Skip to main content

టీఎస్ పోలీసు శాఖ: కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ టెక్నిక్స్‌ పాటిస్తే...!

సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడే క్షణం త్వరపడుతోంది. ఎన్నాళ్లో వేచిన ఉదయం త్వరలో ఎదురుకానుంది. ఎదురుచూపులు ఫలించే రోజు ఇక ఎంతో దూరంలేదు.

పోలీసు శాఖలో దాదాపు 20 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించడం, ఖాళీల వివరాలను ప్రభుత్వం తెప్పించుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న విషయం పక్కన బెట్టి లక్షలాది మంది యువత రోజూ ఉదయం శారీరక పరీక్షలు, రోజంతా రాత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య దాదాపు 8 లక్షలు దాటవచ్చని పోలీసుశాఖ అంచనా వేస్తోంది. అందుకే, అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు పోలీసు శాఖ కొన్ని మెళకువలు విడుదల చేసింది.

Check TS Police Jobs Study Material, Previous Papers and Practice Tests 

అవి ఏంటంటే...
ఫిట్‌నెస్ పరీక్ష ఇలా

పోలీస్ విభాగంలోని కానిస్టేబుళ్లతోపాటు ఎస్‌ఐ, ఫైర్, డిప్యూటీ జైలర్స్, జైలు వార్డర్స్, కమ్యూనికేషన్ ఎస్‌ఐ, కమ్యూనికేషన్స్‌ కానిస్టేబుల్ మొదలైన విభాగాలకు శారీరక సామర్థ్య పరీక్షలు ఒకేవిధంగా ఉంటాయి. రాతపరీక్షలో కొద్దిపాటి తేడాలుంటాయి. శారీరక సామర్థ్య పరీక్షల తర్వాత రాతపరీక్షకు సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల రాత పరీక్షకు కూడా మొదటి నుంచే ప్రాధాన్యం ఇవ్వాలి. పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా పరుగు పోటీలలో ఉత్తీర్ణత సాధించినవారికి శారీరక సామర్థ్య పరీక్షలు(పీఈటీ) జరుగుతాయి. క్లిష్టమైన ఈ దశలో విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో కసరత్తు చేయాలి. శారీరక సామర్థ్య పరీక్షల కోసం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సాధన చేయాలి. రన్నింగ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 5 రకాల ఈవెంట్స్‌ను పూర్తిచేయాలి. ఈవెంట్స్‌లో చూపిన ప్రతిభను సివిల్ కానిస్టేబుళ్ల ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. కానీ, ఏఆర్, ఏపీఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఎస్‌ఏఆర్‌సీపీసీఎల్ కేటగిరీల పోస్టులకు ఈవెంట్స్ మార్కులను కూడా కలిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిజికల్ ఈవెంట్స్‌లో ఒక్కోదానికి 15 మార్కులు కేటాయించారు. 5 విభాగాలకు మొత్తం 75 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి.

800 మీటర్ల పరుగు
ఈవెంట్స్‌లో 800 మీటర్ల పరుగుపోటీని అభ్యర్థులు 170 సెకన్లలో పూర్తిచేయాలి. అన్ని జిల్లాల్లోనూ 400 మీటర్ల ట్రాక్‌పై ఈ పందేన్ని రెండు రౌండ్లలో పూర్తిచేయాలి. దీనికోసం మంచి గ్రౌండ్‌ను ఎంచుకొని 200 మీటర్ల ట్రాక్‌పై సాధన చేయాలి. ఇదే ట్రాక్‌పై 170 సెకన్లలో 800 మీటర్ల పరుగు పూర్తయ్యే విధంగా సాధన చేస్తే సెలక్షన్లలో 4 నుంచి 5 సెకన్ల సమయం మిగులుతుంది. పరుగులో ముఖ్యంగా అభ్యర్థి కాలి అంగల దూరం పెంచుకునేటట్లు సాధన చేయాలి. ట్రాక్‌పై రన్నింగ్‌లో మొదటి నుంచే వేగం అందుకోవాలి.

100 మీటర్ల పరుగు
ఈ పరుగు పందేన్ని పురుష అభ్యర్థులు 15 సెకన్లలో, మహిళాఅభ్యర్థులు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అభ్యర్థి పరిగెత్తాల్సింది 100 మీటర్లే కాబట్టి అభ్యర్థులు సమయం వృథా కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ పాయింట్, ముగింపు పాయింట్ మీదే దృషి ఉండాలి. పరుగు ప్రారంభించేటప్పుడే వేగం పెంచి చివరివరకు కొనసాగించాలి.

లాంగ్ జంప్ ఎలా?
లాంగ్ జంప్.. అభ్యర్థి దూకే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష. పురుష అభ్యర్థులు 3.80 మీటర్లు, మహిళాఅభ్యర్థులు 2.75 మీటర్లు దూకాలి. దీనికోసం అభ్యర్థులు ముందుగా దూకే పద్ధతులు, టెక్నిక్‌లను తెలుసుకోవాలి. స్టాండింగ్ జంప్, రన్నింగ్ జంప్ విధానాల ద్వారా సాధన చేయాలి. టేకాఫ్ బోర్డు వైపు నిలబడి 10 నుంచి 15 సార్లు ఇసుకలోకి స్టాండింగ్ జంప్ సాధన చేయాలి. తర్వాత సెవెన్ స్టెప్స్, అంటే టేకాఫ్ బోర్డుకు 7 మీటర్ల దూరం తీసుకొని పరిగెత్తుతూ ఇసుకలోకి జంప్ చేయాలి. దీన్ని 10 సార్లు సాధన చేశాక టేకాఫ్ బోర్డుకు 20 మీటర్ల దూరం నుంచి పరిగెత్తుతూ జంప్ చేయాలి.

షాట్‌పుట్ ఇలా..
షాట్‌పుట్ ఈవెంట్‌లో పురుషులు 7.26 కి.గ్రా. బరువు గల ఇనుప గుండును 5.60 మీటర్ల దూరం విసరాలి. మహిళా అభ్యర్థులు 4 కి.గ్రా. ఇనుప గుండును 4.50 మీటర్లు విసరాలి. దీనికోసం అభ్యర్థులు సాధన చేయాలి.

హైజంప్ ఇలా..
హైజంప్ పోటీలో అభ్యర్థులు 1.20 మీటర్లు దూకాలి. ఒకేసారి 1.20 మీటర్లు లక్ష్యంగా సాధన చేయకుండా హైజంప్ కర్రను కొంచెం, కొంచెం పెంచుకుంటూ సాధన చేయాలి. మొదటి వారం 100సెం.మీ., తర్వాత వారం 1.10 మీటర్లు, తర్వాత 1.20 మీటర్లు... ఇలా హైజంప్ పోల్స్‌పై ఉండే కర్ర ఎత్తును పెంచుకుంటూ సాధన చేయాలి.

Published date : 21 Dec 2020 03:55PM

Photo Stories