టీచర్ల బదిలీ దరఖాస్తు గడువు నేటి వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి/యర్రగొండపాలెం: టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో విలేకరుల సమావేశంలో కూడా వెల్లడించారు. బదిలీలపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. టీచర్ల బదిలీలపై టీడీపీ రాజకీయం చేస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. టీడీపీ హయాంలో బదిలీలు జరిగినప్పుడు జిల్లాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడి ఎవరు సస్పెండ్ అవుతారో అని భయపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అంతా పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఖాళీలు బ్లాక్ చేయటం ఇప్పుడు కొత్తేమి కాదని, బ్లాక్ చేసిన వివరాలు కూడా వెల్లడిస్తున్నామని తెలిపారు. మొత్తం 4 కేటగిరీల్లో 16,008 ఖాళీలు బ్లాక్ చేయటం జరిగిందన్నారు. ఆప్షన్‌కు మొత్తం ఖాళీలు 32,889 ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు చర్చించామని, మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఎంతో ఉపయోగం అన్నారు. వెబ్ ఆప్షన్‌లో మంగళవారం ఉదయం 11.45 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58.55 శాతం, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 66.49 శాతం మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని, 76,110మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో వెబ్‌ఆప్షన్‌లో 44,561 మంది పాల్గొన్నారని వెల్లడించారు. కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగిన తరువాత మరోసారి బదిలీల ప్రక్రియ చేపడతామని తెలిపారు.
Published date : 16 Dec 2020 03:18PM