Skip to main content

విద్యారణ్య స్కూల్లో నేటి నుంచి లిటరరీ ఫెస్ట్

సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ భాష , సాహిత్య, సాంస్కృతిక సమాహారం హైదరాబాద్ సాహిత్యుత్సవం దశాబ్ది వేడుకలు విద్యారణ్య స్కూల్‌లో ప్రారంభంకానున్నాయి.
వివిధ దేశాలకు చెందిన కవులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్న ఈ వేడుకలు శుక్రవారం నుంచి ఆదివారం (ఈనెల 24నుంచి 26) వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన వ్యక్తులు, సంస్థలు ఈ వేడుకల్లో పాల్గొంటాయి. ఈ ఏడాది అతిథి దేశంగా ఆస్ట్రేలియాను ఆహ్వానించారు.ఆ దేశానికి చెందిన జర్నలిస్టులు, రచయితలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సూజన్ గ్రేస్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే ఈ సారి మలయాళ భాషా సాహిత్య, సాంస్కృతిక అంశాలపైన ప్రత్యేకమైన చర్చలు నిర్వహిస్తారు. దీనిపై ప్రముఖ దర్శకులు ఆదూర్‌గోపాల్ కృష్ణ కీలకోపన్యాసం చేస్తారు. ఆస్ట్రేలియాతో పాటు బ్రిటన్, అమెరికా, పోర్చుగల్, తదితర దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. భాష, సాహితీ, సాంస్కృతిక రంగాల్లో వచ్చే మార్పులను, పరిణామాలను చర్చించే లక్ష్యంతో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జరగనుంది. కాగా ఈ సందర్భంగా గతేడాది దివంగతుడైన నటుడు, సాహితీ ప్రముఖుడు గిరీష్ కర్నాడ్‌తో పాటు మరో ఇద్దరు ప్రముఖులను స్మరించుకోనున్నారు.

రాజ్యాంగంపై ప్రత్యేక చర్చలు
ఈసారి వేడుకల్లో భారత రాజ్యాంగం మూలస్వభావంపైన ప్రత్యేక చర్చలు ఉంటాయని హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్ తెలిపారు. జస్టిస్ చంద్రచూడ్, రోహిత్ డేలు భారత రాజ్యాంగం పైన, దాని ప్రత్యేకతలు, స్వరూప స్వభావాలపైన ప్రసంగిస్తారు. అలాగే ‘ ది ఐడియా ఆఫ్ ఇండియా ఐడెంటిటీ’ పైన మరో చర్చా ఉంటుంది. కశ్మీర్ అంశంపై ప్రముఖ రచయితలు ప్రసంగించనున్నారు. గాంధీ-అంబేడ్కర్-కాస్ట్, పొయెట్రీ-ఐడెంటిటీ, తదితర అంశాలపై సదస్సులు, చర్చలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళలో ప్రాచుర్యం పొందిన కళారూపం ‘కుడియాట్టం’ ప్రదర్శన ఉంటుంది. నాటక రంగ ప్రముఖులు అనురాధా కపూర్ సారధ్యంలో ‘ బనారస్ కా ఠగ్’ ప్రదర్శన నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ టి.విజయ్ కుమార్, జీఎస్‌పీ రావులు వ్యవస్థాపకులుగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2010లో ప్రారంభమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే.
Published date : 24 Jan 2020 01:47PM

Photo Stories