విద్యామాధ్యమం విద్యార్థులఇష్టం..కోర్టు ఎలా పరిమితం చేస్తుంది?
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: ఆంగ్ల మాధ్యమంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవోలపై కోర్టుకు వెళ్లడానికి గుంటుపల్లి శ్రీనివాస్‌కు ఏం హక్కు ఉందంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు షేక్ మహ్మద్ తోఫిక్, షేక్ వసామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను అక్టోబర్ 28వ తేదీన విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దీపక్‌నార్‌గోల్కర్, ఏకే సాంఘి , న్యాయవాది శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రతివాదులైన గుంటుపల్లి శ్రీనివాస్‌తోపాటు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌కు జతచేసింది. ఆంగ్ల మాధ్యమానికి, ప్రాథమిక హక్కుకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎవరు అనేది కోర్టుకు వివరించకుండానే గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల భవిష్యత్తుకు అన్యాయం చేయవద్దని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం ఆంగ్లం కూడా జాతీయభాష అని పేర్కొన్నారు. ఆర్టికల్ 348లో అన్ని కోర్టుల్లోనూ ఆంగ్లంలోనే వ్యవహరించాలని ఉందని తెలిపారు. ఆంగ్లం జాతీయభాష అయినప్పుడు తెలుగుకే పరిమితం కావాలని కోర్టులు ఎలా చెబుతాయని ప్రశ్నించారు. ఏ మాధ్యమంలో చదువుకోవాలనేది విద్యార్థుల ఐచ్ఛికమని, కోర్టు ఎలా పరిమితం చేస్తుందని ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం ఎంతవరకు చదువుకోవచ్చనేదానిపై ఓ కమిటీ నివేదిక ఇచ్చిందని, తల్లిదండ్రుల అసోసియేషన్ కూడా తమ పిల్లలు ఆంగ్లంలో చదువుకోవాలని కోరుకుంటోందని వివరించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదని, ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిందని పేర్కొన్నారు.
Published date : 29 Oct 2020 04:05PM