Skip to main content

టీచర్ల పదోన్నతుల విషయమై.. నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేసిన విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులపై సందిగ్ధం వీడలేదు.
గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు పైబడిన పోస్టుల పదోన్నతులకు సంబంధించి ఏకీకృత సర్వీసు నిబంధనలు అడ్డంకిగా మారిన నేపథ్యంలో వాటిపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు సైతం పదోన్నతులపై తీవ్రంగా కసరత్తు చేశారు. విద్యాశాఖలో రెండు రకాల యాజ మాన్యాలు ఉండగా.. స్థానిక సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యాల మధ్య సర్వీసు నిబంధనల అంశం పెండింగ్‌లో ఉంది.

మూడు అంశాలపై ప్రతిపాదనలు..
ఉపాధ్యాయుల పదోన్నతులతోపాటు టెట్ పరీక్ష నిర్వహణ, పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి సబితారెడ్డి సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వీసు నిబంధనలతో ఇబ్బందులు లేని కేటగిరీలు, వారికి పదోన్నతి ఇచ్చే అంశంపై చర్చించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో సీనియార్టీ జాబితాలు రూపొం దించి ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అన్ని కేటగిరీల్లో పదోన్నతులు చేపట్టే అంశంపై ప్రాథమిక సూచనలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఐదోతరగతి వరకు మాన్యువల్ తరగతులు వద్దనే నిర్ణయానికి వచ్చారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసంఈ నెల 18 నుంచి స్కూళ్లు తెరవాలని సూచించారు. ఈ మూడు అంశాలపై ప్రతిపాదనలు రూపొందించి బుధవారం ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది.

సీనియార్టీ జాబితాలు కొలిక్కి..
సెకండరీ గ్రేడ్ టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి పదోన్నతి కల్పించేందుకు అవసరమైన సీనియార్టీ జాబితాలను సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. జిల్లాల్లో అందుబాటులో ఉన్న సీనియార్టీ జాబితాలను ఇప్పటికే ప్రదర్శించారు. వీటిలో అభ్యంతరాలను స్వీకరిస్తూ సర్దుబాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో ఉన్న ఈ సీనియార్టీ జాబితాలను ఉమ్మడి జిల్లా డీఈవోలే పర్యవేక్షిస్తున్నారు. ఈ జాబితాలు దాదాపు కొలిక్కి వచ్చినప్పటికీ పదోన్నతులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం ఈ జాబితాలు ఫైనల్‌కు చేరతాయి.
Published date : 07 Jan 2021 06:18PM

Photo Stories