Skip to main content

సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగ హక్కు: టీఎస్ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం, ఇతర అలవెన్స్ లు, పదోన్నతులు ఇవ్వకుండా చేసే కుట్ర, కుతంత్రం, దోపిడీకి గురిచేయడానికే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారని హైకోర్టు మండిపడింది.

సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) వంటి చట్టబద్ధ సంస్థలో రెగ్యులర్ నియామకాలు చేపట్టకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. జీహెచ్‌ఎంసీలో గత పదేళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్న 98 మంది శానిటేషన్, ఎంటమాలజీ వర్కర్స్, శానిటరీ, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్స్ సర్వీసును 2 నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీ కరించే వరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పిటిషనర్లకు వేతనం, ఇతర అలవెన్స్ లు వర్తింపజేయాలని స్పష్టంచేసింది. జీహెచ్ ఎంసీలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాసచారితో పాటు మరో 97 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ఈ మేరకు ఇటీవల తీర్పునిచ్చారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఖాళీలను ఎప్పటికప్పుడు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

పిటిషనర్ల వాద న ఇదీ..
‘‘పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి 2008-11 మధ్య పిటిషనర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో జీహెచ్‌ఎంసీ నియమించుకుంది. ఎటువంటి ఆరోపణలు లేకుండా పదేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేశారు. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మా సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోరాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగ్జీత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విన్నవించాం. ఈ రెండు తీర్పులను జీహెచ్‌ఎంసీ ఉల్లంఘించింది. మేం బానిసల్లాగా పనిచేయాలని భావిస్తోంది. మాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు చట్టబద్ధ సంస్థ విఘాతం కల్గిస్తోంది. 2009, 2018లో మా సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి వినతిపత్రం సమర్పించాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మా సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశించండి’’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.

జీహెచ్‌ఎంసీ ఏమందంటే..
‘‘పిటిషనర్లను జీహెచ్‌ఎంసీ నేరుగా నియమించుకోలేదు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వారిని నియమించుకున్నాం. వారికి వేతనాలు ఎంత ఇవ్వాలన్నది సదరు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చూస్తాయి. వారి జీతభత్యాలతో జీహెచ్‌ఎంసీకి సంబంధం ఉండదు. వీరి ఎంపిక ప్రక్రియ కూడా వేరుగా ఉంటుంది. వీరిని నియమించుకున్న ఏజెన్సీలను ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చలేదు. శానిటేషన్ వర్కర్స్, ఎంటమాలజీ వర్కర్స్ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.14 వేలకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్స్‌కు రూ.12 వేల నుంచి రూ.14,500కు పెంచుతూ మునిసిపల్ శాఖ 2017లో ఉత్తర్వులు జారీచేసింది. వీరి నియామకానికి మేం ఎటువంటి నోటిఫికేషన్ జారీచేయలేదు. వీరి నియామకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. కాబట్టి వీరికి ఉమాదేవి కేసు వర్తించదు. ఎన్‌ఎంఆర్/డైలీ వేజ్/కంటింజెంట్ ఎంప్లాయిగా పిటిషనర్లను జీహెచ్‌ఎంసీ నేరుగా నియమించుకోలేదు. వీరికి ఏజెన్సీ/కాంట్రాక్టర్ వేతనాలు ఇచ్చారు. వీరి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు నిబంధనలు అనుమతించవు’’అని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు.

Published date : 13 Aug 2020 03:14PM

Photo Stories