TS Inter First Year Exams 2021: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ పరీక్షలు రాయాల్సిందే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులంతా ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సబిత స్పష్టం చేశారు.
పరీక్షలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. వీరికి ఫస్టియర్ పరీక్షలు ఐచ్ఛికమనే ప్రచారం తొలుత జరిగింది. కానీ మంత్రి సబిత దీన్ని కొట్టిపారేశారు. విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనంటూ స్పష్టత ఇచ్చారు. దీని వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. కరోనా మూడోదశ ప్రచారం నేపథ్యంలో ఒకవేళ సెకండియర్ పరీక్షలనూ నిర్వహించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఫస్టియర్ మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది.
Published date : 30 Aug 2021 03:43PM