహన ఏదీ..
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఆన్‌లైన్‌ తరగతులతోపాటు టీవీల్లో డిజిటల్‌ పాఠాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫోన్‌, టీవీ సదుపాయం లేనివారికి సమీపంలోని తోటి విద్యార్థుల ఇళ్లలోగానీ, గ్రామ పంచాయతీల్లోని టీవీల్లో గానీ తరగతులు వీక్షించేలా ఏర్పాట్లు చేయా లని విద్యా శాఖ గతంలోనే ఆదేశించింది. కానీ ఈ విషయంగా సరైన పర్యవేక్షణ జరగక.. చాలా మంది విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు. ఎక్కడిక్కడ 70–80 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌/డిజిటల్‌ తరగతులకు హాజరవుతున్నట్టు అధికారులు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

పాఠాలు వింటున్నది సగమే!
ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలపై ‘సాక్షి’నిర్వహించిన సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. పాఠశాలల్లో తోటివారితో కలిసి చదువుకునే విద్యార్థులు.. ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నారని, ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, క్రమశిక్షణ లేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వెల్లడించారు. విద్యార్థులకు ఫోన్‌ వ్యసనంగా మారుతోందని, గేమ్స్‌ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో పాఠాలు వినడం లేదని.. విన్నా సరిగా అర్థం కావడం లేదని దాదాపు సగం మంది విద్యార్థులు తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు బాగోలేవని విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు టీచర్లు కూడా అభిప్రాయపడ్డారు. తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్‌ అందుబాటులో లేవని, అప్పులు చేసి కొన్నామని కొందరు తల్లిదండ్రులు తెలిపారు.

ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంగాక..
నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం అనంతగిరికి చెందిన ఈ విద్యార్థి పేరు నరేశ్‌. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంకావడం లేదని ఆవేదన చెందుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అన్నయ్యకు తోడుగా గొర్రెలు మేపేందుకు పంపుతున్నారు.

తండ్రికి కూలీ భారం తగ్గించాలని..
ఈ ఫోటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు పీరబోయిన గణేశ్‌. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లింగాలకు చెందిన గణేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కూలీ రెట్లు పెరిగిపోయి తల్లిదండ్రులు వ్యవసాయంలో ఇబ్బంది పడుతుండటంతో.. క్లాసులకు హాజరుకాకుండా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు.


స్మార్ట్‌ఫోన్‌ లేక..
పశువులు కాస్తున్న ఈ చిన్నారి పేరు గణేశ్‌. మెదక్‌ మండలం మక్తభూపతిపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తండ్రి శ్రీశైలం వద్ద ఒక్కటే ఫోన్‌ ఉంది. ఆయన బయటికి వెళ్తే.. గణేశ్‌ పాఠాలు వినే పరిస్థితి లేదు. దాంతోపశువులు మేపేందుకు వెళ్తున్నాడు.

పాఠాలు సరిగా వినట్లేదని..
ఈ ఫొటోలోని బాలుడి పేరు వినయ్‌ కుమార్‌. సూర్యాపేట జిల్లాలోని కుంటపల్లికి చెందిన ఈ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ క్లాసులు అర్థంకావడం లేదంటూ పాఠాలు వినడం లేదు. ఇంట్లోంచి బయటికెళ్లి ఆటలాడుతున్నాడని, ఏదైనా ప్రమాదానికి గురవుతాడోనని ఆందోళన చెందిన తండ్రి మల్లయ్య.. వినయ్‌ను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నాడు.

స్మార్ట్‌ఫోన్‌ కోసం.. (SEKHAR)
ఈ ఫొటోలో వరినారు తీస్తున్న విద్యార్థి పేరు శేఖర్‌. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సాకు చెందిన శేఖర్‌.. ఆసిఫాబాద్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. స్మార్ట్‌ఫోన్‌ లేక ఆన్‌లైన్‌ పాఠాలు వినడం లేదు. ఫోన్‌ కొనుక్కునేందుకు డబ్బుల కోసం కూలిపనులకు వెళ్తున్నట్టు తెలిపాడు.

వారానికి రెండు క్లాసులైనా..
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు వారానికి రెండు క్లాసులైనా తీసుకుంటే మంచిది. దూరదూరంగా కూర్చోబెట్టి బోధన చేయొచ్చు. మిగతా రోజుల్లో వర్క్‌ïÙట్ల ద్వారా పాఠాలపై అవగాహన కల్పించవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ఏకబిగిన పాఠాలు బోధించడం వల్ల కంఠశోష తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
– జి.నాగభూషణం, ప్రధానోపాధ్యాయుడు, మన్నెంపల్లి, కరీంనగర్‌ జిల్లా
Published date : 13 Aug 2021 02:53PM

Photo Stories