Skip to main content

విద్యార్థుల భవితకు...‘యూజీసీ’కి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులివే...

సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు భవిష్యత్తులో ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాల్సిందేనని యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
25 శాతం విద్యను ఆన్‌లైన్‌లో బోధించేలా, 75 శాతం విద్యను ప్రత్యక్ష బోధన ద్వారా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్ అమలు, వచ్చే విద్యా సంవత్సరం పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హర్యానా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్‌సీ కుహద్ నేతృత్వంలో ఏప్రిల్ 6న యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవల తమ నివేదికను అందజేసింది. అందులో పలు అంశాలను సిఫారసు చేసింది. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆన్‌లైన్ విద్య, ఈ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. ఇందుకోసం అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించింది. ప్రతి విద్యాసంస్థ వర్చువల్ క్లాస్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ విధానంలో బోధన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. యూనివర్సిటీలు ఈ-కంటెంట్, ఈ-ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించింది. యూనివర్సిటీలు టీచర్-విద్యార్థికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సదుపాయాన్ని తమ వెబ్‌సైట్ ద్వారా కల్పించాలని స్పష్టం చేసింది. వర్సిటీలు తమ పరిస్థితులను బట్టి ఈ నిబంధనలను అమలు చేయవచ్చని, మార్పులు చేసి అమలు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని, తక్కువ సమయంలో పరీక్షలను పూర్తి చేయాలని సూచనలు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు తరగతులను (కొత్త విద్యా సంవత్సరం) ప్రారంభించాలని, పాతవారికి ఆగస్టు 1 నుంచి తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. వీటన్నింటిపై యూజీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

నిపుణుల కమిటీ నివేదికలోని మరికొన్ని ప్రధానాంశాలు..
  • యూనివర్సిటీల్లో ఇప్పుడున్న వారంలో ఐదు రోజుల పనిదినాలు కాకుండా 6 రోజుల పనిదినాలను అమలు చేయాలి. ఈ విద్యా సంవత్సరంలో, 2020-21 విద్యా సంవత్సరంలోనూ దీనిని కొనసాగించాలి. వీలైనంత వరకు ఆన్‌లైన్‌లో బోధన చేపట్టాలి.
  • లాక్‌డౌన్ సమయాన్ని విద్యార్థులు కాలేజీలకు హాజరైనట్లుగానే పరిగణనలోకి తీసుకోవాలి.
  • ప్రస్తుత సమయంలో లాక్‌డౌన్ తర్వాత కొన్నాళ్ల పాటు భౌతికదూరం పాటించాల్సి ఉంటుంది.
  • తక్కువ సమయంలో పరీక్షలను పూర్తి చేసేలా, సులభంగా పరీక్షలను నిర్వహించే చర్యలు చేపట్టాలి. ఇందుకోసం మల్టిఫుల్ చాయిస్ క్వశ్చన్స్ తో (ఆబ్జెక్టివ్ విధానం) ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించాలి. డిస్క్రిప్టివ్ విధానం అవసరం లేదు. ఓపెన్ బుక్ పరీక్షలు, ఓపెన్ చాయిస్ అసైన్‌మెంట్ విధానాలు అమలు చేయాలి.
  • చాలా యూనివర్సిటీలు 100 మార్కుల్లో 30 మార్కులు ఇంటర్నల్స్, 70 మార్కులు ఎక్స్‌టర్నల్ పరీక్షల విధానం అమలు చేస్తున్నాయి. తమ నిబంధనల మేరకు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి.
  • అవసరమైతే యూనివర్సిటీలు కొత్త విధానాలు అమలు చేయొచ్చు. 3 గంటల పరీక్ష సమయాన్ని 2 గంటలకు కుదించవచ్చు. పరీక్షల నిర్వహణలో షిప్ట్‌ల పద్ధతి అవలభించవచ్చు.
  • అవకాశముంటే ఇంటర్నల్స్ ఆధారంగా 50 శాతం మార్కులు ఇచ్చి, మరో 50 శాతం మార్కులను గతంలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వవచ్చు. లేదా ఫైనల్ పరీక్షల్లో 50 శాతం మార్కులను అసైన్స్ మెంట్స్, ప్రాజెక్టు వర్క్, టర్మ్ పేపరు, మినీ రివ్యూ, ఓపెన్ బుక్ పరీక్షల విధానంలో ఇవ్వొచ్చు. అయితే దీనిని ప్రథమ సంవత్సర విద్యార్థులకు అమలు చేయవచ్చు.
  • లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వీలైనంత త్వరగా డిగ్రీ, పీజీ పరీక్షలను పూర్తి చేయాలి. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతి (తర్వాతి సెమిస్టర్)కి ప్రమోట్ చేయాలి. విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోయినా, ఫెయిలైనా ఇది అమలు చేయాలి. తర్వాత పరీక్షల్లో వచ్చే మార్కులను వేయాలి.
  • పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు వారం రోజుల ముందు తెలియజేయాలి.
  • విద్యార్థులు చేయాల్సిన ప్రాజెక్టులను ల్యాబ్‌లు, ఫీల్డ్‌లో కాకుండా వీలైతే ఆన్‌లైన్ విధానంలో/సమీక్ష విధానంలో చేసేలా చర్యలు చేపట్టాలి.
  • ప్రాక్టికల్ పరీక్షలను, వైవా వంటికి స్కైప్ వంటి యాప్‌ల సహకారంతో చేపట్టాలి.
  • డిగ్రీ, పీజీ కోర్సులకు జాతీయ/రాష్ట్ర స్థాయిలో కామన్ అడ్మిషన్ టెస్టును నిర్వహించాలి.
  • ఎం.ఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులు తమ థీసిస్ సబ్మిట్ చేసేందకు 6 నెలల సమయం ఇవ్వాలి. వైవా పరీక్షలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలి.
  • ల్యాబొరేటరీ అసైన్స్ మెంట్స్, ప్రాక్టికల్ పరీక్షలను వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ రీసోర్సెస్ ద్వారా నిర్వహించాలి. సైన్స్, ఇంజనీరింగ్ వారికి ఇవి ఉపయోగంగా ఉంటుంది.

