ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిత: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Sakshi Education
హైదరాబాద్: మాణిక్యాలై మెరిసిన విద్యార్థినులతో కళాశాల ప్రాంగణం కళకళలాడింది.
ప్రతిభావంతుల కోలాహలం ఉట్టిపడింది. నారాయణగూడలోని రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజ్ 11వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జనవరి 25 (శనివారం)నసందడిగా సాగాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బంగారు పతకాలను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 1,022 మంది విద్యార్థినులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిత ఉంటుందని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, అధ్యాపకుల పాత్రే కీలకమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్న కళాశాల యాజమాన్యం, సిబ్బందిని ఆమె అభినందించారు. తాము చదుకునే రోజుల్లో ఉన్నత చదువులు చదివి అవకాశాల కోసం ఎదురుచూసే వారమని, ఇప్పుడు ఆవకాశాలే వెతుక్కుంటూ వస్తున్నాయని పేర్కొన్నారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, ఫెయిలయ్యామని అధైర్యపడకుండా, భయాందోళనలతో అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, అప్పుడే జీవితంలో ఉన్నతంగా రాణించగలుగుతామన్నారు. మహిళలకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాలు చదువుతూ, జనరల్ నాలెడ్‌జ పెంచుకోవాలన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని, ఆత్మరక్షణ కోసం ప్రతి మహిళా మార్షల్ ఆర్‌ట్సలో మెలకువలు నేర్చుకోవాలని సూచించారు.
Published date : 27 Jan 2020 01:08PM