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్...
15-5-2020 వరకు:
ఈ-లెర్నింగ్ ద్వారా మిగిలిపోయిన పాఠ్యాంశాల బోధన
16-5-2020 నుంచి 31-5-2020 వరకు: ప్రాజెక్టు వర్క్, ఇంటర్న్‌షిప్, ఈ-ల్యాబ్స్, సిలబస్ పూర్తి, ఇంటర్నల్ అసేస్‌మెంట్, అసైన్‌మెంట్స్, స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ అన్నింటిని ఆన్‌లైన్ ద్వారానే పూర్తి చేయాలి.
1-6-2020 నుంచి 30-6-2020 వరకు: వేసవి సెలవులు
1-7-2020 నుంచి 15-7-2020 వరకు: ప్రారంభ సెమిస్టర్/ఇయర్ పరీక్షలు
16-7-2020 నుంచి 31-7-2020 వరకు : రెండో సెమిస్టర్/ఇయర్ పరీక్షలు
31-7-2020 వరకు: ప్రారంభ సెమిస్టర్/ఇయర్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడి
14-8-2020 వరకు: రెండో సెమిస్టర్/పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడి

2020-21 విద్యా సంవత్సరంలో...
  • వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ నాటికి డిగ్రీ, పీజీ ప్రవేశాలను పూర్తి చేయాలి. ముందుగా ప్రొవిజనల్ అడ్మిషన్ ఇచ్చేయాలి. డాక్యుమెంట్లు, సరిఫ్టికెట్లు అందజేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడవును ఇవ్వాలి.
  • పాత విద్యార్థులకు (ద్వితీయ, తృతీయ సంవత్సరాల వారికి) విద్యా బోధన కార్యక్రమాలను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించాలి.
  • ప్రథమ సంవత్సరంలో ఫస్ట్ సెమిస్టర్‌లో చేరే వారికి మాత్రం విద్యా బోధన కార్యక్రమాలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలి.

1-1-2021 నుంచి 25-1-2021 వరకు: పరీక్షల నిర్వహణ
27-1-2021 నుంచి: తదుపరి సెమిస్టర్ ప్రారంభం
25-5-2021 నాటికి: తరగతులు పూర్తి
25-6-2021 నాటికి: సెమిస్టర్ పరీక్షలు పూర్తి
1-7-2021 నుంచి 30-7-2021 వరకు: వేసవి సెలవులు
2-8-2021 నుంచి : తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభం
Published date : 29 Apr 2020 05:38PM

Photo Stories